చిరంజీవి మాటలకు సర్కారు సిగ్గుపడాలి

Thursday, December 19, 2024

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని అనుకున్నారు. ఆయన తొలి ప్రయత్నంలో ప్రజలు పరిమితంగానే పార్టీని ఆశీర్వదించారు. రాజకీయరంగంలో ఉండే కుట్రలు కూహకాలు వ్యూహాలు, గుంట నక్కల ప్రపంచంలో తాను ఇమడలేను- అని చిరంజీవి చాలా తొందరగానే అర్థం చేసుకున్నారు. తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసి తిరిగి సినిమారంగానికి వెళ్ళిపోయారు. మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేది లేదు అని కూడా స్పష్టం చేసేసారు. మంచోచెడు సినిమాలలోనే జయపజయాలను లెక్కచేయకుండా ముందుకు సాగుతున్నారు. సొంత తమ్ముడు పార్టీ పెట్టి ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నా, చిరంజీవి ఏనాడూ మళ్ళీ రాజకీయాల ప్రస్తావన తేకుండా తన వ్యవహారం చూసుకుంటున్నారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి నోరు తెరిచి ఒక మాట అన్నారంటే దానిని ప్రభుత్వం కూడా పాజిటివ్ గానూ, సీరియస్ గాను తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ వైఫల్యాల గురించి చిరంజీవి నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే దానిపై ప్రభుత్వం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది.

‘‘పేదోడి కడుపు నింపడం మానేసి చిత్ర పరిశ్రమను ఆడిపోసుకుంటారు ఎందుకు?’’ అంటూ చిరంజీవి ప్రశ్నించారు. బ్రో సినిమా నేపథ్యంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ చిత్ర పరిశ్రమ మీద విరుచుకుపడుతుండడం గమనిస్తున్నాం. ఈ సమయంలో మెగాస్టార్ చిరంజీవి తన వాల్తేరు వీరయ్య 200 డేస్ ఉత్సవంలో పాల్గొంటూ.. ‘‘మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం గురించి, ప్రాజెక్టులు, ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి. పేదవారి కడుపు నింపే దిశగా ఆలోచించాలి. అలా చేస్తే అందరూ మీకు తల వంచి నమస్కరిస్తారు. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటి?’’ అని చురకలు అంటించారు.

చిరంజీవి మాటలన్నీ అక్షర సత్యాలు. కొన్ని సంవత్సరాల పాటు ఆయన కడుపులో రగులుతూ ఉండిపోయిన కోపానికి, చాలా సాత్వికమైన ప్రతిరూపంగా బయటకు వచ్చిన మాటలు. అయితే ఈ మాటలను కూడా అధికార పార్టీ నాయకులు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఉడికిపోతున్నారు. చిరు మాటలు తమకు రాజకీయంగా సమాధి కడతాయేమోనని భయపడుతున్నట్లుగా వారి వైఖరి కనిపిస్తుంది.

హోదా గురించి ప్రతిపక్షంలో ఉండగా అనేక అవాకులు చెవాకులు పేలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వచ్చిన తరువాత చాలా సక్సెస్ ఫుల్ గా ఆ డిమాండ్ ను సర్వనాశనం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్క రోడ్డు కూడా శుభ్రంగా లేకుండా గోతులమయంగా తయారై ఉండగా, వాటిని బాగు చేయడం గురించి కూడా పట్టించుకోవడం లేదు. ఒక కొత్త ప్రాజెక్టు నిర్మించిన, లేదా, సగంలోఉన్న ప్రాజెక్టును పూర్తి చేసిన చరిత్ర ఈ ప్రభుత్వానికి లేదు. ఉన్న పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు వెళ్ళగొడుతున్నారు తప్ప కొత్త పరిశ్రమలను తీసుకువచ్చి కల్పించిన ఉద్యోగ అవకాశాలు లేవు. ఇలాంటి ప్రధానమైన సమస్యలను చిరంజీవి ప్రస్తావించినప్పుడు సిగ్గుపడి తమ పనులను తామే సమీక్షించుకోవాల్సిన ప్రభుత్వ పార్టీలోని నాయకులు అందరూ మందలాగా ఆయన మీద విమర్శలతో విరుచుకుపడుతున్నారు. వారిలోని భయానికి నిదర్శనంగా ఈ వైఖరి కనిపిస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles