ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఏర్పడబోయే విపక్షాల పొత్తుల గురించి మొదటిసారిగా పవన్ కల్యాణ్ స్పష్టీకరించారు. ఎన్డీయే భాగస్వామి పక్షాల కూటమి భేటీకోసం ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్, హస్తిన వేదికగానే.. తెలుగు ప్రజలకు ఆ వార్త ధ్రువీకరించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో జనసేన, బిజెపి పార్టీలు కలిసిపోటీచేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. నిజానికి ఎన్డీయే పక్షాల భేటీ కంటె ముందురోజే పవన్ ఈ ప్రకటన చేసినప్పటికీ.. ఆయన కమలదళం హైకమాండ్ తో మాట్లాడిన తర్వాతే, వారి సమ్మతి తర్వాతే ఈ ప్రకటన చేసినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ తొలినుంచి కూడా విపక్షాలు అన్నీ కలసిపోటీ చేయాల్సిన అవసరం గురించి నొక్కి చెబుతూన్నారు. రాష్ట్రంలో జగన్ దుర్మార్గమైన పాలనను అంతమొందించాలని ఆయన ప్రజలకు పిలుపు ఇస్తున్నారు. కానీ.. బిజెపి వైపు నుంచి స్పష్టత రాలేదు. చంద్రబాబునాయుడు కూడా ఓ దఫా ఢిల్లీ వెళ్లి అమిత్ షా తో భేటీ అయి వచ్చారు గానీ.. ఇరు పక్షాలు పొత్తుల మాట ఎత్తకుండా సైలెంట్ గానే ఉన్నారు. పవన్ తాజాగా ఢిల్లీ వెళ్లిన సందర్భంలో.. మూడు పార్టీలు కలిసి పోటీచేస్తాయని చెప్పడంతో పాటు, ముఖ్యమంత్రి పదవి మీద తనకు ఆసక్తి లేదని, సీఎం ఎవరనేది ఎన్నికల తర్వాత ఫలితాలను బట్టి డిసైడ్ చేస్తామని చెప్పారు. అలాంటి ప్రకటన ద్వారా.. జనసైనికుల్లో నిరాశ ఏర్పడకుండా పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారనే అనుకోవాలి.
భారతీయ జనతా పార్టీ నుంచి పొత్తులపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. తాము చెప్పడానికి ఇంకా సమయం ఉన్నదని ఆ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశంతో పొత్తుకు సిద్ధమైతే తెలంగాణ ఎన్నికల్లో కూడా ఆ పొత్తు అమల్లోకి వస్తుందని, అందువల్ల ఇరువురికి ఎంతో కొంత మేలు జరుగుతుందని కూడా కొందరు భావిస్తున్నారు. అయితే ఏపీకి సంబంధించినంత వరకు పొత్తు గ్యారంటీ అని, ఇందుకు అతి పెద్ద మార్పు.. రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని మార్చడమేనని పలువురు విశ్లేషిస్తున్నారు.
సోము వీర్రాజు సారథిగా ఉన్నంత కాలం జగన్ ప్రభుత్వం మీద చేసే విమర్శలు తమలపాకుతో కొట్టినట్టుగా ఉండేవి. అదే పురందేశ్వరి సారథ్యం తీసుకోగానే.. మొదటి సమావేశం నుంచి విరుచుకుపడుతున్నారు. తలుపుచెక్కతో కొడుతున్న దెబ్బల్లాగా ప్రభుత్వంమీద విమర్శలు పడుతున్నాయి. చిన్నమ్మ దూకుడు కూడా పొత్తులకు సంకేతమే అనే భావన పలువురిలో ఏర్పడుతోంది.