జనసేన తమకు మిత్రపక్షమని ఆంధ్రప్రదేశ్ లోని భారతీయ జనతా పార్టీ నాయకులు ఇదివరకు కూడా ప్రకటిస్తూనే వచ్చారు. కానీ తమ పార్టీలు రెండు మిత్ర పక్షాలని తాము ఒక జట్టుగా పనిచేస్తున్నామనే నమ్మకాన్ని కమల దళం కార్యకర్తలలో కల్పించలేకపోయారు. సోము వీర్రాజు రాష్ట్ర పార్టీ సారధిగా ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ జనసేనతో కలిసి కార్యక్రమాలను నిర్వహించడం గురించిన ఆలోచన సాగలేదు. ఇప్పుడు దగ్గుబాటి పురందేశ్వరి పగ్గాలు స్వీకరించిన తర్వాత పరిస్థితిలో మార్పు వస్తోంది. బాధ్యతలు స్వీకరించిన తొలి నాటి నుంచి జనసేనతో స్నేహపూర్వకంగా మెలగడం గురించి పురందేశ్వరి చెబుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ తో త్వరలోనే తాను భేటీ అవుతానని ఆయన వీళ్లను బట్టి కలిసి ఉమ్మడిగా కార్యక్రమాల రూపొందించడం గురించి చర్చిస్తామని పురందేశ్వరి చెబుతున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని అంటుండగా పురందేశ్వరి మాత్రం మాట తూలకుండా.. పొత్తుల విషయం అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని సెలవిస్తున్నారు.
అయితే జనసేనతో కలిసి ఉమ్మడిగా తాము కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్లే వాతావరణం ఉంటే చాలు.. పార్టీ బలోపేతం అవుతుందని బిజెపి కార్యకర్తలు భావిస్తున్నారు. ఇప్పటిదాకా అలాంటిది జరగకపోవడం పార్టీకి పెద్ద లోటు అని వ్యాఖ్యానిస్తున్నారు. దగ్గుబాటి పురందేశ్వరి సానుకూల దృక్పథంతో ఉన్న నేపథ్యంలో పార్టీ బలోపేతం కావడంపై కార్యకర్తల్లో ఆశలు పెరుగుతున్నాయి.
భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఘోరంగా ఉంది. వారికి గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసినప్పుడు వచ్చిన ఒక్కశాతం ఓటు బ్యాంకు అయినా ఇంకా పదిలంగా వారి ఖాతాలోనే ఉన్నదా లేదా? అనేది సందేహమే! విభజన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని ప్రజలు ఎన్నటికీ మరచిపోలేరు. కాకపోతే.. ఇంతరపార్టీలతో కలిసి అడుగులు వేస్తే.. వారి పట్ల ఉండే ఆదరణతో.. వీరికి కూడా కొంత ప్రాధాన్యం దక్కవచ్చు. అంతే తప్ప.. ‘పొత్తుల్లో పోటీచేస్తే పార్టీ సొంతంగా బలపడేది ఎప్పుడు? మనం ఒంటరిగా వెళ్తేనా ఆ తర్వాత ఎన్నికలనాటికైనా బలపడతాం..’ లాంటి ఊకదంపుడు సలహాలు.. పార్టీకి చేటుచేసేవేతప్ప లాభం చేకూర్చవు అనేది.. ఎక్కువ మంది కార్యకర్తల అభిప్రాయం. అందుకే తెదేపాతో పొత్తుల సంగతి తర్వాత అధిష్ఠానం నిర్ణయించేదే అయినప్పటికీ.. ముందు పవన్ తో తాము పొత్తుల్లో ఉన్నామనే భావన కలిగేలా.. ఉమ్మడి కార్యక్రమాలు చిన్నమ్మ పురందేశ్వరి సారథ్యంలో మొదలవుతాయని కార్యకర్తలు ఆశిస్తున్నారు.