‘స్మార్ట్’ పోరు : ఎత్తుగడ శెభాష్!

Wednesday, December 18, 2024

తెలుగుదేశం పార్టీ స్మార్ట్ మీటర్లపై పోరాటం ప్రారంభించింది. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలనే ప్రభుత్వ ప్రతిపాదన చాన్నాళ్లుగా వివాదాస్పదంగానే ఉన్న సంగతి తెలిసిందే. రైతులు, విపక్షాల నుంచి ఎంతగా వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పటికీ.. ప్రభుత్వం ఒంటెత్తు పోకడలతో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసేదిశగానే ముందడుగు వేస్తోంది. ఈ మీటర్లు రైతుల పాలిట ఉరితాళ్లవుతాయనే నినాదంతో తాజాగా తెలుగుదేశం భారీ ఎత్తున పోరాటానికి సిద్ధపడింది. అసెంబ్లీలో ఈ విషయం ప్రస్తావించడం ద్వారా.. అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుత రాజకీయ నేపథ్యంలో.. తెలుగుదేశం స్మార్ట్ మీటర్ల వ్యవహారాన్ని భుజానికెత్తుకోవడం అనేది.. చాలా స్మార్ట్ మూవ్ గా విశ్లేషకులు పరిగణిస్తున్నారు. కేవలం అసెంబ్లీకి పరిమితం కాకుండా, ఈ విషయంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పోరాట పథానికి కూడా శ్రీకారం చుడితే.. పార్టీకి రాజకీయంగా ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు.

పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో తెలుగుదేశానికి కొత్త ఉత్సాహం వచ్చింది. పట్టభద్రులు అంటే చదువరుల సెక్షన్ లో తమ పార్టీకి ఆదరణ పుష్కలంగా ఉన్నదని అర్థమైంది. అదే సమయంలో ఆ పట్టభద్రుల ఓట్లు మాకు అక్కర్లేదు.. మేం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఇతర వర్గాల వారు మాకు ఓట్లు వేస్తే చాలు అన్నట్టుగా అధికార పార్టీ మాట్లాడడం కూడా తెలుగుదేశాన్ని కొత్త ఆలోచన వైపు ప్రేరేపించింది. 

పట్టభ్రదుల వర్గంలో ఎటూ తమ పార్టీ మీద, చంద్రబాబునాయుడు నాయకత్వం మీద నమ్మకం వ్యక్తం అవుతోంది గనుక.. ఇతర వర్గాల నమ్మకాన్ని చూరగొనే దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే.. స్మార్ట్ మీటర్లపై పోరాటానికి సిద్ధపడడం వ్యూహాత్మకం అని చెప్పొచ్చు. ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాల్లో స్మార్ట్ మీటర్లు పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసింది.అప్పట్లో కూడా తెలుగుదేశం తీవ్రంగానే వ్యతిరేకించింది. తర్వాత రాష్ట్రమంతా ఏర్పాటు చేస్తుండగా.. వామపక్షాలు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చాయి. పోరాటాలు సాగించాయి. అరెస్టులూ జరిగాయి. మరోవైపు తెలంగాణలో అసలు రైతుల కనెక్షన్లకు మీటర్లు బిగించే ప్రసక్తే లేదని కేసీఆర్ సర్కారు తెగేసి చెప్పేసింది. ఒకవైపు కేంద్రం ఒత్తిడి కారణంగానే జగన్ సర్కారు మీటర్లు పెట్టడానికి సిద్ధపడుతోందని, ఇది ముందు ముందు రైతుల పాలిట గుదిబండగా మారుతుందని, ఉచిత విద్యుత్తు కోల్పోయే ప్రమాదం ఉన్నదని అనేక భయాలున్నాయి. 

ఈ అంశాన్ని సరైన సమయంలో తెలుగుదేశం పార్టీ సీరియస్ గా టేకప్ చేసింది. ఆరువేల కోట్ల కుంభకోణం జరిగిందంటూ అసెంబ్లీలో వారు గళమెత్తారు. అసలు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా తెదేపా పోరు ముమ్మరం చేసినట్లయితే.. రైతువర్గాల్లో ఆ పార్టీ ఆదరణ కూడగట్టుకోవడం సాధ్యమవుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles