తెరాస ఎమ్మెల్యేలకు ఎరవేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నించింది అనేది ఇప్పుడు కీలక ఆరోపణ. దీనికి సంబంధించి.. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో సిట్ ప్రత్యేక దర్యాప్తు జరుపుతోంది. ఏకంగా బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి బిఎల్ సంతోష్ సహా అనేక మంది ప్రముఖులకు నోటీసులు ఇచ్చి విచారించడానికి పూనుకుంటున్నది. సహకరించకుంటే అరెస్టు చేస్తాం అని కూడా చెబుతున్నది. ఈ నేపథ్యంలో.. ఎమ్మెల్యేలకు ఎర వివాదంలోకి అనుకోకుండా కొత్త కృష్ణుడు కూడా ఎంటరయ్యాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణ రాజుకు కూడా సిట్ బృందం 41ఏ నోటీసులు ఇచ్చింది.విచారణకు రమ్మని పిలిచింది.
వ్యవహారం మొత్తం గులాబీకి- కమలానికి మధ్య జరుగుతున్న రణం కాగా.. మధ్యలో ఈ కొత్త కృష్ణుడు ఎలా ఎంట్రీ ఇచ్చాడనేది చాలా మందికి అర్థం కాని సంగతి. ఇలాంటి హైప్రొఫైల్ కేసులను విచారిస్తున్నప్పుడు ఒక్క రఘురామక్రిష్ణరాజు అని ఏముంది.. ఇంకా అనేకానేకమంది ప్రముఖుల పేర్లు వినిపించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే.. దొరికిన నిందితుల ఫోన్, చాట్ సంబాషణలు, వారి కాంటాక్ట్ లిస్టు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తుంటారు. ఎక్కువసార్లు మాట్లాడినట్టుగా కనిపిస్తే చాలు.. ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి అన్నట్లుగా నోటీసులు ఇచ్చి పిలిచినా ఆశ్చర్యం లేదు. హైప్రొఫైల్ వారి కాంటాక్ట్స్ అనేకానేక హైప్రొఫైల్ వ్యక్తుల పేర్లుండడం వింత కాదు.
ఆ సంగతి పక్కన పెడితే.. రఘురామక్రిష్ణరాజుకు మాత్రం నోటీసులు ఎలా వెళ్లాయనడానికి మరో అనుమానం ఆయన వర్గీయుల్లో పుడుతోంది. రఘురామక్రిష్ణరాజును వేధించడానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనేకానేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన వల్ల కావడం లేదు. అరెస్టు చేయాలన్నా దొరకడం లేదు. ఏపీ ప్రభుత్వం పెట్టిన కేసుల విషయంలో రఘురామ కోర్టు రక్షణతో మరింత చెలరేగుతున్నారు. సీఎం జగన్ కు కునుకు పట్టనివ్వంత ఘోరమైన విమర్శలతో ఆడుకుంటున్నారు.
ఇదే సమయంలో.. .పైకి కనిపించకపోయినప్పటికీ.. తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఏపీ సీఎం జగన్ కు చాలా మంచి దోస్తీ ఉంది. లోలోపల వారిద్దరూ ఒక్కటే అనే ప్రచారం ఉంది. అందుకే ఎంపీ రఘురామక్రిష్ణ రాజును స్వయంగా తాను ఏమీ చేయలేక.. ఏదో ఒక రకంగా ఈ కేసుతో ముడిపెట్టి ఇబ్బందిపెట్టడానికి, అరెస్టు చేయడానికి గులాబీ దళం ద్వారా.. జగన్ అటునుంచి నరుక్కువస్తున్నాడా? అనే అనుమానాలు ప్రబలుతున్నాయి. ఇప్పటిదాకా ఏపీ పోలీసులు అరెస్టు చేస్తారనే ఉద్దేశంతో రఘురామ హైదరాబాదు, ఢిల్లీల్లో మాత్రమే తన గళం వినిపిస్తున్నారు. తెలంగాణలో కూడా అరెస్టు చేయదగిన కేసులు పెట్టిస్తే.. రఘురామను ఇరుకున పెట్టవచ్చుననేది జగన్ వ్యూహకర్తల ఆలోచన కావొచ్చు. అయినా ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ ప్రధానంగా నలుగురికి నోటీసులు ఇస్తే విచారణకు హాజరైంది ఒక్కరే. 29న విచారణకు రఘురామ వస్తారనే గ్యారంటీ కూడా లేదు. కానీ ఆయనకు నోటీసుల విషయంలో.. ఎర వ్యవహారం ఇంకా అనేకానేక కోణాల్లో మలుపులు తిరుగుతుందని మాత్రం అర్థమవుతోంది.