ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం పూర్తయి వారు అధికారికంగా పదవుల్లోకి వచ్చిన వెంటనే ఒకసారి మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందనే వార్త కొన్ని వారాలుగా వినిపిస్తోంది. కులాల సమీకరణలు సమతూకంతో కనిపించేలాగా, పార్టీ ప్రతిష్ట పెంచేలాగా కొత్త ఎమ్మెల్సీలలో నలుగురైదుగురికి మంత్రి పదవులు ఇవ్వబోతున్నారనేది తాడేపల్లి వర్గాల సమాచారం. ఆమేరకు క్యాబినెట్లో కొందరికి ఉద్వాసన తప్పదు. వేటు వేసేటప్పుడు అసమర్ధత ఒక్కటే ప్రధానమైన కొలబద్దగా గమనిస్తారనేది అందరికీ తెలిసిన సంగతి. అయితే ఈ క్రమంలో భాగంగా తన మీద ఎట్టిపరిస్థితుల్లోనూ వేటుపడుతుందని ఆల్రెడీ అర్ధమైన ఒక మంత్రి ఇప్పుడు త్యాగరాజు బిల్డప్పులు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి క్యాబినెట్లో కులాల సమతూకం పాటించడానికి వీలుగా అవసరమైతే తాను తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన త్యాగానికి సిద్ధపడుతున్నారు. ఆ మంత్రి మరెవ్వరో కాదు.. చిన్న వయసులోనే క్యాబినెట్ మంత్రిగా అవకాశం దొరికినప్పటికీ.. ఆ గౌరవాన్ని కాపాడుకోవడంలో విఫలమైన సీదిరి అప్పలరాజు!
క్యాబినెట్లో మార్పులు చేయడం అంటూ జరిగితే మున్ముందుగా వేటుపడేది అప్పలరాజు మీదనే అనే విషయం ఆల్రెడీ మీడియాకు లీక్ అయింది. దాంతో అప్పలరాజు ముందుగానే పరువు కాపాడుకునే పనిలోపడ్డారు.. రేపు తనను మంత్రిగా తొలగించినా సరే.. అది వేటు వేయడం కాదని, తానే స్వచ్ఛందంగా మంత్రి పదవికి రాజీనామా చేశానని బిల్డప్ ఇచ్చుకోవడానికి ఆయన ఉబలాటపడుతున్నారు. ఆయన తాజా ప్రకటనతో వేటు పడే లిస్టులో ఆయన మొదటి వ్యక్తి అనేది అందరికీ తెలిసిపోయింది.సీదిరి సంగతి తేలిపోగా, వేటుకు సిద్ధం కావాల్సిన మంత్రులు ఇంకా ఎవరెవరు అనే సంగతి బయటకు రాలేదు.
జగన్మోహన్ రెడ్డికి ఈ కులాల పిచ్చి ఎలా పట్టుకున్నదో తెలియదు. కులాల వారీగా సమాజాన్ని విడగొట్టి వారికి మంత్రి పదవులు తాయిలాలుగా పంచి పెడితే చాలు అనే భావన ఎలా ఏర్పడిందో తెలియదు. జగన్‌కు వీర విధేయుడుగా పని చేయగల ఎవరో ఒకరికి మంత్రి పదవి కట్టబెట్టి అందలం ఎక్కించినంత మాత్రాన, ఆ కులానికి చెందిన ప్రజలు సమస్తంగా ఆయనకు ఎందుకు రుణపడి ఉండాలో తెలియదు. వ్యక్తులకు పదవులు ఇవ్వడాన్ని రాజకీయ ప్రచారాంశంగా వాడుకోవడానికి ఉపయోగించుకోగలరు. అయితే వాస్తవంగా ప్రజలందరూ ముఖ్యమంత్రిని ప్రేమించాలంటే.. కులాల లెక్కలు చెప్పకుండా సమిష్టిగా చేసిన అభివృద్ధి అనేది వారందరికీ కనిపించాలి. ఈ సత్యాన్ని ముఖ్య మంత్రి అర్థం చేసుకుంటే బాగుంటుంది.