రెడ్లు అందరూ ఇంటిదారి పట్టాల్సిందేనా?

Thursday, November 14, 2024

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమకు ఒళ్లంతా పులుముకుని ఉన్న కులం బురదను కొద్దిగానైనా కడుక్కోవాలని అనుకుంటోందా? రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే పెద్దపీట వేస్తున్నారని, తతిమ్మా అన్ని కులాలను తొక్కేస్తున్నారని సర్వత్రా ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తున్నానని చెప్పుకోవడానికి కేబినెట్ కూర్పును ఉదాహరిస్తుంటారు. అక్కడ కులాల తూకం లెక్కలు చెప్తారు. కానీ.. రాష్ట్రంలో కీలకమైన అన్ని స్థానాల్లోనూ కేవలం రెడ్లు మాత్రమే ఉన్నారని, కీలకమైన నామినేటెడ్ పోస్టులు అన్నీ రెడ్లకు మాత్రమే కట్టబెడుతున్నారనే విమర్శలు ఈనాటివి కాదు. అయితే ఈ అపకీర్తిని తొలగించుకోవడానికి, ఎట్ లీస్టు తగ్గించుకోవడానికి ఇప్పుడిప్పుడే జగన్ సర్కారు దృష్టి పెడుతున్నట్టుగా కనిపిస్తోంది. జగన్ ఏలుబడిలో రెడ్డి కులాన్ని ఎంతగా నెత్తిన పెట్టుకుంటున్నారనే సంగతి బాహాటంగా అందరికీ కనిపించేదే గనుక.. ప్రజల్లో తమ పట్ల ఏహ్యభావం పెరగకుండా.. వచ్చే ఎన్నికల సమయానికి కులాల తూకం కనిపించేలాగా స్కెచ్ వేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్ని నామినేటెడ్ పదవులనుంచి రెడ్డి వర్గం వారిని ప్రస్తుతం తొలగించే ఆలోచనతో ఉన్నారని సమాచారం. టీటీడీ ఛైర్మన్ గా జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డిని తొలగించడం అనేది దాదాపుగా ఖరారైంది. కొత్త బోర్డుకు ఛైర్మన్ గా రెడ్డి తప్ప ఇతర వర్గం వారిని పెడతారని తెలుస్తోంది. ఇదే సూత్రాన్ని ఇతరత్రా అనేక పదవులు, కీలక నామినేటెడ్ పోస్టులకు వర్తింపజేస్తూ.. రెడ్డి వర్గం వారిని ప్రస్తుతానికి పక్కనపెట్టే ఆలోచేన చేస్తున్నట్టుగా వాదనలు వినిపిస్తున్నాయి. 

ఏ కీలక పోస్టులో చూసినా రెడ్లు మాత్రమే ఉంటారనే విమర్శ జగన్ తొలినాటినుంచి ఎదుర్కొంటున్నారు. పైగా అందుకు ఆయన వెరవడం లేదు. నా ఇష్టం అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఎన్నికల నాటికి ఈ పరిస్థితిలో మార్పు తేవాలనేది తాజా వ్యూహం. ఎందుకంటే.. రెడ్లకు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో, ఎన్ని పదవులు కట్టబెడుతున్నారో.. సోషల్ మీడియాలో రోజురోజుకూ విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దానిని అడ్డుకోవడం లేదా అదంతా అబద్ధం అని చెప్పడం సర్కారుకు చేతకావడం లేదు. 

చంద్రబాబునాయుడు ఇటీవల విజయనగరం జిల్లాలో ఇదేం ఖర్మ కార్యక్రమాల్లో మాట్లాడుతూ.. విశాఖ రాజధాని పేరుతో ఉత్తరాంధ్రపై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్న జగన్, టీటీడీ బోర్డులో గానీ, పదులసంఖ్యలో ఉన్న ప్రభుత్వ సలహాదారుల్లో గానీ ఒక్క ఉత్తరాంధ్రవారికి కూడా అవకాశం ఇవ్వలేదని దుమ్మెత్తిపోశారు. ఇలాంటి విమర్శలు ప్రజలపై ప్రభావం చూపిస్తాయని వైసీపీ వ్యూహకర్తల ఆందోళన. అందుకే ఇప్పుడు టీటీడీకి వేయబోయే కొత్తబోర్డులో ఉత్తరాంధ్ర బీసీ వారికి చోటుంటుందని కూడా తెలుస్తోంది. టీటీడీ మొదలుగా అనేక నామినేటెడ్ పోస్టులనుంచి ప్రస్తుతం ఉన్న రెడ్డి కులం వారిని తొలగించి బీసీలు, ఎస్సీ ఎస్టీలతో నింపుతూ.. తమ ప్రభుత్వం చాలా గొప్పది అని చాటుకోవడానికి జగన్ వ్యూహరచన చేస్తున్నట్టుగా అమరావతి వర్గాలు అనుకుంటున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles