శ్రీవాణి : ట్రస్టు నిధుల లెక్కచెబితే చాలదు!

Sunday, January 19, 2025

తిరుమల శ్రీవాణి ట్రస్టు రూపంలో భక్తులకు వీఐపీ దర్శన టికెట్లు విక్రయిస్తూ వసూలు చేస్తున్న సొమ్ముల గురించి.. ఇప్పుడు చాలా పెద్ద వివాదం రేకెత్తుతోంది. శ్రీవాణి దర్శన టికెట్ల కోసం వసూలు చేస్తున్న సొమ్ములకు రసీదులు ఇవ్వడం లేదని, ఆ రూపేణా వసూలు చేసిన సొమ్ములు దుర్వినియోగం అవుతున్నాయని, స్వాహా చేస్తున్నారని రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. శ్రీవాణి ట్రస్టు నిధుల గురించి.. చంద్రబాబునాయుడు కూడా ఆరోపణలు చేశారు. ఆ తర్వాత అదే ఆరోపణలను జనసేనాని పవన్ కల్యాణ్ కూడా అందిపుచ్చుకోవడంతో ఇంకా సంచలనంగా మారింది. టీటీడీ ఈవో ధర్మారెడ్డి గానీ, పాలకమండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి గానీ.. ఈ ఆరోపణల్ని ఖండించారు. దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ, ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల ఖర్చుల నిమిత్తం ఈ సొమ్మును వెచ్చిస్తున్నామని, అంతా చాలా పారదర్శకంగా జరుగుతోందని వారు పేర్కొన్నారు.

శ్రీవాణి ట్రస్టు కు అందుతున్న నిధులు, వాటిని వెచ్చిస్తున్న తీరుపై టీటీడీకి క్లీన్ చిట్ ఇప్పించుకోవడానికి వివిధ మఠాధిపతులు, వివిధ వర్గాల ప్రముఖులతో ఈవో ఓ సమావేశం కూడా నిర్వహించారు. ఇందులో విశ్వహిందూపరిషత్ నాయకులు, ఆరెస్సెస్ ప్రతినిధులు, పతంజలి సంస్థల ప్రతినిధులు.. చిన్నచిన్న మఠాలకు చెందిన స్వాములు ఉన్నారు. వీరందరూ కలిసి శ్రీవాణి ట్రస్టు పై వస్తున్న ఆరోపణలకు సంబంధించి.. పూర్తిగా కొట్టి పారేశారు. అంతా చాలా క్లీన్ గా జరుగుతున్నదని సెలవిచ్చారు. టీటీడీ ధర్మప్రచారం కోసం ఏర్పాటుచేసిన ఈ ట్రస్టుపై తప్పుడు ప్రచారం తగదని కూడా వారు సెలవిచ్చారు.

వీరందరూ ఇచ్చిన మద్దతుతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి కూడా.. శ్రీవాణి ట్రస్టు నిధుల గురించి త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని కూడా చెప్పేశారు. అయితే ఇంకా అనేక సందేహాలు అలాగే మిగిలిపోయి ఉన్నాయి. ఎందుకంటే-

ఆరోపణలు చేస్తున్న వారు, శ్రీవాణి ట్రస్టుకు అందిన నిధులు స్వాహా అవుతున్నాయని, దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించడం తక్కువ. శ్రీవాణికి సంబంధించి ప్రధానమైన ఆరోపణ ఏంటంటే.. ఈ వీఐపీ టికెట్లకు రసీదులు ఇవ్వడం లేదనేది! అంటే వీఐపీ టికెట్లు విక్రయించిన వాటిలో చాలా వరకు అసలు ట్రస్టుకు డబ్బులు అందడమే లేదని ఆరోపణలు వస్తుండగా.. ట్రస్టుకు జమ అయిన డబ్బులు ఖర్చు పెడుతున్న తీరు గురించి అధికారులు వివరిస్తున్నారు. ఇది అసలు విషయాన్ని వదిలేసి, ఇంకేదో మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతోంది. శ్రీవాణి ట్రస్టు కు పదివేల విరాళం ద్వారా మరో 500 రూపాయలకు వీఐపీ టికెట్ పొందవచ్చు అనేది ఈ పథకం. అయితే దీనికోసం ఏర్పాటుచేసిన కౌంటర్ల ద్వారా అమ్మే టికెట్ల డబ్బు పద్ధతిగానే ట్రస్టుకు అందుతోంది. అయితే వీఐపీ దర్శన టికెట్ ను రూ.500కు సిఫారసు లెటర్ల ద్వారా పొందగలిగిన దళారులు వాటిని.. శ్రీవాణి దర్శనం అనే ముసుగులో భక్తులకు రసీదు లేకుండానే విక్రయించేస్తున్నారు. ఇలాంటి అక్రమాలకు ఆస్కారం లేదని చెప్పగల స్థితిలో అదికారులు ఉన్నారా అనేది ప్రశ్న. అలాంటి బ్లాక్ మార్కెటింగ్ వ్యవహారాలు జరిగితే అరికట్టగల స్థితిలో అధికారులు ఉన్నారా? అనేది ప్రశ్న. దానికి సమాధానం చెప్పకుండా.. ట్రస్టుకు వచ్చిన డబ్బుల లెక్కలు చూపించడం వల్ల, శ్వేతపత్రం వల్ల ప్రయోజనం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles