తాను సాఫ్ట్, పాజిటివ్ అప్రోచ్ ఉన్న నాయకుల్లాగా కనిపించాలని అనుకుంటారో ఏమో గానీ.. కొందరు నాయకులు మాట్లాడే మాటలు, వారికి భిన్నమైన ఫలితాల్ని ఇస్తుంటాయి. ప్రజల్లో ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని బిల్డ్ చేయడానికి ఉపయోగపడవు. సాధారణంగా ప్రతి వేదిక మీద కూడా.. తనలోని చిత్తశుద్ధిని చాటుకోవడానికి బహుధా ప్రయత్నిస్తూ ఉండే జనసేనాని పవన్ కల్యాణ్.. తాజాగా తూర్పు కాపులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన మాటలు చిత్రంగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే మరీచిత్రమేం కాదు. ప్రజారాజ్యం స్థాపించి.. ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా అదే తరహాలో మాట్లాడారు. అయితే ఆ మాటలు ఆయనకు మేలు చేయలేదు.
ఇంతకూ పవన్ కల్యాణ్ తూర్పు కాపుల సమావేశంలో ఏమన్నారంటే.. ‘‘మీ ఓటును చీలనివ్వకండి.. జనసేనకే వేయాలని చెప్పను. జనసేన మీకోసం నిలబడుతుందనుకుంటే మాకు ఓటు వేయండి.. లేదు, మరో పార్టీ నిలబడుతుందనుకుంటే పూర్తిగా వారికే వేయండి.. మీలో మీరు విడిపోయి మనల్ని మనమే పలచన చేసుకోవద్దు’’అని చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రజారాజ్యం ఎన్నికల ప్రచారంలో ఇంచుమించు ఇలాంటి నొప్పించక తానొవ్వక తరహా డైలాగులు చెప్పేవారు. బాణాల్లాంటి విమర్శలు ప్రత్యర్థుల మీద చేయడానికి మెగాస్టార్ కు మొహమాటం. అందుకే ఆయన ’వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా బాగా చేశారు. చంద్రబాబు కూడా బాగా చేశారు. నేను అంతకంటె బాగా చేస్తాను.. నాకు ఓట్లు వేయండి’ అని అడిగారు. వాళ్లు కూడా బాగాచేసిన భాగ్యానికి నువ్వెందుకని ప్రజలు తిప్పికొట్టారు. సొంత ఊర్లో కూడా గెలవలేదు.
ఆ సంగతి పక్కన పెడితే.. మేం నిలబడతాం అని నమ్మితే మాకు వేయండి తరహా ‘మీఇష్టం’ అనే మాటలు రాజకీయాలకు పనికి రావు. జనసేన మీకోసం అండగా నిలబడుతుంది అనే నమ్మకాన్ని బలంగా కలిగించాలి. మిగిలిన పార్టీలు చెబుతున్న మాటలన్నీ ఏ రకంగా మోసం అవుతాయో వివరించాలి. జనసేనకు ఏ రకమైన చిత్తశుద్ధి ఉన్నదో నమ్మించాలి.. అదేమీ లేకుండా డొంకతిరుగుడు మాటలు కొన్ని విషయాల్లో పనికి రావు.
పైగా పవన్ కల్యాణ్.. తెలంగాణలో 26 కులాలను బీసీల జాబితానుంచి తొలగించారని, తూర్పుకాపులంతా తన వద్దకు వచ్చి అడిగినప్పుడు.. తన చేతిలో అధికారం లేదు గనుక.. ఏమీ చేయలేకపోయానని ఈ సభలో చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఆయన ‘ఏమీ చేయలేకపోవడం’ గురించి మంగళగిరి మీటింగులో ఆయనను ఎవరు అడిగారు? ఎవరూ అడగకుండానే.. తన చేతగానితనం గురించి పవన్ కల్యాణ్ తాను ప్రసంగాల్లో బయటపెట్టుకోవడం ఎందుకు? ఇలాంటి మాటలు పార్టీకి నష్టం చేస్తాయని, ప్రజల్లోకి దూసుకువెళ్లడానికి ఉపయోగపడవని జనసేనాని తెలుసుకోవాలి.