‘జయహో బీసీ’ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకపెద్ సభ నిర్వహించారు. బీసీలకు సీఎం కిరీటం పెట్టడం జరగలేదు గానీ.. అంతకంటె వైభవాన్ని అందిస్తున్నంత రేంజిలో సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. అది బీసీ సభనా.. చంద్రబాబును తిట్టడానికి పెట్టిన సభనా? అన్నట్టుగా నడిపించారు. 80 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంలో సగం సమయం చంద్రబాబు మీద నిందలకే వెచ్చించారు. బీసీలకు తాను ఏ రకంగా కిరీటం పెట్టాడో.. ఉదాహరణలు, గణాంకాల సహా వివరించారు. కేబినెట్ లో 70 శాతం పదవులు బీసీలకే ఇచ్చానన్నారు.పదవులు ఇచ్చారు సరే.. బీసీ మంత్రుల్ని తీసుకెళ్లి ఎవరి జేబులో పెట్టడానికి ఇచ్చారు? ఎవరి ఎదుట బంట్రోతుల్లా విధేయతతో నిల్చోవడానికి పదవులు ఇచ్చారు.. ఇలాంటి ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. బీసీ మంత్రులకు అవమానం అనిపించేలా.. మంత్రుల సంగతి దేవుడెరుగు ఆ మంత్రులు బీసీలు అయినందుకు.. బీసీ కులాల ఆత్మగౌరవం దెబ్బతినేలా అనేక పరిణామాలు జరుగుతున్నాయి.
నోటిదూకుడుకు పేరుప్రఖ్యాతులు గాంచిన జగన్ కు అత్యంత ఆప్తుడైన మాజీ మంత్రి కొడాలి నాని ఓ అద్భుతమైన వాక్యం సెలవిచ్చారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగిరమేష్ తన జేబులో వ్యక్తి అని తేల్చేశారు. జోగి రమేష్ మంత్రిగా ఉండగా.. తనకు, పేర్ని నానికి, వల్లభనేని వంశీకి ఎలాంటి పనులైనా అయిపోతాయని కూడా సెలవిచ్చారు. ఆయనేదో ప్రెవేటు సంభాషణల్లో అన్న మాటలు కావివి. గుడివాడలో బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార సభలోనే ఇలా అన్నారు. మాటల్లో నిత్యం అహంకారం తాండవిస్తూ ఉండే ఈ మాజీ మంత్రి, మామూలు ఎమ్మెల్యే.. ఒక బీసీ మంత్రిని తన జేబులో మనిషి అని చులకనగా మాట్లాడితే.. సదరు బీసీసభలో నాయకులంతా ఆ ప్రసంగానికి ముగ్ధులైన తప్పట్లు కొట్టి తమ ఆమోదం తెలిపడం ఘోరం. బీసీ కులాలను వెన్నెముక గల వ్యక్తులుగా తయారుచేస్తానన్న జగన్.. ఆ పని ఇలాగే చేస్తారా?
అనంతపురం జిల్లా కల్యాణ దుర్గంలో మరో కార్యక్రమం జరిగింది. పార్టీ విస్తృతస్థాయి సమావేశం అది. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. నిర్వాహకులు ఏం అనుకున్నారో ఏమో.. ప్రెస్ మీట్ కు ఒకటే కుర్చీ వేశారు. ఆ కుర్చీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూర్చున్నారు. మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి, బీసీ కులాలకు చెందిన ఉషశ్రీ చరణ్, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, జడ్పీ చైర్ పర్సన్ గిరిజమ్మ అందరూ నిల్చునే ఉన్నారు. 40 నిమిషాలుసాగిన ప్రెస్ మీట్ లో వారికి కూడా కుర్చీ తెప్పించి వేయాలనే జ్ఞానం ఎవ్వరికీ కలగలేదు.
ప్రెస్ మీట్ లో ఉన్న నాయకుల్లో ఒక రెడ్డి మాత్రమే ఉన్నప్పుడు.. ఒక కుర్చీ వేస్తే చాలు కదా.. రెండో కుర్చీ ఎందుకు? అని నిర్వాహకులు అనుకున్నారో ఏమో తెలియదు. బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన నాయకులను అవమానించేలా నిర్వహించారు.
జగన్ వేదికల మీద ఎలాంటి నీతులు అయినా వల్లించవచ్చు గాక. బీసీలను నెత్తిన పెట్టుకుంటున్నట్టు మాటలు చెప్పవచ్చుగాక.. ఆయన పార్టీలో బీసీ మంత్రులకు వాస్తవంగా దక్కుతున్న ఆదరణ, గౌరవం ఇదీ అని ఆయన గుర్తిస్తే బాగుంటుంది.
జగనన్నా.. బీసీమంత్రులకు దక్కే గౌరవం చూశారా?
Saturday, December 21, 2024