భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలుగు ప్రజల ఎదుట ఇప్పుడు కొత్త సందేహాన్ని లేవనెత్తారు? 2024 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి నివాసం ఎక్కడ ఉండబోతున్నది అని అనే సందేహం అది. ఎందుకంటే.. 2024లో అధికారం చేజారిపోతున్నదని, వైఎస్సార్ కాంగ్రెస్ ఓడిపోతుందని జీవీఎల్ జోస్యం చెప్పారు. ‘నా పేరు జగన్. నేను ఇక్కడే ఉంటానని’ సీఎం చెప్పిన మాటలు సినీడైలాగులుగా జీవీఎల్ అభివర్ణించారు. ఓడిపోయిన తర్వాత ఆయన ఇక్కడ ఉంటారనే గ్యారంటీ ఎంతమాత్రమూ లేదని ఎద్దేవా చేశారు.
జగన్ ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ హైదారాబాదులో నివాసాలు పెట్టుకుని ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని.. తాను ఇక్కడే ఉంటున్నానని చెప్పుకొచ్చారు. అయితే తాడేపల్లిలో ప్యాలెస్ నిర్మించుకునే వరకు జగన్ కనీసం అమరావతిలో అద్దె ఇంటిలో కూడా నివాసం ఉండలేదు. హైదరాబాదులోని లోటస్ పాండ్ ప్యాలెస్ లోనే ఉండిపోయారు. ఎటూ అసెంబ్లీకికూడా హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు గనుక.. తాను యాత్రలు చేయదలచుకున్నప్పుడు తప్ప అమరావతి, ఏపీకి వచ్చే అవసరమే లేకుండాపోయింది. తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్న తర్వాత మాత్రమే.. అమరావతిలోనే రాజధాని ఉంటుంది.. కనుకనే తాను అక్కడ సొంత ఇల్లు కట్టుకున్నాను.. చంద్రబాబునాయుడు ఇప్పటిదాకా సొంత ఇల్లు కట్టుకోనే లేదు.. అనే పదేపదే ప్రజలను నమ్మించారు జగన్. ఆ తర్వాత అమరావతి విషయంలో ఎలా ప్లేటు ఫిరాయించి ప్రజలను వంచించారో అందరికీ తెలుసు.
అయితే ఇప్పుడు ఆయన డైలాగుల నేపథ్యంలో 2024లో ఓడిపోతే పరిస్థితి ఏమిటి అనే సందేహాన్ని జీవీఎల్ నరసింహారావు లేవనెత్తుతున్నారు. జగన్ విశాఖకు రాజధానిని మార్చాలని అనుకున్న తరువాత.. అక్కడ రకరకాల నిర్మాణాలు అనుమానాస్పదంగా జరుగుతున్నాయి. టూరిజం ప్రాజెక్టు అనే పేరుతో రుషికొండను ధ్వంసం చేసి చేపడుతున్న నిర్మాణాలు సెక్రటేరియేట్ గా మారుతాయనే పుకారు ఉంది. ఆ సమీపంలో మరో కొండ మీద చేపడుతున్న నిర్మాణాలు జగన్ నివాసం అవుతాయనే పుకారు కూడా ఉంది. అంటే.. జగన్ మళ్లీ గెలిస్తే.. రాజధానిని విశాఖకు తరలించడం జరిగితే.. ఆయన ఆ కొత్త కొండమీద కట్టే హర్మంలో ఉంటారన్నమాట. మరి జీవీఎల్ సందేహిస్తున్నట్టుగా ఓడిపోతే పరిస్థితి ఏమిటి?
జగన్ కు ఇప్పటికే ఊరూరా ప్యాలెస్ లు ఉన్నాయి. ఏపీలోనే నాలుగు ప్యాలెస్ లు తాడేపల్లి, కడప, ఇడుపులపాయ, పులివెందులలో ఉన్నాయని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా అన్నారు. వీటికి హైదరాబాదులోని లోటస్ పాండ్ మరియు బెంగుళూరు ప్యాలెస్ అదనం.
ఓడిపోతే గనుక.. రాష్ట్రంలో ఉండడానికి ఇష్టపడరని పొరుగు రాష్ట్రాల్లోని అత్యంత విలావసవంతమైన తన ప్యాలెస్ లకే వెళ్లిపోతారని పలువురు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ ప్యాలెస్ కు అయినా అప్పుడప్పుడూ ఆయన వెళ్తున్నారు. కానీ బెంగుళూరు ప్యాలెస్ కు వెళ్లడం తగ్గింది.
నిజానికి 23 ఎకరాల్లో విస్తరించిన బెంగుళూరు జగన్ ప్యాలెస్ భూలోక స్వర్గంలా ఉంటుందని అందరూ అంటుంటారు.కానీ జగన్ మాత్రం దానిని సుదీర్ఘ కాలంగా అనుభవించడం లేదు. 2019కి ముందు అప్పుడప్పుడూ అక్కడ గడపడం సాధ్యమయ్యేది గానీ.. 2019 తర్వాత కుదరడం లేదు. ఈసారి ఓడిపోతే.. జగన్ ఖచ్చితంగా తన నివాసాన్ని బెంగుళూరు ప్యాలెస్ కే మార్చుకుంటారని.. అప్పుడప్పుడు రాజకీయ అవసరాల నిమిత్తం రాష్ట్రానికి వచ్చి వెళ్తుంటారని ప్రజల్లో ఊహలు, గుసగుసలు సాగుతున్నాయి.
2024 తర్వాత జగన్ నివాసం ఇక్కడేనా?
Sunday, January 19, 2025