చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా.. పేదలకోసం పెళ్లికానుక పథకాన్ని ప్రారంభించారు. వివాహం అనేది పేదల కుటుంబాలకు భారంగా మారుతూ వచ్చిన నేపథ్యంలో.. ప్రతి పేద కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఎంతో కొంత ఆదుకోడానికి ఈ పెళ్లికానుక పథకం ఉపయోగపడింది. ఆ పథకం సూపర్ హిట్ అయింది కూడా. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే.. చంద్రబాబునాయుడుకు మంచి పేరు తెచ్చిన అనేకానేక పథకాలను తొలగించేసినట్టే పెళ్లి కానుక పథకాన్ని కూడా తొలగించేశారు. ఆ రకంగా పేదల ఉసురుపోసుకున్నారు.
అవసరం ఉన్నా లేకపోయినా.. ప్రతి ఇంటికీ డబ్బు పంచేసి ఓటు బ్యాంకును తయారుచేసుకునే కుట్ర ఆలోచనలతో అనేక స్కీములు ప్రారంభించిన జగన్.. పేదలకు ఆర్థిక భారంగా తయారయ్యే పెళ్లి వంటి సందర్భాల్లో ఆదుకోడానికి ఉద్దేశించిన పెళ్లికానుక పథకాన్ని మాత్రం కాలరాచారు.
అయితే ఇప్పుడు ఎన్నారై శ్రీనివాస్ ఆ పథకాన్ని స్వచ్ఛందంగా తమ ఫౌండేషన్ నిధులతో మళ్లీ ఆచరణలో పెట్టడానికి సంకల్పించారు. ఉయ్యూరు ఫౌండేషన్ ను నిర్వహిస్తున్న ఎన్నారై శ్రీనివాస్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో చంద్రన్న పెళ్లికానుక పథకాన్ని తామే ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు అన్ని వర్గాల పేద కుటుంబాలకు సాయం అందుతుంది. పెళ్లి గురించిన వివరాలను నమోదు చేసుకుంటే వధువు ఖాతాలో ‘చంద్రన్న పెళ్లి కానుక’గా రూ.25వేలు డిపాజిట్ చేస్తారు. పేదల వైపునుంచి చంద్రన్న పెళ్లికానుక పథకాన్ని పునరుద్దరించాలని, అవసరమైతే జగన్ పేరు పెట్టుకోవచ్చునని అనేక వినతులు వచ్చినా జగన్ పట్టించుకోలేదు. చివరికి ఉయ్యూరు ఫౌండేషన్ తరఫున శ్రీనివాస్ కనీసం ఒక నియోజకవర్గం పరిధిలో స్వచ్ఛందంగా దీనిని అమల్లోకి తేవడం విశేషం.
ఉయ్యూరు శ్రీనివాస్ గుంటూరు ప్రాంతంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు. సంక్రాంతి సందర్భంగా పేదలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చంద్రబాబు చేతులమీదుగా చేపట్టారు. ఆ సందర్భంగా తొక్కిసలాట జరిగి మహిళలు చనిపోయారు కూడా. కోట్లరూపాయల ప్రజాసేవకు ఉదారంగా ముందుకొచ్చిన ఉయ్యూరు శ్రీనివాస్ మీదనే పోలీసులు కేసులు పెట్టి వేధించారు. అయినా సరే.. ఆయన భయపడలేదు. ఇప్పుడు చంద్రన్న పెళ్లికానుకతో మళ్లీ ప్రజాదరణ పొందిన, జగన్ కిల్ చేసిన, చంద్రబాబు పథకానికి ఊపిరి పోస్తున్నారని పలువురు ప్రశంసిస్తున్నారు.
అధికారం లేకున్నా.. పేదలకు చంద్రన్న పథకం!
Saturday, November 16, 2024