“మేమేమీ తప్పు చేయలేదు.. మా మీద సిబిఐ విచారణ సాగించడం కరెక్ట్ కాదు.. ఈ విషయాన్ని హైకోర్టుకు చెబితే వాళ్ళు నమ్మడం లేదు.. కాబట్టి మీరు జోక్యం చేసుకొని సిబిఐ విచారణ చేయకుండా ఆపించండి” ఈ తరహా డిమాండ్ తో హెటిరో గ్రూపు సుప్రీంకోర్టును ఆశ్రయించి భంగపడింది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి చెందిన సంస్థల్లో 2006లో పెట్టిన పెట్టుబడులకు వాటికి జవాబుగా ప్రభుత్వం నుంచి పొందిన అనుచిత ఫలితాలకు, లబ్ధికి సంబంధించి క్విడ్ ప్రోకో గురించి సుప్రీంకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. క్విడ్ ప్రోకో జరిగిన సంగతి చాలా స్పష్టంగా కనిపిస్తుందని దానిని దాచిపెట్టడం సాధ్యం కూడా కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం విశేషం.
సిబిఐ విచారణను ఆపు చేయించాలని కోరుతూ వేసిన స్పెషల్ లీవు పిటిషన్ ద్వారా హెటెరో సంస్థ.. జగన్మోహన్ రెడ్డి అక్రమాలు ఆర్థిక అరాచకాల గురించి మళ్లీ తాజాగా చర్చను లేవనెత్తింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చాలా ఘాటుగానే ఉన్నాయి. ‘విచారణను ఆపు చేయించండి’ అన్నంతవరకే పిటిషన్ కనుక.. ఆ పిటిషన్ను కొట్టేయడం వరకే ప్రస్తుతానికి పరిమితమయ్యారు కానీ.. వాస్తవంలో ‘‘మీరు క్విడ్ ప్రోకో రూపంలో తప్పు చేసినది నిజమే’’ అన్నట్లుగానే సుప్రీం వ్యాఖ్యానించింది. అందుకే హెటెరో న్యాయవాదులకు కూడా సుప్రీం వ్యాఖ్యలు కంగారు పుట్టించాయి. సుప్రీం చేసిన వ్యాఖ్యలు కేసు విచారణకు అడ్డంకిగా మారుతాయని వారి న్యాయవాది అన్నప్పుడు అలాంటిదేమీ జరగదులే అని సుప్రీం న్యాయస్థానం ఊరడించడం గమనార్హం.
ఈ కేసు విచారణ సందర్భంగా 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి కలిసి చేసిన అరాచకాలు మళ్లీ చర్చకు వచ్చాయి. ఇతర వ్యక్తులు పది ఎకరాల కోసం దరఖాస్తు చేసుకుంటే వాటిని పట్టించుకోని ప్రభుత్వం.. అరబిందో, హెటెరో గ్రూపులు దరఖాస్తు చేసిన రోజునే వారికి ఏకంగా ఒక్కొక్కరికి 75 ఎకరాల వంతున భూములను కేటాయించడం చాలా కీలకమైన విషయంగా సుప్రీం కోర్టు పరిగణించింది. అప్పటికి అసలు ప్రారంభం కాని జగన్మోహన్ రెడ్డి కంపెనీలలో షేర్లను ఒక్కొక్కటి 350 రూపాయల వంతున ప్రీమియం ధరకు కొనుగోలు చేసినందుకు ప్రతిఫలంగానే ఈ భూములు కట్టబెట్టినట్టుగా స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. మా కంపెనీలో పెట్టుబడులు పెట్టు భూములు తీసుకో అన్న విధంగానే వ్యవహారం నడిచిందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి కె ఎం జోసెఫ్ వ్యాఖ్యానించారు.
హెటిరో గ్రూపు పిటిషన్ జగన్మోహన్ రెడ్డి అక్రమాల తేనెతుట్టెను మళ్లీ కదిలించింది. అందరి దృష్టి మళ్లీ అటుమళ్లేలా చేసింది. అసలే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలలో ఉంటూ.. అనేక రకాల ఆరోపణలను ఎదుర్కొంటున్న జగన్ కు ఈ సుప్రీం వ్యాఖ్యలు, పాతగాయాలను గుర్తుచేసేవి. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో.. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఎంత విచ్చలవిడిగా వ్యవహరించారో ఈ వ్యాఖ్యల వలన ప్రజలకు కూడా అర్థమవుతుంది. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగానే అవినీతిలో శిఖరాలకు చేరిన వ్యక్తి.. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకెంతలా బరితెగిస్తాడో కదా అనే భావన ప్రజలకు కలిగితే ఏమవుతుంది?