టైటిల్ రిలీజ్‌కే.. బ్రేకులు రెడీచేస్తున్న మేరుగు!

Monday, December 23, 2024

నారాలోకేష్ పాదయాత్రకు సంబంధించి కేవలం టైటిల్ మాత్రమే రిలీజ్ అయింది. ఇంకా రూట్ మ్యాప్ కూడా రాలేదు. కానీ ఈ మాత్రానికే వైసీపీ నాయకుల్లో కంగారు మొదలైందా అనే అనుమానం కలుగుతోంది. యాత్రను వారు ఓర్వలేరు అనేది తెలిసిన సంగతే. కాకపోతే..కేవలం టైటిల్ ప్రకటించినంత మాత్రాన్నే యాత్రను అడ్డుకుని తీరుతాం, ఊరూరా అడ్డుకుంటాం అంటూ మంత్రి మేరుగు నాగార్జున రెచ్చిపోతున్నారు. అందరికంటె ముందే రెచ్చిపోయి నారా లోకేష్ పాదయాత్రకు వార్నింగులు ఇస్తే తమ పార్టీ అధినాయకుడి దృష్టిలో పడతామని ఆయన ఆరాటపడుతున్నట్టుంది.
రాష్ట్రంలో దళితులను హీనంగా చూసే వ్యక్తి చంద్రబాబునాయుడు అని మేరుగు విమర్శించారు. ఆయన వాడుకుని వదిలేస్తారని అన్నారు. 2024 ఎన్నికల్లో అన్ని కులాలు కలిసి జగన్ ను మంచి మెజారిటీతో గెలిపిస్తారని కూడా అన్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కొన్న సంవత్సరాలుగా దళితుల విషయంలో చంద్రబాబునాయుడు మీద బురద చల్లడానికి ఏ స్క్రిప్టునైతే వైసీపీ దళాలు నిత్యపారాయణంలా పఠిస్తున్నాయో.. అదే స్క్రిప్టును మేరుగు నాగార్జున కూడా చదివారు. అదంతా సరే.. దానికి నారా లోకేష్ పాదయాత్రకు ఏమిటి సంబంధం?
ప్రభుత్వం అనుమతి తీసుకుని (ఆ విషయంలో వాళ్లు తేడా చేస్తే కోర్టు ద్వారా అయినా అనుమతి తెచ్చుకోవడం గ్యారంటీ), ఒక రాజకీయ నాయకుడు రాష్ట్రంలో పాదయాత్ర చేస్తోంటే.. ప్రభుత్వంలో భాగంగా బాధ్యతాయుతమైన మంత్రిగా ఉన్న వ్యక్తి దానిని అడుగడుగునా అడ్డుకుంటాం అని చెప్పడంలోని విజ్ఞత ఏమిటో అర్థం కావడంలేదు. కానీ ఈ మాటల ద్వారా ఆయన వైసీపీ దళాలకు, ప్రత్యేకింంచి ఎస్సీలకు ఒక పిలుపు ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. నారా లోకేష్ పాదయాత్రకు ఊరూరా ఆటంకాలు కలిగించాలని ఆయన కోరుకుంటున్నట్లుగా ఉంది.
కానీ మేరుగు నాగార్జున కావొచ్చు, ఇతర వైసీపీ నాయకులు ఎవరైనా కావొచ్చు.. నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రను అడ్డుకోవడం ద్వారా ఏం సాధించదలచుకుంటున్నారు? అసలే ప్రభుత్వం అరాచకంగా ప్రతిపక్షాల గళం తొక్కేస్తున్నదని విమర్శలు విపరీతంగా వినిపిస్తున్నాయి. పాదయాత్రను కూడా అడ్డుకుంటే,చికాకులు సృష్టిస్తే.. అది కాస్తే నారా లోకేష్ పట్ల సానుభూతిగా మారదని వారు అనగలరా? అలా జరిగితే ఎడ్వాంటేజీ లోకేష్ కే అవుతుంది. తమ పాలన అద్భుతం అనే ధీమా వారికి ఉంటే..ఇలాంటి పాదయాత్రలు వంద జరిగినా నిమ్మళంగా ఉండాలి.. ఎవరి యాత్రలతోనూ తమకు దెబ్బ పడదనే ధైర్యం ఉండాలి. అలా కాకుండా.. ఇలా ఉలికిపడడంలో మతలబేమిటో తెలియడంలేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles