ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన నరేంద్ర మోడీ వాగ్దానాన్ని ఏపీ ప్రజలు అంత సులువుగా మరిచిపోవడం కష్టం. ‘ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం’ అని భారతీయ జనతా పార్టీ నాయకులు పదే పదే ప్రస్తావిస్తూ ప్రజల్లో ఆశలు సన్నగిల్లడానికి తమ వంతు ప్రయత్నాలు చేసినప్పటికీ అంత ఫలితం దక్కడం లేదు. నిజానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం కేంద్రానికి లేదు అని అర్థం చేసుకున్న ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంలో మౌనం వహిస్తున్నాయి. లేదా, మొక్కుబడి వైఖరిని అనుసరిస్తున్నాయి. అంతమాత్రాన ప్రజలు ప్రత్యేక హోదా ఆశలను విస్మరిస్తారని అనుకోవడం భ్రమ. భారతీయ జనతా పార్టీ చీరాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ విషయం తేలిపోయింది.
చీరాల సభకు వచ్చిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు తీవ్రమైన నిరసన సెగ తగిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంగతి ఏమిటి.. విశాఖ రైల్వే జోన్ వ్యవహారం ఏమిటి.. విశాఖ ఉక్కుకు జరుగుతున్న అన్యాయం సంగతేమిటి.. అంటూ ప్లకార్డులు చేత పట్టుకుని ప్రజలు సోము వీర్రాజు పట్ల తమ నిరసన తెలియజేశారు. చీరాల అభివృద్ధి సాధన సమితి పేరుతో కార్యకర్తలు ఇలాంటి ఆందోళన వ్యక్తం చేయడం గమనించాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ ఎప్పటికైనా సరే సొంతంగానే ఎదగాలి.. సొంతంగా సీట్లు సంపాదించే స్థాయికి వెళ్ళాలి.. అని భారతీయ జనతా పార్టీ నాయకులు కలల మేడలు కట్టుకుంటూ ఉంటే కనుక వారు ఇప్పుడు తమ ఆలోచనలను పునస్సమీక్షించుకోవాలి. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ లాంటి వ్యవహారాలలో ఇంత ఘోరంగా మోసం చేసిన తర్వాత ప్రజలు తమను ఒక పట్టాన నమ్మరు అనే సంగతి వారు అర్థం చేసుకోవాలి. కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా ఏదైనా ప్రయోజనం కలిగిస్తే తప్ప తెలుగు ప్రజలను ఇంప్రెస్ చేయడం సాధ్యం కాదని గ్రహించాలి.
ఇలాంటి నిరసనలు ఇంకా కొనసాగుతున్న సమయంలో.. పార్టీ ఎప్పటికీ సొంతంగా ఎదగడం సాధ్యం కాదు అనే భయం వారిలో కలిగినట్టయితే.. రాష్ట్రంలోని పార్టీలతో పొత్తులు పెట్టుకునేదిశగా వారు అడుగులు వేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తెలుగుదేశంతో మంతనాలు జరుగుతున్న నేపథ్యంలో.. పొత్తు ద్వారా అధికారంలో భాగమై.. రాష్ట్ర ప్రయోజనాలకు కాస్తయినా పనిచేస్తే.. ప్రజల నమ్మకాన్ని వారు పొందడానికి అవకాశం ఏర్పడుతుందని కమలనాయకులే అనుకుంటున్నారు.