40 మంది వాటాలు 10 పైసల్.. ‘ఒకే ఒక్కడి’కి 90 పైసల్!

Friday, December 5, 2025

విక్రమార్కుడు సినిమాలో సీన్ గుర్తున్నదా? సినిమా ఓపెనింగులో రవితేజ, బ్రహ్మానందం కలిసి దొంగతనం చేస్తారు. దొంగిలించిన సొమ్మును వాటాలు వేసుకోవడానికి కూర్చుంటారు. ముందు ఇద్దరికీ చెరి సగం అంటూ రెండు వాటాలు పెట్టిన రవితేజ, ఆ తర్వాత రకరకాల కారణాలు చెబుతూ.. బ్రహ్మానందం చేతికి నామ్ కే వాస్తే గా కొన్ని నోట్లు ఇచ్చి మిగిలినదంతా తానొక్కడే నొక్కేస్తాడు. ఆ సీన్ నవ్వుకోవడానికి చాలా బాగుంటుంది. కానీ ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఇది చాలా సీరియస్ వ్యవహారం.

దాదాపు మూడున్నర వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, ఇప్పటిదాకా తేలిన వివరాలను బట్టి.. 41 మంది కలిసి కాజేశారు. 40 మంది పేర్లు బయటకు వచ్చాయి.. వారందరూ లిక్కర్ స్కామ్ నిందితుల జాబితాలో నిండుగా ఉన్నారు. మిగిలిన ఒకే ఒక్కడు ‘బిగ్ బాస్’ పేరు మాత్రం బయటకు రాలేదు. ఒకవేళ బిగ్ బాస్ అని అంతా అంటున్నారు గనుక.. ఆయనది పెద్ద వాటా అని సరిపెట్టుకున్నప్పటికీ.. ధర్మంగా దోచుకోవడం అంటే.. దోపిడీ మొత్తాన్ని రెండు వాటాలు వేసి.. ఒక వాటా సదరు బిగ్ బాస్ దాచుకుని, మిగిలిన సగాన్ని ఆ నలభై మందికీ పంచి పెట్టాలి కదా.. అనేది సాధారణంగా ప్రజలకు స్ఫురించే లాజిక్.

కానీ వైఎస్ జగన్ మార్గదర్శకత్వంలో చోటుచేసుకున్నట్టుగా విచారణలో తేలుతున్న లిక్కర్ స్కామ్ వ్యవహారం మాత్రం అలా కాదు. బిగ్ బాస్ గా అందరూ వ్యవహరిస్తున్న ఒకే ఒక్కడికి ఏకంగా 90 శాతం దక్కితే.. మిగిలిన 40 మందీ కలిసి 10 శాతం పంచుకున్నారన్నమాట. కానీ వారు కూడా నష్టపోయిందేమీ లేదు. వారికి దక్కిన పది శాతం వాటానే దాదాపుగా 350 కోట్లు. అది చిన్న మొత్తమేం కాదు.
విచారణలో వెల్లడవుతున్న వివరాలను బట్టి.. లిక్కర్ స్కామ్ లో దోచుకున్న సొమ్ములకు అంతిమ లబ్ధిదారు ఎవరు? అనే విషయంలో అందరి అనుమానాలు ఒకే ఒక్క పేరు వైపు సాగుతున్నాయి.

విచారణలో కూడా అదే సంగతులు బయటకు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఆయన కీలక అనుచరులైన ఇద్దరు ఎంపీలకు మాత్రం ప్రతినెలా అయిదేసి కోట్ల రూపాయల వంతున ముట్టజెప్పినట్టుగా తేలుతోంది. ఆ ఇద్దరు ఎంపీల్లో ఒకరు ఇప్పుడు పార్టీలో లేరు. రాజీనామా చేసి వెళ్లిపోయారు. నిజానికి అలా వెళ్లిపోయిన ఎంపీ ఇచ్చిన సాక్ష్యాల ఆధారంగానే కేసులో చాలా పురోగతి సాధ్యమైంది కూడా. మిగిలిన రెండో ఎంపీ మాత్రం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అని అంతా అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన కంపెనీల్లోకి ముడుపుల సొమ్ముఅయిదుకోట్లు ట్రాన్స్ ఫర్ కావడాన్ని కూడా సిట్ పోలీసులు గుర్తించారు.

అంతిమ లబ్ధిదారు అయిన ఒకే ఒక్కడికి దక్కిన 90 శాతాన్ని, అంటే దాదాపుగా 2970 కోట్లను హవాలా మార్గాల్లో విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో, డొల్ల కంపెనీల ద్వారా పెట్టుబడులుగా మార్చినట్టు సిట్ గుర్తించింది. ఈ ఫైనల్ లెక్కల తర్వాత.. మరింత పక్కా ఆధారాలను సేకరించడానికి సిట్ పోలీసులు కొందరిని విచారించాల్సి ఉంది. మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిలను కూడా విచారించాల్సి ఉంది. అదికూడా పూర్తయిన తర్వాత.. ఇక లిక్కర్ కుంభకోణం దర్యాప్తులో కీలక అడుగులు పడతాయని అంతా అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles