ఈ దాడి వైసీపీ మీద జరిగుంటే.. చిటికెలో తేలిపోయేది!

Monday, December 23, 2024

ఇప్పుడు పోలీసులు నేర పరిశోధన చాలా త్వరితగతిన ముగిస్తున్నారు. రకరకాల రూపాల్లో అందివచ్చిన ఆధునిక టెక్నాలజీ సహాయంతో నేరపరిశోధన సులభతరం అవుతోంది. ప్రధానంగా సీసీ కెమెరాల పుణ్యమాని అనేక కేసుల్లో చిక్కుముడులు సులువుగా విడిపోతున్నాయి. అయితే తమాషా ఏంటంటే.. సాధారణ క్రైం కేసుల్లో ఎలాంటిదైనా సరే చిటికెలో తేల్చేస్తున్న పోలీసులే.. రాజకీయ కేసుల విషయంలో తన-మన భేదాలు పాటిస్తున్నారు. తెలుగుదేశం వారి మీద దాడులు జరిగినప్పుడు.. ఆ కేసులు ఎంతగా నానుతుంటాయంటే.. మన పోలీసులు మరీ ఇంత అసమర్థులా అనే అభిప్రాయం కూడా చూసేవాళ్లకు కలుగుతుంది. ఇందుకు పెద్ద ఉదాహరణ ప్రస్తుతం రాష్ట్రంలో ఒకానొక హాట్ టాపిక్ గా ఉన్న నెల్లూరులోని తెలుగుదేశం నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి వ్యవహారం.
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి.. జగన్ మీద విరుచుకుపడడంలో చాలా దూకుడుగానే వ్యవహరిస్తుంటారు. ఆయన ఒక అపార్ట్‌మెంట్ లోని తన కార్యాలయం నుంచి కిందకు దిగుతున్న సమయంలో.. అప్పటిదాకా భవనం బయట పొంచి ఉన్న కొందరు యువకులు చేతిలో దుడ్డు కర్రలతో ఆవరణలోకి ప్రవేశించి ఆయనమీద దాడికి ప్రయత్నించారు. అయితే సమయానికి అప్రమత్తమైన టీడీపీ కార్యకర్తలు, ఆనం అనుచరులు వెంటనే వారిని ప్రతిఘటించారు. వారు ఎదుర్కోవడంతో పాటు, స్థానికులు కేకలు వేయడంతో దాడికి యత్నించిన యువకులు కర్రలను అక్కడే వదిలి పరారయ్యారు. తమాషా ఏంటంటే.. వారు వచ్చిన రెండు టూవీలర్లను కూడా అక్కడే వదలి పరుగెత్తుతూ పరారయ్యారు.
యువకులు భవనంలోకి చేతిలో కర్రలతో సహా ప్రవేశిస్తున్న దృశ్యాలు సీసీకెమెరాల్లో చాలా స్పష్టంగా రికార్డు అయ్యాయి. అయితే ఈ కేసును పోలీసులు ఇప్పటిదాకా ఛేదించలేకపోతున్నారు. సహజంగా వెంకటరమణారెడ్డికి తెదేపా నాయకులందరూ సంఘీభావం తెలియజేస్తున్నారు. దేవినేని ఉమా కూడా నెల్లూరు పర్యటించి.. ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే వైసీపీ ఈ దాడిచేయించిందని ఆరోపించారు.
ఇదిలా ఉండగా.. ఇదే దాడి.. ఇదే మోతాదు ఆధారాలతో.. వైసీపీ నాయకుల మీద జరిగి ఉంటే గనుక.. పోలీసులు చిటికెలో పట్టుకుని ఉండేవారని ప్రజలే అనుకుంటున్నారు. ఎందుకంటే..

  • సిసి కెమెరాల్లో దాడికి తెగబడిన కుర్రాళ్లు స్పష్టంగా రికార్డు అయ్యారు.
  • వారు వచ్చిన టూవీలర్స్ అక్కడే దొరికాయి. వాటి నెంబర్ల ద్వారా ప్రయత్నిస్తే వాటి యజమానులెవరో తెలుసుకోవచ్చు. వారిని పట్టుకుని.. సీసీటీవీలో ఉన్న యువకుల విజువల్స్ తో పోల్చిచూస్తే అర్థమైపోతుంది.
  • టూవీలర్ల యజమానులు తమ వాహనం చోరీకి గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేసి సినిమా ఫక్కీలో తప్పించుకోవాలని అనుకున్నప్పటికీ.. ఆ యజమానుల మొబైల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలించి.. దాడికి ముందురోజు సహా వారు ఎవరెవరితో మాట్లాడారో.. వారినందరినీ పిలిపించి.. సీసీ టీవీ ఫుటేజీతో పోల్చి చూస్తే తెలిసిపోతుంది.
    హత్యకేసులను, ఎంతో ప్లాన్డ్ గాచేసిన బ్యాంకు చోరీలను కూడా ఏపీ పోలీసులు ఎంతో సమర్థంగా 24 గంటల్లోగా పరిష్కరించేస్తున్న ఉదాహరణలున్నాయి. అలాంటిది ఆనంపై దాడిచేసిన వారిని పట్టుకోలేకపోవడం అంటే.. జనం నవ్వుతున్నారు. ఇదే దాడి వైసీపీ మీద జరిగిఉంటే పోలీసుల సత్తా బయటపడేదని అంటున్నారు.

మరోవైపు నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి ఈ దాడిని తెలుగుదేశం ఆడిన నాటకంగా అభివర్ణిస్తుండడం తమాషా. పోలీసులు దర్యాప్తు చేస్తారని, బురద చల్లడానికే ఇలాంటి ప్రయత్నం చేశారేమో కూడా దర్యాప్తులో తేలుతుందని ఆయన అనేశారు. మంత్రిగారు ఇండైరక్టుగా పోలీసులు ఎలా దర్యాప్తు చేయాలో దిశానిర్దేశం చేశారని జనం అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles