తన పొదిలో ఉన్న సమ్మోహనాస్త్రాల్ని చంద్రబాబునాయుడు ఒక్కటొక్కటిగా బయటకు తీస్తున్నారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని చురుగ్గా తీసుకెళ్తున్న చంద్రబాబు.. వివిధ వర్గాలతో సమావేశాలు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా.. ఏపీలో కుదేలవుతున్న ఆక్వారంగానికి చంద్రబాబు చాలా విలువైన వాగ్దానం ఇవ్వడం, ఎన్నికల ప్రణాళికలో పొందుపరుస్తానని చెప్పడం, అధికారంలోకి వచ్చిన తొలిరోజునే దానికి సంబంధించిన ఫైలుపై సంతకం చేస్తానని అనడం నిజంగా సమ్మోహనాస్త్రమే.
ఆక్వా రంగానికి జోన్ లతో సంబంధం లేకుండా యూనిట్ కు 1.50 రూపాయల విద్యుత్తు చార్జీ వసూలు చేస్తాం అని చంద్రబాబునాయుడు ప్రకటించారు. జగన్ సర్కారు విద్యుత్తు సంస్కరణల్లో రకరకాల మార్పులు తీసుకువస్తున్న నేపథ్యంలో కుదేలై దెబ్బతింటున్న అనేకానేక రంగాల్లో ఆక్వా కూడా ఒకటి. అయితే ఆక్వా రైతులు తమ కష్టాలను ఎన్నిసార్లు విన్నవించుకుంటున్నా ముఖ్యమంత్రి గానీ, పార్టీ వారు గానీ పట్టించుకున్న పాపాన పోలేదు. నరసాపురంలో ఆక్వా యూనివర్సిటీని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు గానీ.. ఆక్వా రంగం స్థిమితంగా నిలదొక్కుకోడానికి ఆయన ఒక్క వరం కూడా ప్రకటించలేదు. సుదీర్ఘ కాలంగా ఉన్న వారి విజ్ఞప్తులను ఖాతరు చేయలేదు. ఆక్వారంగం కుమిలిపోతూ ఉంది.
ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆక్వా రైతులతో ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమం నిర్వహించారు. గతంలో తెలుగుదేశం హయాంలో 2 రూపాయలకు యూనిట్ కరెంటు ఇచ్చేవాళ్లమని, జగన్ అర్ధరూపాయి తగ్గిస్తానని చెప్పడంతో ఆక్వారైతులు బుట్టలో పడ్డారని ఆయన గుర్తు చేశారు. జగన్ కొట్టిన దెబ్బకు ఆక్వారంగం పూర్తిగా నాశనమయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పారు. మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే.. ఈసారి 1.50 రూపాయలకే ఆక్వా రైతులకు విద్యుత్తు ఇస్తామని ప్రకటించడం విశేషం.
నిజానికి ఆక్వారంగానికి కరెంటు చాలా పెద్ద సమస్య. జగన్ ఈరంగం మీద కక్ష కట్టినట్టుగా కొత్త చట్టాలు తేవడంతో.. ఆ రంగం మొత్తం దెబ్బతింటోంది. రొయ్యల ధరలను ప్రభుత్వం తగ్గించి రంగం మరింత దెబ్బతినడానికి కారణమవుతోంది. జగన్ వచ్చిన తర్వాత.. ఒక్కో ఎకరాకు ఆక్వా రైతుకు ఎంత అదనపు భారం పడుతున్నదో చంద్రబాబునాయుడు గణాంకాల సహా వివరించారు. ఆ రంగాన్ని నిలబెట్టేందుకు తాను తోడ్పడుతానన్నారు.
నిజానికి ఈ రంగానికి సంబంధించి ఒకటిన్నర రూపాయలకే కరెంటు ఇవ్వడం అనేది చాలా పెద్ద హామీ కింద లెక్క. ఎన్నికలు మరో ఏడాదిలో ఎదుర్కోవాల్సి ఉన్న తరుణంలో.. చంద్రబాబునాయుడు ఇప్పటినుంచే తన అమ్ముల పొదిలోని సమ్మోహనాస్త్రాలు బయటకు తీస్తున్నారని, జనం మెప్పు పొందడానికి ముందుముందు మరింత వరాల జల్లు కురుస్తుందని ప్రజలు అనుకుంటున్నారు.