స్వామి భక్తిని ప్రదర్శించడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు! తమ పై వాళ్లను ఇంప్రెస్ చేయడానికి సాధారణంగా కింది వాళ్ళు చాలా అతి చేస్తుంటారు. పోలీసు శాఖలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. స్వామి భక్తిని ప్రదర్శించడంలో ఆ శాఖను మించిన వారు ఉండరు. పోలీసులు ఎంతగా అతి చేస్తుంటారో వెటకారం చేస్తూ ఒక సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. అదేంటంటే, పైన హెలికాప్టర్లో ముఖ్యమంత్రి వెళుతున్నాడని చెప్పి కింద రోడ్లమీద నాలుగు వైపులా ట్రాఫిక్ ను ఆపేస్తాడు ఒక ట్రాఫిక్ పోలీసు. అంత ఓవరాక్షన్ చేస్తుంటాడన్నమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కూడా ఆ సినిమాలోని సన్నివేశానికి ఏమాత్రం తీసిపోయేలా లేరు ఎందుకంటే తిరుపతి జిల్లా వెంకటగిరిలో కార్యక్రమాలలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళుతోంటే శ్రీకాళహస్తిలో జనసేన నాయకులను గృహనిర్బంధం చేయడం అనేది వారిలోని స్వామి భక్తి ప్రదర్శనకు పరాకాష్టగా కనిపిస్తోంది.
వాలంటీర్ల పై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇటీవల పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను శ్రీకాళహస్తిలో వాలంటీర్లు వైసిపి కార్యకర్తలు కలిసి తగలబెట్టారు. దానికి జవాబుగా ముఖ్యమంత్రి జగన్ దిష్టిబొమ్మను తగలబెట్టడానికి జనసేన నాయకులు ప్రయత్నించినప్పుడు అక్కడి సిఐ అంజు యాదవ్ అతనిని చెంప దెబ్బలు రుచి చూపించి వివాదాస్పద సంఘటనగా మార్చారు. ఆ వివాదం ఇంకా రగులుతూనే ఉంది
ఈ నేపథ్యంలో వెంకటగిరిలో ముఖ్యమంత్రి కార్యక్రమం ఖరారు కాగానే శ్రీకాళహస్తిలో జనసేన నాయకులు నిరసన ప్రదర్శనలు చేయకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. వారి వైఖరి చూసి, ఇంకా నయం వెంకటగిరి కి వెళ్లే అన్ని రోడ్లను దిగ్భంధనం చేయలేదు అని ప్రజలు నవ్వుకుంటున్నారు.
ఇలాంటి పనులు చేయాల్సిందిగా స్వయంగా ముఖ్యమంత్రి జగన్ వారికి ఆదేశిస్తారో లేదో తెలియదు గాని, రోడ్డు మీద జగన్ కాన్వాయ్ వెళుతోంటే రోడ్డు పక్కన చెట్లను కొట్టేయించడం.. పట్టణ రోడ్లలో ఆయన కాన్వాయ్ వెళుతుంటే ఆయా రోడ్లలో మొత్తం దుకాణాలన్నింటినీ మూత వేయించడం.. బారికేడ్లు కట్టి జనసంచారం లేకుండా నియంత్రించడం.. ఇలాంటి పనులన్నీ పోలీసులు అత్యుత్సాహానికి నిదర్శనాలు. అలాంటి పనులు ముఖ్యమంత్రి పరువు తీస్తాయని వారికి అర్థం కాదో ఏమో మరి! ఆ కోవలోనే ప్రస్తుతం శ్రీకాళహస్తి నాయకులను నిర్బంధించడం కూడా చేరుతోంది!