ప్రభుత్వం తరఫున సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైనా మాట్లాడితే.. ఆ మాటలను స్వయంగా ముఖ్యమంత్రి మాటలుగానే పరిగణించాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతి కీలక సందర్భంలోనూ.. ఇప్పుడు ముఖ్యమంత్రి స్పందించి మాట్లాడాలి అని ప్రజలు ఎదురుచూసేప్పుడు.. సజ్జల తెరమీదికి వస్తారు. ఆయన సీఎం మనోగతాన్నే ప్రతిబింబిస్తారని.. కేవలం ఫిజికల్ గా తాను మీడియా ముందుకు వస్తారని పలువురు విశ్లేషిస్తుంటారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. శనివారం నాడు.. పట్టభద్ర ఎమ్మెల్సీలను నూరుశాతంగా కోల్పోయిన తర్వాత.. సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందు చెప్పిన మాటలు చాలా చిత్రంగా ఉన్నాయి. 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో పట్టభద్రులు, చదువుకున్న ఓటర్లు చాలా స్పష్టమైన తీర్పుతో వైఎస్సార్ కాంగ్రెస్ ను తిప్పికొట్టారు. ఈ పరాజయ పరాభవంపై స్పందించడానికి సజ్జల మీడియా ముందుకు వచ్చారు. సహజంగానే తను జర్నలిస్టు గనుక.. మాటల గారడీతో మాయ చేసే ప్రయత్నంలో పడ్డారు.
ఇలాటి సందర్భాల్లో ప్రతి నాయకుడు చెప్పే మాదిరిగా.. ఈ ఓటమిని స్వీకరిస్తున్నాం అనే సింపుల్ మాటతో ముగించేసి ఉంటే సరిపోయేది. అలా కాకుండా రకరకాల మాటలు మాట్లాడి అడ్డంగా దొరికిపోయారు. వచ్చిన ఓట్లన్నీ తెలుగుదేశానివి కావని, పీడీఎఫ్ వామపక్షాల ఓట్లే టీడీపీ వైపు మళ్లాయని అన్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? రేపు సార్వత్రిక ఎన్నికల్లో పీడీఎఫ్ బరిలో లేకపోతే గనుక.. అచ్చంగా ఆ ఓట్లన్నీ తెలుగుదేశానికి పడతాయి అనేనా? అనే సందేహం పలువురికి కలుగుతోంది. ఈ విజయం పట్ల తెలుగుదేశం సంబరాలు చేసుకోకూడదట.
ఒక వర్గం ఓట్లను సమాజం అభిప్రాయంగా తీసుకోలేం అని సజ్జల కొత్త భాష్యం చెప్పారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లో పట్టభద్రులు లేరని ఆయన చిత్రమైన వ్యాఖ్యానం చెప్పారు. లాయర్లకు దోచిపెడుతున్నదంతా ఏంటి? వాళ్లు పట్టభద్ర ఓటర్లు అవుతారా కాదా? అనేది సందేహం. అనంతపురంలో రీకౌంటింగ్ కోసం లేఖ ఇవ్వడం ఇంకో సిగ్గుమాలిన చర్చ. ఇది తెలుగుదేశం విజయాన్ని పోస్ట్ పోన్ చేయగలదు తప్ప ఆపడం సాధ్యం కాదు.
ఈ ఓటములు తమ పార్టీకి హెచ్చరికగా భావించడం లేదని సజ్జల అన్నారు. ఆ మాట ఆయన ఏదో మీడియా ను మభ్యపెట్టడానికి, మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడానికి అన్నమాట కాకుండా, అంతరంగంలోని మాటే అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇదే భావనతో ఉంటే గనుక.. తమ గొయ్యి తాము తవ్వుకుని, తమ సమాధి తామే కట్టేసుకుంటున్నట్టు లెక్క.
హెచ్చరిక కాదంటే.. ఆత్మహత్యతో సమానమే!
Saturday, December 21, 2024