ఇదే ప్రయత్నం ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఒకసారి చేశారు. అప్పట్లో ఆయన మాటను వేదంగా భావించే కేంద్రప్రభుత్వం రాజ్యం చేస్తున్నప్పటికీ ఆయన నిర్ణయం అమలురూపం దాల్చలేదు. సుప్రీం కోర్టులో ఇరుక్కుపోయింది. కానీ, హిందూత్వాన్ని సమాధి చేయడంలో తండ్రి చిత్తశుద్ధిని కొనసాగిస్తూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మళ్లీ అదే నిర్ణయం తీసుకున్నారు. దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శాసనసభ ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని ఆయన కేంద్రానికి పంపారు.
దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా పరిగణించే నిర్ణయంతో పాటు, బోయలు, వాల్మీకి కులాల వారిని కూడా ఎస్టీలుగా పరిగణించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభ వేర్వేరుగా రెండు తీర్మానాలను ఆమోదించింది. నిజానికి ఈ రెండు నిర్ణయాలు కూడా ఏకపక్షంగా రాష్ట్ర సర్కారు నిర్ణయించగలిగిన అంశాలుకాదు. అందుకే రెండింటినీ తీర్మానాల రూపంలో కేంద్రానికి పంపారు. సమాజంలో జరిగే అన్యాయాలను సరిదిద్దేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా జగన్ ఈ సందర్భంగా వెల్లడించారు. అదే సమయంలో ఈ రెండు అంశాల్లోనూ రాష్ట్రప్రభుత్వం చేయగలగింది ఏమీ లేదని కూడా జగన్ ప్రకటించి ముందు జాగ్రత్త వహించారు.
దళిత క్రిస్టియన్ లను కూడా మైనారిటీలుగా, బీసీలుగా గుర్తిస్తూ ఉంటేనే.. దేశంలో ప్రతిచోటా విచ్చలవిడిగా మత మార్పిడులు జరుగుతూనే ఉన్నాయి. హిందూత్వాన్ని దారుణంగా చంపేయడానికి క్రైస్తవ సంస్థలు మితిమీరిన మతమార్పిడులకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. క్రైస్తవ సంస్థల దూకుడు పెరిగిందని, మతమార్పిడులు కూడా పెరిగాయనే ఆరోపణలూ ఉన్నాయి. హిందూ ఆలయాలపై దాడులు జరిగితే ఏళ్లు గడుస్తున్నా ఇప్పటిదాకా దోషులెవరో తేల్చలేని సర్కారు వైఖరిపై కూడా విమర్శలున్నాయి. అలాగే తిరుమలలో అన్యమత ప్రచారం వంటి ఆరోపణలు, అపకీర్తి కూడా జగన్ సర్కారు మూటగట్టుకుంది.
ఇన్ని అంశాల నేపథ్యంలో దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా పరిగణించాలనే జగన్ నిర్ణయం హిందూత్వం మీద జరగగల అతిపెద్ద దాడిగా పలువురు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని లక్షల మంది క్రిస్టియానిటీని అనుసరిస్తున్నప్పటికీ, కేవలం రిజర్వేషన్ల సదుపాయాల కోసం హిందువులుగా చెలామణీ అవుతున్నారు. వారందరూ హిందూత్వాన్ని వదలి క్రిస్టియానిటీలోకి మళ్లిపోవడానికి ఈ నిర్ణయం లాకులు ఎత్తేస్తుంది.
శాసనసభ నిర్ణయం తీసుకున్నంత మాత్రాన ఈ రెండు తీర్మానాలు తక్షణం అమల్లోకి వస్తాయని అనుకోవడం భ్రమ. కానీ.. అసలే ప్రజల్లో సర్కారు గ్రాఫ్ పడిపోతున్నదని ఆందోళనలో ఉన్న జగన్ సర్కారు.. నష్టనివారణచర్యల్లో భాగంగా ఈ తీర్మానాలను వాడుకునే అవకాశం ఉంది. తండ్రి వైఎస్సార్ ఇదే తీర్మానం చేసినప్పటికీ ఇప్పటిదాకా అతీగతీ లేదు. సుప్రీం కోర్టులో ఈ విషయంలో కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ మళ్లీ ఇదే తీర్మానం చేయడం అనేది కేవలం కంటితుడుపు, ప్రచారార్భాటానికే తప్ప.. నిజంగా చిత్తశుద్ధితో చేసే నిర్ణయం కాదని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.
హిందూత్వ సమాధికి జగన్ బ్రహ్మాస్త్రం!
Monday, December 23, 2024