జనసేనాని పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లోనే ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిస్తే తప్ప.. ప్రజలు బాగుపడరని పోరాడుతుంటారు. అదే సమయంలో ఆయన తమ భాగస్వామి అని చెప్పుకుంటూ ఉండే భారతీయ జనతా పార్టీ మాత్రం అంత దూకుడు చూపించకుండా.. ఏదో తమలపాకుతో తానూ ఒకటి అంటున్నట్టుగా జగన్ పట్ల విమర్శలు రువ్వుతుంటుంది. ఈ ఇద్దరి మైత్రీ బంధం అంత సజావుగానూ లేదు.. అలాగని విడిపోయేలాగానూ లేదు. ఈ నేపథ్యంలో విశ్లేషకుల్లో మాత్రం.. బిజెపితో స్నేహబంధం పవన్ కు చేటు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
ప్రధాని నరేంద్రమోడీ విశాఖకు వచ్చి రాష్ట్ర భాజపా కీలక నాయకులతో భేటీ అయి.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి, అధికారంలోకి రావడానికి ఎలా పనిచేయాలో దిశానిర్దేశం చేసి వెళ్లారు. జగన్ ప్రభుత్వం మీద చార్జిషీట్ తయారు చేయాలన్నట్టుగా, ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రంగా ఎండగట్టాలని సూచించినట్టుగా వార్తలు కూడా వచ్చాయి. అయితే పార్టీ వారితో భేటీ మరురోజు జరిగిన సభలో జగన్ పట్ల అవ్యాజప్రేమానురాగాలను కూడా మోడీ కురిపించారు. జగన్ ఏకంగా.. మా ఇద్దరిదీ రాజకీయాలకు అతీతమైన బంధం అంటూ తాను కోరుకునే సంకేతాలను ప్రజల్లోకి పంపడానికి ప్రయత్నించారు.
మోడీ దిశానిర్దేశం చేసి వెళ్లినంత మాత్రాన, ఆ తర్వాత కూడా వైసీపీ మీద బిజెపి ఏమాత్రం పోరాట పటిమ కనబరుస్తున్నదో అందరికీ అర్థమవుతూనే ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కల్యాణ్ దూకుడు కూడా తగ్గింది. అయితే ఆయన షూటింగ్ పనుల్లో బిజీగా ఉండవచ్చు గానీ.. ఆయన పార్టీ ప్రభుత్వం మీద దాడిచేయడంలో ఏమాత్రం తగ్గడం లేదు. నాదెండ్ల మనోహర్ గానీ, ఇతర నాయకులు గానీ.. నిశిత విమర్శలతో విరుచుకుపడుతూనే ఉన్నారు. బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం గురించి అసలు పట్టించుకున్నట్టే కనిపించదు. ఏదో పూబంతిని విసిరినట్టుగా అప్పుడప్పుడూ ఓ విమర్శ పంపుతుంది. పైగా ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఓ గొప్ప విషయం ప్రకటించారు.
జనవరిలో పార్టీ తరఫున జిల్లా రాష్ట్రస్థాయిలో యువకులకు కబడ్డీ పోటీలు నిర్వహిస్తారట. ఈ కార్యచరణ ప్రణాళిక గమనిస్తే చాలు.. వాళ్లకు ప్రభుత్వం మీద పోరాడడం కంటె.. నెమ్మది నెమ్మదిగా తమ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళితేచాలు అనే అభిప్రాయం ఉన్నట్టుగా అర్థమవుతుంది. అలాంటి పార్టీతో పొత్తులు పెట్టుకుని, ఎంతో దూకుడుగా వెళ్లే పవన్ కల్యాణ్ ఏం సాధిస్తారు? కాడికి రెండెద్దులు పూనిస్తే.. ఒక ఎద్దు వంద కిలోమీటర్ల వేగంతో పరుగుపెడుతూ.. మరో ఎద్దు పది కిలోమీటర్ల వేగంతో ఈసురోమని నడుస్తుంటే ఆ ప్రయాణం ఎలా ఉంటుంది. పవన్- బిజెపి పొత్తులు కూడా అలాగే ఉండబోతున్నాయని అనిపిస్తోంది. అందుకే స్పీడ్ మ్యాచ్ కాకపోవడం వల్ల.. బిజెపితో పొత్తు పవన్ కల్యాణ్ కు, జనసేనకు చేటు చేస్తుందని అంతా అనుకుంటున్నారు.