కడపలో పట్టపగలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శ్రీనివాసులు రెడ్డి హత్యకు గురయ్యారు. జిమ్ కు వెళ్లి బయటకు వచ్చిన ఆయనపై బురఖాల్లో పొంచి ఉన్న వ్యక్తులు వేటకత్తులతో దాడిచేసి హత్యచేశారు. ఆయనను కత్తులతో నరుకుతున్న దృశ్యాలు కూడా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పోలీసులు ఓ వంద సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి మొత్తానికి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. భూ వివాదాలకు సంబంధించిన పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త హత్యకు గురి కాగానే.. ఆ పార్టీ నాయకులు చాలా నీచరాజకీయం ప్రారంభించారు. ఒక వైపు హత్య జరిగిన వెంటనే కూడా.. పోలీసులు ఇది భూతగాదాల నేపథ్యంలో జరిగినదని అనుమానాలు వెల్లడించినప్పటికీ.. సీఎం జగన్మోహన్ రెడ్డి మేనమామ, ఎమ్మెల్యే రవీంద్రనాధ రెడ్డి మాట్లాడుతూ.. ఈ హత్యను తెలుగుదేశం పార్టీ మీదకు నెట్టడానికి ప్రయత్నించారు. చాలా అసహ్యకరమైన దిగజారుడు ప్రయత్నం చేశారు.
హత్య చేసిన వాళ్లు చాలా సామాన్యులు ఉంటారని, వాళ్లు మామూలు మనుషులే అయి ఉంటారని.. ఇది మామూలే అని.. కానీ వారి వెనుక ఉండి హత్య చేయించిన వారు ఎవరో వారిని పట్టుకోవాలని రవీంద్రనాధ రెడ్డి నీతులు చెప్పారు. తద్వారా తెలుగుదేశం నాయకులు తెర వెనుక నుంచి చక్రం తిప్పి ఈ హత్య చేయించినట్లుగా రంగు పులమడానికి ప్రయత్నించారు. అంతకంటె ఒక మెట్టు కిందికి దిగజారి.. నారా లోకేష్ కడప జిల్లాలో తన పాదయాత్ర పూర్తి చేసుకుని వెళ్లిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ హత్య జరగడాన్ని ప్రధానంగా పరిగణించాలని ఆయన వ్యాఖ్యానించారు. అంటే నారా లోకేష్ కడపలోని కేడర్ కు సూచనలు చేసి.. సదరు వైసీపీ కార్యకర్త హత్యకు పురమాయించి వెళ్లారనేంత రేంజిలో రవీంద్రనాధ రెడ్డి ఆరోపణలు చేశారు. కానీ ఒక్కరోజు కూడా గడవక ముందే.. పోలీసులు హత్యకు పాల్పడిన వారిని పట్టుకున్నారు. హత్య మోటివ్ కూడా తెలిసిపోయింది. ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి వక్రబుద్ధితో తెలుగుదేశానికి, నారా లోకేష్ కు హత్యానేరాన్ని పులమడానికి ప్రయత్నించినట్టు కూడా ప్రజలకు అర్థమైంది. తెలుగుదేశం పార్టీకి హత్యారాజకీయాలు తెలియదని, వారిని వారే చంపుకుని, తెలుగుదేశం మీదకు నెపం నెట్టే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని ఆ పార్టీ వారు అంటున్నారు.