అమరావతి రాజధాని కోసం రైతులు ఎంత సుదీర్ఘమైన పోరాటం సాగిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రాజధాని రైతులు సంకల్పించిన అరసవిల్లి యాత్ర కూడా మళ్లీ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత.. ఏమాత్రం పట్టించుకోకుండా అమరావతి రాజధానిని సర్వనాశనం చేసేదిశగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి జగన్ వైఖరి గురించి యావద్దేశానికి తెలిసే ఉద్దేశంతో.. దేశరాజధాని హస్తినలో రెండురోజుల పాటు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించాలని వారు నిర్ణయించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద డిసెంబరు 17, 18 తేదీల్లో నిరసన కార్యక్రమాలు, ర్యాలీ ఉంటాయి. ఇందుకోసం విజయవాడనుంచి వెళ్లేలా ప్రత్యేక రైలు మాట్లాడుకున్నారు. రెండువేల మంది వరకు బయల్దేరి ఈ స్పెషల్ రైలులో ఢిల్లీ వెళ్తారు. రెండు నిరసన పూర్తయిన వెంటనే.. ఆ రైలులోనే తిరుగుప్రయాణం అవుతారు.
అమరావతి రాజధాని అనే స్వప్నాన్ని, 33వేల ఎకరాల నేలలు ఇచ్చిన రైతుల త్యాగాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తొక్కేసిన సంగతి తెలిసిందే. అధికార వికేంద్రీకరణ పేరుతో అమరావతి స్వప్నాలను శిథిలం చేసేశారు. రైతులు కోర్టుకు వెళ్లడంతో.. అధికార వికేంద్రీకరణ తన చేతిలో పని కాదని అర్థం చేసుకున్నారు. రాజధాని మార్పు చేయడానికి వీల్లేదని హైకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. అందుకు ముందుగానే.. సిఆర్డీయే రద్దు, వికేంద్రీకరణ బిల్లులు ఉపసంహరించుకుని మడమ తిప్పారు. వింకేద్రీకరణకు మరో మంచి బిల్లు తెస్తాం అన్నారు.
ఈ డ్రామాలన్నీ ఒకవైపు నడుస్తుండగా.. విశాఖకు రేపేరాజధాని తరలింపు.. వచ్చే వారం తరలింపు.. అని వైసీపీ నాయకులు రకరకాలుగా మాట్లాడుతూ విశాఖలో భూదందాలను నడిపించుకుంటున్నారు. మరోవైపు హైకోర్టు తీర్పును పరిహాసం చేస్తున్నారు. పట్టించుకోవడం లేదు. రాజ్యాంగ వ్యవస్థలు హాస్యాస్పదం అవుతున్నాయి. ఇలాంటి సకల అరాచకపోకడలపై అమరావతి రైతులు రాజకీయాలకు అతీతంగా, పార్టీల దన్ను కోరకుండా గళమెత్తుతున్నారు. తిరుమల వరకు పాదయాత్ర చేసినా, ప్రస్తుతం అరసవిల్లి పాదయాత్ర సగంలో ఉన్నా.. ప్రతి ప్రయత్నం కూడా.. అమరావతి రాజధానికి రాష్ట్ర ప్రజల మద్దతు కూడగట్టడమే. ఉత్తరాంధ్ర వైపు పాదయాత్ర సాగినప్పుడు కూడా.. వైసీపీ ప్రేరేపితమైనచోట్ల తప్ప.. ఎక్కడా వారికి ప్రతిఘటన ఎదురుకాలేదు. ఇప్పుడు తమ అమరావతి పోరాటం పట్ల దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద రెండు రోజుల నిరసన దీక్షతో ఢిల్లీ పాలకులను కూడా ఆకర్షించడం జరుగుతుంది. జాతీయ మీడియా దృష్టి పడుతుంది. అందుకే హస్తినలో అమరావతి నినాదాలు చేస్తే అవి తాడేపల్లిలో ప్రతిధ్వనిస్తాయని రైతులు ఆశపడుతున్నారు.