తమ ప్రభుత్వానికి ఒక మూలస్తంభంగా ఆ సమయంలో ఉన్నటువంటి లాలూప్రసాద్ యాదవ్ జైలు పాలు కాకుండా రక్షించడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ పట్ల దేశమంతా అప్పట్లో భగ్గుమంది. అది తమ సొంత పార్టీ తెచ్చిన ఆర్డినెన్స్ అనే జాలి కూడా లేకుండా.. రాహుల్, ప్రజల నిరసనలకు విలువ ఇస్తూ.. పార్లమెంటులో ఆర్డినెన్స్ కాపీలను చించి పారేయడం.. ఆయన ఆ ప్రభుత్వానికి అప్రకటిత సర్వాధికారి గనుక.. ఆయన వ్యతిరేకతను మన్నించి కాంగ్రెస్ సర్కారు ఆర్డినెన్స్ విషయంలో వెనక్కు తగ్గడం జరిగింది. లేకపోతే పరిస్థితి ఇంకో రకంగా ఉండేదేమో. ఇవాళ రాహుల్ లోక్ సభ సభ్యత్వానికి ‘అనర్హుడు’ కాకుండా ఉండేవాడేమో.
‘‘భారతదేశానికి కాబోయే ప్రధాని’’ అనే ట్యాగ్ లైన్ ను చిరకాలంగా బరువుగా మోస్తున్న రాహుల్ గాంధీ.. ఇప్పుడు అసలు ఎంపీగానే అనర్హుడు అయ్యారు. దేశరాజకీయాల్లో ఇదిచాలా పెద్ద పరిణామం. సంచలనం కూడా.
‘దొంగల ఇంటిపేరు మోదీ’ అంటూ అర్థం వచ్చేలాగా నరేంద్రమోడీ గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ కు ఆ క్రిమినల్ కేసులో సూరత్ కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో పార్లమెంటు ఆయన మీద అనర్హత వేటు వేసింది. సూరత్ కోర్టు తీర్పు చెప్పిన రోజునుంచే ఆయనపై అనర్హత వేటు అమల్లోకి వస్తుందని కూడా ప్రకటించింది.
ఇప్పుడు రాహుల్ పరిస్థితి ఇరకాటంలో పడింది. మహా అయితే పార్టీ పెద్దలందరినీ తోడు తీసుకుని, మోడీని తిట్టడానికి సిద్ధంగా ఉండే ఇతర పార్టీల నాయకుల్ని కూడా వెంటబెట్టుకుని ఆయన రాష్ట్రపతి వద్దకెళ్లి మొరపెట్టుకోగలరు. కానీ.. ఆయనమీద పడిన అనర్హత వేటు చట్టవ్యతిరేకమైన వేధింపు చర్య ఎంతమాత్రమూ కాదు. పైగా ఈ అనర్హత వేటు శాశ్వతం ఏమీ కాదు. సూరత్ కోర్టు తీర్పు ఇచ్చింది గనుక.. తక్షణం ఈ అనర్హత అమల్లోకి వచ్చింది. పైకోర్టుకు వెళ్లి అప్పీలు చేసుకోవడానికి రాహుల్ కు అవకాశం ఉంది. ఆయన పైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోగలిగితే.. అనర్హత వేటు ఆగుతుంది. పైకోర్టు ఏకంగా ఆయన మీద కేసును కొట్టేస్తే గనుక..పూర్తిగా అసలు అనర్హత ఆలోచనే చేయనక్కర్లేదు. కానీ అది జరిగేదాకా ఆయన వేచిచూడాలి.
పైకోర్టు కూడా దీనిని ధ్రువీకరిస్తే మాత్రం ఆ తీర్పు ఈ దేశంలో సంచలనం అవుతుంది. మరో ఎనిమిదేళ్ల పాటూ రాహుల్.. మోడీని తిట్టడానికి తప్ప ఎన్నికల రాజకీయాల్లో కనిపించరు. రెండేళ్ల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చినా, ఆ తర్వాత మరో ఆరేళ్లపాటూ ఎన్నికల్లో పోటీచేయడానికి అవకాశం ఉండదు. అదే జరిగితే.. ఆయన వచ్చే ఎన్నికల్లో దేశప్రధాని అయిపోతారని కలలు గంటున్న అనేకమంది కాంగ్రెస్ నాయకులకు భంగపాటు అవుతుంది. అయినా, తన మీద పడిన అనర్హత వేటు గురించి రాష్ట్రపతి వద్దకెళ్లడం విమర్శలు గుప్పిస్తూ ప్రభుత్వం కక్ష సాధిస్తున్నట్టుగా ప్రచారం చేయడం లాంటి మార్గాలు వదలి.. రాహుల్ పైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంటే కనీసం అనర్హత తప్పుతుంది.
రాహుల్ అనర్హత .. సంచలనమే కానీ..
Friday, November 15, 2024