ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే హోదాలో ఉండగా అరెస్టు కావడం నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తాత్కాలిక ఉపశమనం లభించింది. అయితే వైసీపీ దళాలు గానీ, పిన్నెల్లి అనుచర ముఠాల కార్యకర్తలు గాని సంతృప్తిగా లేరు. అరెస్టు భయం మెడమీద కత్తిలాగా ఇంకా వేలాడుతూనే ఉన్నదని వారంతా అనుకుంటున్నారు. అరెస్టు భయంతో తాను అజ్ఞాతంలోనే ఉంటూ.. కోర్టులో మళ్లీ మళ్లీ పిటిషన్లు వేయడం ద్వారా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొంతమేరకు ఊరట పొందారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయ్యి, జూన్ 6వ తేదీ వరకు అరెస్టు మాత్రమే కాదు కదా, ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని హైకోర్టు ఆదేశించింది.
కానీ, ఈ ఆదేశాలతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గానికి మేలు జరిగిందా నష్టం జరిగిందా వారికే అర్థం కావడం లేదు. ఎందుకంటే అరెస్టు చేయవద్దని ఆదేశాలు వచ్చాయి తప్ప.. అదే క్రమంలో ప్రతిరోజు ఎస్పీ కార్యాలయానికి వచ్చి పిన్నెల్లి సంతకం పెట్టి వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాదులో అరెస్టు చేయడానికి వెళ్ళిన పోలీసులు కళ్ళు కప్పి తప్పించుకున్న నాటి నుంచి ఇవాల్టి వరకు అజ్ఞాతంలో ఉన్న రామకృష్ణారెడ్డి, ఈ ఆదేశాలతో ఒక్కసారిగా బయటకు వచ్చారు. రాత్రివేళ ఎస్పీ కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్ళారు. ఆరవ తేదీ వరకు ఆయన ప్రతిరోజు సంతకం చేసి వెళ్తూ ఉండాల్సిందే. పైగా ఆయన పాస్పోర్టును కూడా కోర్టులో సమర్పించాల్సి వచ్చింది.
ఇవన్నీ కూడా తమ నాయకుడికి ప్రమాదకర సంకేతాలే అని ఆయన అనుచరులు భావిస్తున్నారు. మరోవైపు నాలుగో తేదీ ఫలితాలు వెల్లడయ్యాక రామకృష్ణారెడ్డి గెలుపోటములతో సంబంధం లేకుండా మళ్లీ పరారయ్యే ప్రమాదం ఉన్నదని పోలీసుల అంచనా వేస్తున్నారు. అందుకే ఆయన చుట్టూ మఫ్టీలో మూడంచెల డేగ కళ్ళ పోలీసునిఘా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.
ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచినా సరే.. పిన్నెల్లి సిఐ మీద దాడి చేసిన కేసులో అరెస్టు కావాల్సి ఉంటుంది. వైసీపీ అధికారంలోకి రాకపోతే ఆ అరెస్టు ఆయనకు ప్రమాదకరం. ఈవీఎం ధ్వంసం కేసులో కూడా ఆయనకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఓడిపోతే ఇక చెప్పనవసరం లేదు. ఏ రకంగా అయినా ఆయన అరెస్టు తప్పదు. అందుకని నాలుగో తేదీ కౌంటింగ్ వరకు బాహ్య ప్రపంచంలో ఉండి.. కౌంటింగ్ నాడు ఆయన తిరిగి అజ్ఞాతంలోకి వెళతారని ప్రచారం జరుగుతోంది. పోలీసులు కూడా ఆయన వ్యూహాలను చిత్తు చేసి అరెస్టు చేసి తీరాలనే ఉద్దేశంతో పట్టుదలగా ఉన్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
పిన్నెల్లి చుట్టూ మూడంచెల డేగకళ్ళ నిఘా!
Monday, November 4, 2024