మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్నదనే సంగతి అందరికీ కనిపిస్తూనే ఉన్న సంగతి. రామోజీరావును అరెస్టు చేసి.. ఒక్కరోజైనా జైల్లో ఉంచడమే లక్ష్యంగా సీఐడీ దర్యాప్తు కొనసాగుతున్నదని అనుమానిస్తున్న వారు కూడా ఉన్నారు. రామోజీరావును విచారించడానికి వెళ్లి.. విచారణ జరుగుతూ ఉండగానే.. ఆయనను సీఐడీ అధికారులు తీసిన ఫోటోలు సాక్షి మీడియా ద్వారా బాహ్య ప్రపంచంలోకి రావడం వెనుకగల మర్మాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. అయితే ఈ తరహా వేధింపులు, కుట్ర పూరితం అని ప్రజలు అనుకుంటున్న దర్యాప్తుల గురించి హైకోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణలో ప్రభుత్వం వినిపిస్తున్న వాదన చిత్రంగాను, ఆశ్చర్యకరంగాను ఉంది. ప్రభుత్వం పరువు తీసేదిగా కూడా ఉంది.
మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థపై సాగిస్తున్న దర్యాప్తు గురించి సీఐడీ చీఫ్ సంజయ్ ఢిల్లీలోను, హైదరాబాదులోను విలేకర్ల సమావేశం నిర్వహించి అనేక వివరాలను వెల్లడించారు. ప్రెస్ మీట్ లో మరో గదిలోంచి వస్తున్న ‘చీటీ’లను ఫాలో అవుతూ ఆయన విలేకర్లతో మాట్లాడడం కూడా వివాదాస్పదం అయింది. అయితే ఈ తరహాలో ప్రెస్ మీట్లు పెట్టడం గురించి, వివరాలు వెల్లడించడం గురించి హైకోర్టులో కేసులు దాఖలయ్యాయి. ఈ విషయంపై దర్యాప్తు సమాచారం వెల్లడించడం మీ పని కాదంటూ సీఐడీకి హైకోర్టు చెప్పడం విశేషం. ట్రయల్స్ నిర్వహించాల్సింది జ్యుడిషియల్ అధికారులు కాగా, మీరు మీడియా ట్రయల్స్ నిర్వహించేసి.. మీరే శిక్షలు వేసేస్తారా? అని వ్యాఖ్యానించింది.
అయితే ఈ విషయంలో ప్రభుత్వం వినిపించిన వాదనే చిత్రమైనది. ఖాతాదారుల హక్కులను పరిరక్షించడంలో భాగంగా.. దర్యాప్తు గురించి క్లుప్తంగా వివరాలను వెల్లడించాల్సి వస్తున్నదని వారు అన్నారు. అసలు ఫిర్యాదు అంటూ లేని కేసు గురించి ఈ తరహా వాదన చిత్రమైనది. కాగా, ఆ మేరకు భావప్రకటన స్వేచ్ఛ ఉన్నదని చెప్పడం ఇంకా తమాషా. కేసు దర్యాప్తు చేస్తూ మధ్యలో వివరాలన్నీ బయటకు చెప్పడం, ‘భావం’ ఎందుకవుతుందో.. అది భావప్రకన స్వేచ్ఛ కిందికి ఎలా వస్తుందో అర్థం కాని సంగతి.
జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత.. భావప్రకటన స్వేచ్ఛ అనే హక్కునే కాలరాసిందనే విమర్శలు పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితే చాలు.. వారి మీద రకరకాల కేసులతో విరుచుకుపడిపోవడం రివాజుగా మారింది. అలాంటిది ప్రభుత్వం/సీఐడీ తన వాదనలో భావప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడడం చిత్రంగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు.