జనసేనాని పవన్ కల్యాణ్ ఈనెల 14 వ తేదీనుంచి వారాహి యాత్రకు సిద్ధపడుతుండడం.. ఆయన ప్రస్తుత కార్యచరణ ప్రణాళికలో ఒక పార్శ్వం మాత్రమే. 2024 ఎన్నికలకు సంబంధించి.. పవన్ కల్యాణ్ ప్రస్తుతం అంతకంటె సీరియస్ కసరత్తులో నిమగ్నం అయి ఉన్నారు. రకరకాల చవకబారు విమర్శల ద్వారా ఆయనతో మైండ్ గేమ్ ఆడడానికి, ఆయన రాజకీయాల మీద ఫోకస్ పెంచకుండా డైవర్ట్ చేయడానికి వైసీపీ దళాలు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాయి. అయితే పవన్ కల్యాణ్ ఏమాత్రం రెచ్చిపోకుండా నింపాదిగా తన పని తాను చేసుకుపోతున్నారని పార్టీ వర్గాల సమాచారం.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం తమ జనసేన తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాభిప్రాయాన్ని అంచనా వేయడానికి నియమించిన సర్వే సంస్థలకు చెందిన ప్రతినిధులతో వరుస సమావేశాలు అవుతున్నారు. ఏయే నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో వారిద్వారా తెలుసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారన్ని, సర్వే సంస్థల ద్వారా అందుతున్న సమాచారంతో సమన్వయం చేసుకుని ఒక నిర్ణయానికి రావడానికి పవన్ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ప్రధానంగా రాష్ట్రంలో తాను ఏ నియోజకవర్గాల నుంచి పోటీచేస్తే విజయావకాశాలు మెండుగా ఉంటాయో సర్వే సంస్థల ద్వారా పవన్ తెలుసుకుంటున్నారు. కేవలం తన ఒక్కరి గురించే కాకుండా.. అసలు జనసేన పార్టీకి ఎక్కడెక్కడ విజయావకాశాలు పుష్కలంగా ఉంటాయో ఆయన తెలుసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుల విషయంలో బేరమాడడానికి, వారినుంచి ఎన్ని, ఏయే సీట్లను అడిగి తీసుకోవాలో నిర్ణయించుకోవడానికి ఈ కసరత్తు చాలా ముఖ్యం అని పార్టీ సోర్సెస్ చెబుతున్నాయి.
తమ పార్టీని బరిలోకి దించదలచిన నియోజకవర్గాల విషయంలో పవన్ చాలా నిర్మొగమాటంగా, నిర్దాక్షిణ్యంగా, ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీకి దగ్గరగా మెలిగే నాయకులు ఉన్నారు కదాని, తనతో సన్నిహిత సంబంధాలు కొనసాగించే నాయకులు అనే ప్రాతిపదిక కాకుండా.. ఏ నియోజకవర్గాల్లో పార్టీ గెలిచే చాన్సుందో అక్కడ మాత్రమే పోటీకి దిగాలని అనుకుంటున్నారు. ఇలాంటి నిర్ణయం వల్ల పార్టీలో పలువురికి అసంతృప్తి కలిగినాసరే.. వారిని బుజ్జగించాల్సిందే తప్ప.. చేజేతులా ఓటమి కొనితెచ్చుకోకూడదని, తద్వారా జగన్ కు మేలు చేయకూడదని ఆయన చాలా ఖండితంగా ఉన్నట్టు తెలుస్తోంది.
‘నిర్మొగమాటంగా’ వ్యూహరచనలో జనసేనాని
Friday, November 22, 2024