వసంతకు మంత్రి పదవి బిస్కెట్ వేశారా?

Monday, December 23, 2024

చాలా కాలంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద,  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తితో వేగిపోతున్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు తాజాగా మంత్రి పదవి ఆఫర్ వచ్చిందా? ఇటీవల తన తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,   ఆయనకు మంత్రి పదవిని ఎరగా వేశారా?  అనే చర్చోపచర్చలు ఇప్పుడు పార్టీ వర్గాల్లో నడుస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో పోటీ చేయబోయేది లేదు,  ముఖ్యమంత్రి ఇప్పుడే ఈ నియోజకవర్గానికి కొత్త ఇన్చార్జిని నియమించుకుంటే బెటర్..  అని ప్రకటనలు గుప్పించి..  పార్టీ పట్ల ధిక్కారస్వరాన్ని వినిపించిన వసంత కృష్ణ ప్రసాద్ వైఖరిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. . ఆయన కూడా అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు లాగా..  ఇప్పుడు తన నియోజకవర్గంలో వాలంటీర్లతో గృహసారథిలతో సమావేశాలు నిర్వహిస్తూ..  వచ్చే ఎన్నికలలో పార్టీ తిరిగి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత వాలంటీర్లతో మాత్రమే అని వాక్రుచ్చుతున్నారు!

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పరిస్థితి ఆ నియోజకవర్గంలో పొమ్మనలేక పొగబెట్టినట్లుగా తయారైందనే మాట నిజం.  తన నియోజకవర్గంలో నివాసం ఉంటూ ఇక్కడే అధికారులందరూ కూడా తన మాటే వినాలని తరహాలో అధికార దర్పం ప్రదర్శిస్తున్న మంత్రి జోగి రమేష్ వైఖరి చాలా కాలంగా వసంతకు విసుగు పుట్టించింది.  జోగి రమేష్ మీద పలు సందర్భాలలో ఆరోపణలు చేసిన వసంత రాజకీయ సన్యాసానికి కూడా సిద్ధపడ్డారు. 

పాపం ఆయన వేరే గత్యంతరం లేక సీఎం జగన్ వద్ద పంచాయతీ పెట్టారు. తన వర్గం అనుకునే లోకల్ లీడర్లందరినీ తీసుకువెళ్లారు. కానీ ఫలం దక్కలేదు. సీఎం వారికే సుతిమెత్తగా ఎదురు క్లాస్ పీకారు. వారందరూ కలిసి జోగి రమేష్ మీద పితూరీలు చెబితే.. జగన్ వారితో, జోగిరమేష్ మనం తయారు చేసుకున్న నాయకుడు సర్దుకుపోండి అని చెప్పాడే తప్ప రాజీ కుదిర్చలేదు. తర్వాత కూడా వసంత శాంతించలేదు. పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉన్నారు. 

తాజాగా ముఖ్యమంత్రి జగన్ .. మంత్రివర్గాన్ని కొద్దిగా మారుస్తున్నారు. కులసమీకరణలకు పెద్దపీట వేస్తున్నారు. ప్రస్తుతానికి కేబినెట్లో కమ్మ కులస్తులు లేరు. కమ్మవారికి కేబినెట్ బెర్త్ ఇవ్వకపోతే ఆ వర్గంలో అపకీర్తి అని భయపడుతున్నారు. ప్రస్తుతం కులాలవారీగా విస్మరణకు గురైన కొందరికి ముందు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి తర్వాత.. వారిని మంత్రులుగా కూడా చేయాలని జగన్ ఆలోచన. కొత్తగా ఒక ఎమ్మెల్సీ సీటును కమ్మవారికి కేటాయించి వృథా చేయకుండా.. కమ్మ వర్గం నుంచి వసంత కృష్ణప్రసాద్ కు పదవి ఇస్తే పోతుందని ఆలోచన చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఆయనను ప్రత్యేకంగా పిలిపించి మంత్రి పదవి ఆఫర్ గురించి చెప్పినట్టుగా వినవస్తోంది. మంత్రి పదవి ఎరగా వేయగానే వసంత వైఖరిలో పూర్తి మార్పు వచ్చేసింది. ఆయన ఇక పూర్తి స్థాయిలో పూనకం తెచ్చుకుని, వాలంటీర్లతో మీటింగులు పెట్టుకుని, గతానికి భిన్నంగా, మళ్లీ పార్టీని గెలిపించే బాధ్యత మీదే అనే ఉద్బోధలు చేస్తున్నారని స్థానికంగా ప్రజలు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles