సోమువీర్రాజుకు పాపం ఎంత కష్టం వచ్చిందో!

Friday, November 15, 2024

ఆయనకు లక్కీగా పదవికి ఎక్స్‌టెన్షన్ వచ్చింది. ఆయన పదవి పోతుందని పార్టీలోనే అందరూ ఊహిస్తున్న తరుణంలో, ఆయన వచ్చేఎన్నికల దాకా ఢోకాలేని రీతిలో పదవిలో స్థిరపడ్డారు. అలాగని పార్టీ నాయకుల్లో ఆయనకు ఆదరణ ఉన్నదా అంటే అదీ లేదు. మొన్నమొన్నటిదాకా గుసగుసలు పోయిన వాళ్లంతా ఇప్పుడు బాహాటంగానే సోము అసమర్థతల గురించి చర్చించుకుంటున్నారు. అధికారంలేని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి లాగా.. ఆపద్ధర్మ పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఏపీ బిజేపీని ఏలుతున్నారు. దీనికి తోడు ఆయనకు పాపం ఇతర కష్టాలు కూడా అనేకం.
ఒకవైపు పవన్ కల్యాణ్.. బిజెపి కేంద్ర నాయకత్వం గొప్పది, మంచిది అంటూ రాష్ట్రశాఖ మాత్రం కలిసి రావడం లేదని సూటిగా సోము వైఖరి మీదనే విమర్శలు గుప్పిస్తారు. అయితే సోము వీర్రాజు వాటిని నేరుగా ఖండించలేరు. పవన్ కల్యాణ్ తీరును కూడా ఎండగట్టాలని ఆయనకు ఉంటుంది. కానీ.. జాతీయ పార్టీకిక రాష్ట్ర నాయకుడు గనుక, అధిష్టానం దయతో పదవిలో కొనసాగుతున్నవాడు గనుక.. ఆయన పల్లెత్తి మాటాడలేరు. చాలా మంది చాలా రకాల కామెంట్స్ చేస్తుంటారు. కాబట్టి పవన్ వ్యాఖ్యలపై స్పందించలేను అని మాత్రం సెలవిస్తారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీ సహకరించ లేదని ఎమ్మెల్సీ మాధవ్ చాలా ఘాటుగానే తిట్టిపోసినా.. కనీసం ఆ స్థాయిలో కూడా సోము వీర్రాజు మాట్లాడలేరు. మరోకోణంలో చూసినప్పుడు.. పవన్ కల్యాణ్ మద్దతు పొందడానికి ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేసిన ప్రయత్నం ఏంటో కూడా మనకు తెలియదు. కానీ.. పవన్ సహకరించలేదని, తమకు అనుకూలంగా కనీసం ఒక మాట మాట్లాడలేదని కూడా విమర్శించలేరు. పవన్ సహకారం లభించిందో లేదో అందరికీ తెలుసు అంటూ.. అస్పష్టంగా చెబుతారు.
పాపం సోము వీర్రాజుకు ఎన్ని కష్టాలు వచ్చాయో అనిపిస్తుంది ఇదంతా చూస్తే. మేం వైసీపీకి ప్రతిపక్ష పాత్రనే పోషిస్తున్నాం అంటే.. ఎవరూ నమ్మడం లేదని సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ పాలనను తాను రోజూ విమర్శిస్తున్నా ఆ విమర్శలను ప్రజల నమ్మడం లేదనేది ఆయన ఆవేదన. నాయకుడిగా సొంత పార్టీలోని ఇతరుల నమ్మకాన్నే పొందలేకపోతున్న సోము వీర్రాజు విమర్శలను ప్రజలు మాత్రం ఎలా నమ్ముతారు? అనేది పలువురికి కలుగుతున్న సందేహం. చాలా కాలంనుంచి జగన్ అనుకూల కమల నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సోము వీర్రాజు.. త్వరలో జగన్ పాలనపై చార్జిషీట్ తెస్తారట. అందులో ఎంత చిత్తశుద్ధి ఉంటుందో, జగన్ భక్తి ఉంటుందో.. దాని ద్వారా ఏం సాధిస్తారో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles