రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తొలగింపు అనేది రచ్చరచ్చగా మారుతోంది. ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు మూడువేల మంది వరకు పెన్షనర్లను జాబితాలనుంచి తొలగిస్తున్నారు. ఈ వైఖరిమీద.. ప్రభుత్వ పోకడల మీద అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ధ్వజమెత్తుతున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో ఒక్క పెన్షన్ తొలగించినా ఊరుకునేది లేదని అంటున్నారు.. ఇలాంటి నేపథ్యంలో.. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ మాత్రం మౌనంగా ఉంటోంది. ప్రభుత్వ దుర్నీతిని ఎండగట్టడానికి పూనుకోకుండా మీనమేషాలు లెక్కిస్తోంది.
నిజానికి పెన్షన్లు తొలగిస్తున్నారంటే.. ప్రధానంగా ముందుకు రావాల్సింది తెలుగుదేశం పార్టీనే. ఎందుకంటే.. ఈ తొలగింపు ముసుగులో తెలుగుదేశానికి అనుకూలురుగా ఉండేవారందరి పేర్లను కత్తిరిస్తారనేది అందరికీ తెలిసిన సంగతి. అలాంటిది తెలుగుదేశం మాత్రం మిన్నకుండిపోతోంది. నిజానికి ప్రభుత్వ నిర్ణయాల్లో దాదాపుగా ప్రతి చిన్న కుగ్రామానికి కూడా కనెక్ట్ అయ్యే నిర్ణయాలు, ప్రభావితం చేసేవి కొన్నే ఉంటాయి. కొన్ని అంశాల మీద పోరాటాలు చేస్తే .. మారుమూల ప్రజలకు ఎందుకు పోరాడుతున్నారో కూడా అర్థం కాదు. కానీ.. పెన్షన్ల వ్యవహారం అలా కాదు. ప్రతి చిన్న పల్లెలోనూ దీని ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి తెలుగుదేశం ఈ పాటికి ఉద్యమం ప్రారంభించి ఉండాలి.
నిజానికి ఇప్పుడు పెన్షన్ల వ్యవహారం వేడిగా ఉంది. తెలుగుదేశం దానిని వదిలేసి కేవలం రంగా వర్ధంతి చుట్టూ రెండు రోజులుగా రాద్ధాంతం చేస్తున్నారు. గుడివాడ వ్యవహారం ఒక్కటీ నానిని విమర్శిస్తే తమ పార్టీకి చాలు అన్నట్టుగా వారి ధోరణి కనిపిస్తోంది. అంతేతప్ప.. రెండు మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అట్టుడుకుతున్న ప్రజల సమస్య వారికి పట్టడం లేదు. ఇప్పుడు ప్రజలంతా పెన్షన్ల కోసం గగ్గోలు పెడుతున్న సమయంలో మాట్లాడకుండా మౌనం వహించి.. రేపు లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన తర్వాత.. మా ప్రభుత్వం రాగానే పోయిన వారందరికీ పెన్షన్లు ఇప్పిస్తాం అని పడికట్టు హామీలు ప్రకటించినంత మాత్రాన ఏం ఉపయోగం ఉండదు.
లేదా, రేపు మన ప్రభుత్వం వచ్చినా సరే.. ఈ పెన్షన్లు తలకుమించిన భారం అవుతాయి.. ఎంత మందికి కోసేస్తారో కోసేస్తే పోనీ.. ఆ తలనొప్పి మనకు లేకుండా ఉంటుంది. మన ప్రభుత్వం వస్తే భారం తగ్గుతుంది అని తెలుగుదేశం నాయకులు అనుకుంటున్నారేమో కూడా తెలియదు. కానీ.. ప్రజలు సమస్యను ఫీలవుతున్నప్పుడే, రాజకీయ పార్టీగా దానిమీద ఉద్యమిస్తే గౌరవం అని వారు తెలుసుకోవాలి.
పింఛన్ల తొలగింపుపై టీడీపీ నోరెత్తదేం?
Saturday, January 18, 2025