అవినాష్‌ రెడ్డిలో అరెస్టు భయం!

Thursday, December 18, 2025

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక సూత్రధారిగా అవినాష్ రెడ్డి విమర్శలు ఎదుర్కొంటున్నారు. మూడేళ్లుగా 248 మందిని విచారించిన సీబీఐ ఇప్పటిదాకా అవినాష్ ను మాత్రం విచారించలేదు. అయితే పూర్తి వివరాలు సేకరించిన తర్వాత మాత్రమే ఆయనను ప్రశ్నించాలని సీబీఐ నిర్ణయించుకున్నట్టుగా గతంలో కూడా వార్తలు వచ్చాయి. తాజాగా అయిదురోజుల కిందట సీబీఐ నోటీసులు ఇవ్వగా, తేదీ మార్పు కోరిన అవినాష్ శనివారం హైదరాబాదులోని సీబీఐ కార్యాలయానికి వచ్చి నాలుగు గంటల పాటు విచారణను ఎదుర్కొన్నారు.
అయితే ఈ సందర్భంగా ప్రజలకు మాత్రం అనేక అనుమానాలు కలుగుతున్నాయి. విచారణకు రమ్మని పిలిచిన సీబీఐ తనను అరెస్టు చేస్తుందనే భయం ఆయనలో ఉన్నట్టుందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే.. సీబీఐ విచారణకు శనివారం అవినాష్ తో పాటు.. ఆయన అనుచరులు, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు చాలా పెద్ద సంఖ్యలో సీబీఐ కార్యాలయం వద్దకు హాజరయ్యారు.
అవినాష్ రెడ్డి గతంలో సీబీఐ విచారణ కడపలో జరిగినంత కాలం ఆ అధికారుల పట్ల కూడా దురుసుగా ప్రవర్తించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. తన అనుచరుడు శివశంకర్ రెడ్డిని అరెస్టు చేసినందుకు ఆయన సీబీఐ అధికార్ల మీద ఒక రేంజిలో ఫైర్ అయ్యారు. కోర్టు లోనే సీబీఐ అధికారిని నేరుగా నిలదీస్తూ నా అనుచరుడిని ఎందుకు అరెస్టుచేస్తారని ప్రశ్నించారు.
అదే సమయంలో.. కడపలో విచారణ జరుగుతున్న సమయంలో సీబీఐ అధికార్లకు కొందరినుంచి బెదిరింపులు కూడా వచ్చాయి. సీబీఐ విచారణ, కోర్టు విచారణ జరుగుతున్న సందర్భాల్లో అవినాష్ రెడ్డి తన అనుచరులు సహా అక్కడకు వచ్చి హంగామా స‌ృష్టిస్తూ వచ్చారు. అయితే కడపలో విచారణ సాగినంత కాలం ఒక తీరుగా ఉన్న సీబీఐ పనితీరు.. హైదరాబాదుకు విచారణ మారిన తర్వాత వేగం పుంజుకున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక అవినాష్ రెడ్డి హస్తం ఉన్నట్టుగా నిరూపించే అనేక ఆధారాలను పోలీసులు సేకరించారని, ఆ ఆధారాలను దగ్గరుచుకునే విచారణకు పిలిచారని అనుకుంటున్నారు. కాబట్టి, విచారణ పేరుతో హైదరాబాదుకు పిలిచి.. కొన్ని గంటల విచారణ తర్వాత.. అరెస్టు చేస్తున్నట్టుగా సీబీఐ అప్పటికప్పుడు ప్రకటిస్తుందనే భయం అవినాష్ లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందుకే చాలా పెద్ద మందీ మార్బలంతో, అభిమానులతో సీబీఐ ఆఫీసుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అరెస్టు చేస్తారనే భయం ఉన్నదని, అదే జరిగితే తమ వైపునుంచి ప్రతిఘటన, వ్యతిరేకత తెలియజేయడానికే అంతదరు జనంతో వెళ్లినట్టుగా పలువరు భావిస్తున్నారు. అవినాష్ రెడ్డి మాత్రం.. సీబీఐ మళ్లీ విచారణకు పిలిచినా సరే.. తప్పకుండా వచ్చి హాజరవుతానని చెప్పడం విశేషం.

No tags for this post.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles