పవన్ కల్యాణ్ ఒకవైపు.. తాను రాజకీయ విమర్శలు చేస్తోంటే వైసీపీ గాడిదలు తన మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ చాలా తీవ్రమైన పదజాలంతో రెచ్చిపోతూ ఉంటారు. కానీ.. అటుతరఫునుంచి వైసీపీ నాయకులు కాదు కదా.. వారి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా తన తీరు మార్చుకోవడం లేదు. పవన్ చేసే రాజకీయ విమర్శలకు, వారు వ్యక్తిగత విమర్శలను మాత్రమే జవాబుగా ఇస్తున్నారు. తద్వారా ప్రజల దృష్టిలో కూడా పలుచన అవుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా తన కడపజిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్ మీద చేసిన విమర్శలే ఇందుకు తార్కాణం.
జగన్ విధానాల మీద పవన్ కల్యాణ్ చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆయన వారాహి వాహనంపై రాష్ట్రవ్యాప్త యాత్ర చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కూడా పూనుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో జగన్ తన కమలాపురం సభలో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ మాదిరిగా నేను ఈ భార్య కాకపోతే మరో భార్య అని నేను అనుకోవడం లేదు’ అంటూ విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయాన్ని గేలి చేసేలా మాట్లాడే లేకిబుద్ధి నుంచి జగన్మోహన్ రెడ్డి బయటకు రాలేకపోతున్నారు. ప్రతి సందర్భంలోనూ పవన్ కల్యాణ్ చేసే విమర్శలకు జవాబు ఇవ్వడం చేతకాని పరిస్థితులు ఎదురైతే.. పవన్ భార్యల గురించి మాట్లాడడం అనేది వైసీపీ నాయకులకు ఒక అలవాటు అయిపోయింది.
జగన్మోహన్ రెడ్డి మాటల్లో చంద్రబాబునాయుడు పట్ల అక్కసు కూడా చాలా స్పష్టంగా బయటపడింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో నిర్వహించిన బహిరంగసభ విజయవంతం కావడం, తెలుగుదేశానికి పూర్వవైభవం వస్తుందని చంద్రబాబు అక్కడ పిలుపు ఇవ్వడం నేపథ్యంలో ఆ ఓర్వలేని తనం జగన్ బయటపెట్టుకున్నారు. చంద్రబాబు మాదిరిగా ఈ రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రం అని నేను అనుకోవడ లేదు.. అంటూ చంద్రబాబు తెలంగాణ రాజకీయ సభలను ఆయన ఎద్దేవా చేశారు. ఆయన బుద్ధి ఎంత కురచగా ఉన్నదంటే.. రెండు మూడు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహించే ప్రతి పార్టీ మిగిలిన రాష్ట్రాలకు ద్రోహం మాత్రమే చేస్తుంది అని చెబుతున్నట్లుగా ఉంది. ఈ లెక్కన జాతీయ పార్టీలన్నీ జగన్ దృష్టికోణంలో ఏమౌతాయో అర్థం కాని సంగతి.
నిజానికి తెలుగురాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోయిన తర్వాత.. తొలి ప్రయత్నంలో తెలంగాణలో కూడా తన పార్టీని పోటీచేయించిన తర్వాత.. ప్రజలు జగన్ ను కూడా దారుణంగా తిరస్కరించారు. ఆ తర్వాత ఆయన తెలంగాణలో రాజకీయం చేతకాక బిచాణా ఎత్తేసి, తన ఆస్తులకోసం కేసీఆర్ తో కుమ్మక్కు అయి అక్కడినుంచి పలాయనం చిత్తగించారనే విమర్శలు పుష్కలంగా ఉన్నాయి. అలా తనకు చేతకాక అక్కడినుంచి మడమ తిప్పి పారిపోయి వచ్చిన జగన్, వైఫల్యాలు ఎదురైనా సరే.. ఎదురునిలిచి తిరిగి తన పార్టీని పునర్నిర్మించాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబు ప్రయత్నాన్ని ఎద్దేవా చేయడం కూడా చాలా చీప్ గా ఉన్నదని అంతా అనుకుంటున్నారు. అటు చంద్రబాబు విషయంలోనైనా, పవన్ విషయంలోనైనా చేసిన విమర్శలు చూస్తోంటే ఆయన బుద్ధి అసలు మారలేదని తెలుస్తోందని అంటున్నారు.
జగన్.. బుద్ధి మారలేదు!
Friday, November 22, 2024