బిజెపి ఎంపీ కూడా కాంగ్రెస్ గూటికేనా?

Monday, December 23, 2024

తెలంగాణలో ఇప్పుడు ఫిరాయింపు రాజకీయాలు చాలా ముమ్మరంగా నడుస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులకోసం ‘చేరికల కమిటీ’ అనిఒకటి ఏర్పాటుచేసినది గానీ.. ఆ కమిటీ సాధించిన ఫలితాలు.. రాబట్టిన వికెట్లు తక్కువ. అదే సమయంలో ప్రత్యేకంగా ఇలాంటి కమిటీ ఏదీ లేకపోయినప్పటికీ.. కాంగ్రెసులోకి వలసలు కాస్త ఎక్కువగా జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న పార్టీని రకరకాల కారణాల వల్ల వద్దని అనుకుంటున్న వారికి.. తెలంగాణలో బిజెపి కంటె కూడా కాంగ్రెస్ మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నట్టుగా ఉంది. కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావుల సంగతి మాత్రమే కాదు.. తాజాగా ఒక బిజెపి ఎంపీ కూడా కాంగ్రెసు వైపు చూస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

భారతీయ జనతా పార్టీకి ఆదిలాబాద్ నుంచి సోయం బాపూరావు ఎంపీగా ఉన్నారు. ఇటీవలి కాలంలో విపరీతంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఎంపీ కూడా ఆయనే. ఎంపీ లాడ్స్ నిధులను తనకు ఇల్లు నిర్మించుకోవడానికి, తన కొడుకు పెళ్లికి వాడుకున్నానని చెబుతున్న ఆడియో వైరల్ కావడంతో.. కేవలం ఎంపీ సోయం బాపూరావు పరువు మాత్రమే కాదు, బిజెపి పరువు కూడా పోయింది. అయితే సోయం మాత్రం.. సొంత పార్టీలోనే తనమీద కుట్రపూరితంగా ఇలాంటి ఫేక్ ఆడియో విడుదల చేశారంటూ.. ఆరోపణలు గుప్పించారు. తాను ఎంపీ లాడ్స్ వాడుకోలేదని అన్నారు. అయితే.. భారతీయ జనతాపార్టీ నాయకత్వం సకాలంలో స్పందించి.. ఆయన విమర్శలకు మళ్లీ పార్టీ నాయకులు స్పందించకుండా ఆపింది. ఒకకరినొకరు నిందించుకుంటూ పార్టీ పరువు తీయకుండా ఆపింది. అయితే పార్టీలో తన మనుగడ ప్రశ్నార్థకం అయిందనే సంగతి సోయం బాపూరావుకు అర్థమైనట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయన ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా కనిపిస్తోంది.

సోయం బాపూరావు ఆదివాసీ తుడుందెబ్బ సంస్థకు రాష్ట్ర అధ్యక్షుడుగా ఉండేవారు. ఆయన ఇటీవల ఆ పదవికి రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు తుడుందెబ్బ కమిటీ.. తాము వచ్చే ఎన్నికల్లో అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలనుంచి పోటీచేస్తాం అని ప్రకటించింది. రెండు ఎస్టీ లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ గురించి కూడా ఆలోచిస్తున్నాం అని ప్రకటించారు. అయితే.. రాష్ట్రంలోని మిగిలిన ఎస్టీ నియోజకవర్గాల విషయంలో కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి పోటీచేస్తాం అని అంటోంది. స్థూలంగా గమనిస్తే.. తుడుందెబ్బ మద్దతు కాంగ్రెస్ కే దక్కుతున్నదని అర్థమవుతోంది. మొన్నమొన్నటిదాకా సోయం బాపూరావు నాయకత్వం వహించిన తుడుందెబ్బ ఇప్పుడు కాంగ్రెస్ భజన చేస్తున్న తీరు గమనిస్తే.. త్వరలోనే సోయం కూడా కాంగ్రెస్ గూటికి చేరుతారనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles