క్లారిటీ లేక.. ఎమ్మెల్యేల వెంటపడ్తున్న జగన్!

Thursday, December 19, 2024

పైకి తాను సంక్షేమం మీద మాత్రమే ఆధారపడి పాలన సాగిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతుంటారు. ఇన్ని లక్షల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.. ప్రజలు మనకు కాక ఇంకెవరికి ఓటు వేస్తారు.. ఎట్టి పరిస్థితుల్లో మనం 175 గెలిచి తీరుతాం.. అని విశ్వాసం వ్యక్తం చేస్తుంటారు. మరి తాను చేపడుతున్న సంక్షేమం మీద అంత ధీమా ఉన్నప్పుడు.. గడపగడపకు అంటూ ఎమ్మెల్యేల వెంటపడడం ఎందుకో మనకు అర్థం కాదు. ఎమ్మెల్యేల పనితీరు మీద పదేపదే సర్వేలు చేయించడం ఎందుకో మనకు అర్థం కాదు. వారిని అభద్రతకు గురిచేస్తూ వెంటపడడం ఎందుకో తెలియదు!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాసేవ కంటె ఓటింగ్ సరళిని ఎలా మానిప్యులేట్ చేయగలం అనే వ్యవహారాల మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతుంటారనే విమర్శ ఒకటి ఉంది. సర్వేలు చేయించడం, సర్వేలకు అనుగుణంగా.. నియోజకవర్గ స్థాయి వ్యవహారాలు, అభ్యర్థుల మార్పుచేర్పులకు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. పైగా ఆయన తన సామర్థ్యం, తనకున్న ప్రజాదరణ కంటె ఐప్యాక్ వారి తెలివితేటల మీదనే ఎక్కువగా ఆధారపడుతుంటారనే వినికిడి కూడా ఉంది. ఒకవైపు జగన్ కోసం పనిచేసి, తప్పు చేశానని ఐప్యాక్ పూర్వాధినేత  ప్రశాంత్ కిషోర్ అన్నప్పటికీ.. జగన్ ఇవాళ్టికి కూడా ఆధారపడుతున్నది వారి సేవల మీదనే. 

ఈ నేపథ్యంలో తాను స్వయంగా చేయించుకుంటున్న సర్వేలు, ఐప్యాక్ విశ్లేషణలు అన్నీ చాలావరకు ప్రభుత్వానికి వ్యతిరేక ఫలితాలను సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది.అనేక మంది ఎమ్మెల్యేలు మళ్లీ గెలవడం అసాధ్యం అని జగన్ కు సర్వేలు తెలియజేస్తున్నాయట. ఈ విషయం అన్యాపదేశంగా ఆయన గతంలోనూ వెల్లడించారు. పనితీరు బాగాలేని వారికి టికెట్లు ఇవ్వను అని తేల్చిచెప్పారు. 

అయితే వచ్చే ఎన్నికలకు తాను ఏం చేయబోతున్నాడనేది జగన్ కే క్లారిటీ లేదు. ఎందుకంటే.. ఒకవైపు పనితీరుబాగాలేని వారికి టికెట్లు ఇవ్వను అని బెదిరిస్తాడు. ఎమ్మెల్యేలు, మంత్రులు కొందరు, వచ్చే ఎన్నికల్లో తాము పోటీచేయబోము, తమ వారసులకు టికెట్ ఇవ్వాలని అన్నప్పుడు ‘కాదు కూడదు మీరు పోటీచేయాల్సిందే’ అని అంటారు. ఈ ద్వంద్వ విధానాలు ఏమిటో అర్థం కాని సంగతి. 

తమ నాయకుడికి క్లారిటీ లేదని, పార్టీని ఎవరు గెలిపిస్తారనేది తేల్చుకోలేకపోతున్నారని వైసీపీ వారే అంటున్నారు. వైఎస్ఆర్ కు ఉన్న ప్రజాదరణా, ఐప్యాక్ సర్వేలా? జనాలకు పంచిపెడుతున్న డబ్బులా? ఎమ్మెల్యేల పనితీరా? ఏది గెలిపిస్తుందో ఆయనకు క్లారిటీ లేదని.. తాను చేయించుకున్న సర్వేల్లో ప్రతికూల ఫలితాలు కనిపించిన ప్రతిచోటా.. ఎమ్మెల్యేల పనితీరు మీద నెట్టేయడానికి చూస్తున్నారని పార్టీలో అంటున్నారు. తన ప్రభుత్వం సూపర్.. ఎక్కడ ఓడినా ఎమ్మెల్యేల వల్ల మాత్రమే.. అనే ఒంటెత్తు పోకడలతో.. క్లారిటీ లేకపోవడం వల్ల.. పనిచేయనివారిని, చేసేవారిని కూడా జగన్ వెంటపడి వేధిస్తున్నారని పార్టీ నాయకులు అనుకుంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles