వచ్చే ఎన్నికల నాటికి ప్రజలందరినీ వైసీపీకి అనుకూలంగా మార్చేయడానికి ఎమ్మెల్యేలు ఇతర నాయకులతో గడపగడపకు కార్యక్రమం నిర్వహించడం అనేది బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని ముఖ్యమంత్రి జగన్ తలపోశారు. ఆ ఆలోచన గట్టిదే. గెలిచిన మూడేళ్ల తరువాత.. ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ తిరగడం అనేది ఎన్నడూ ఎరగని సంగతి. ఆ రకంగా మంచి మైలేజీ వచ్చి ఉండేది. పైగా.. ప్రతి ఇంటికీ తమ ప్రభుత్వం నుంచి ఏయే పథకాలు అందాయో ప్రింటవుట్లు తీసి మరీ ఇవ్వడం వల్ల ఇంకా లాభం ఉంటుందని కూడా అనుకున్నారు. కానీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత లేకపోయినట్లయితే.. ఆ ప్లాన్ వర్కవుట్ అయ్యేది. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా వస్తున్న ఎమ్మెల్యేలను అనేకచోట్ల ప్రజలు నిలదీస్తుండడంతో, సమస్యలను నివేదిస్తుండడంతో ప్రభుత్వం పరువు ఇంకా దెబ్బతింటోంది. చివరకు భారీ పోలీసు బందోబస్తు పెట్టుకుని మరీ.. ఎమ్మెల్యేలు పల్లెల్లో తిరగాల్సిన దుస్థితి వచ్చిందంటే.. అర్థం చేసుకోవచ్చు.
సాధారణంగా ఎమ్మెల్యే నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు.. కనీస పోలీసు బందోబస్తు ఉంటుంది. కానీ.. కాకినాడ జిల్లాలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు దాదాపు 30 మంది పోలీసులను వెంటబెట్టుకుని మరీ ఇల్లిల్లూ తిరిగారు. ప్రజలు ఎవ్వరూ ఎమ్మెల్యే సమీపానికి వెళ్లకుండా, గుంపుగా రాకుండా వాళ్లు కాపలా అన్నమాట. నాలుగురోజుల కిందట స్థానికులు సమస్యలతో నిలదీయడంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయిన పెండెం దొరబాబు.. చివరకు ప్రజల వద్దకు వెళ్లడానికి కూడా భద్రత కోసం పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.
గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు ఎదురవుతున్న సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ‘గడప గడపకు’ అనేది జిందా తిలిస్మాత్ అని నమ్ముతున్న వైఎస్ జగన్.. తమను వెంటపడుతున్నారు గనుక.. ఎమ్మెల్యేలు వెళుతున్నారే తప్ప.. ప్రజల ఎదుటకు వెళ్లాలంటే వారికి భయం పుడుతోంది.
సంక్షేమ పథకాల రూపంలో మీ ఇంటికి ఇంత డబ్బులిచ్చాం కదా అని నాయకులు చెప్పేలోగానే.. ఆ గ్రామానికి రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్నాయో.. ఇసుక దందాలు ఎంత విశృంఖలంగా జరుగుతున్నాయో, స్థానిక నాయకులు ఎలా అవినీతి దందాలు చేస్తున్నారో.. అధికార వ్యవస్థ ఎలా గాడితప్పిపోయిందో ప్రజలు ఏకరవు పెడుతున్నారు. ప్రజలు వినతి పత్రాలతో వచ్చినా కూడా ఎమ్మెల్యేలకు కంగారు పుడుతోంది. చాలాచోట్ల వ్యతిరేకత భయంతో వారు వెళ్లడం లేదు.. కాకపోతే జగన్ సమీక్ష సమావేశాల పేరిట వారిని బెదరగొడుతున్నారు. అందుకే.. ఈ గడపగడపకు కార్యక్రమం వలన కొత్తగా దక్కే కీర్తికంటె, పోయే పరువే ఎక్కువగా ఉన్నదని భయపడుతున్నారు.