స్నేహబంధానికి ఆయన సైంధవుడిగా నిలుస్తారేమో!

Wednesday, January 22, 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా చూడడానికి.. విపక్ష ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి దాదాపుగా అన్ని పార్టీలు ఏకమవుతున్న సందర్భం ఇది. జనసేన తొలినుంచి తెలుగుదేశంతో పొత్తులకు సుముఖంగానే ఉండగా, భారతీయ జనతా పార్టీ ఇప్పుడిప్పుడే పొత్తు బాటలోకి వస్తున్నది. మొన్నమొన్నటిదాకా చంద్రబాబు నాయుడు మీద కూడా నిశిత విమర్శలు కురిపించిన బిజెపి నాయకులు, ఇటీవల కాలంలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాత్రమే విరుచుకుపడుతున్నారు. మూడు పార్టీల మధ్య పొత్తు కోరుకునే వారికి ఈ పరిణామాలు శుభసంకేతంగా కనిపిస్తున్నాయి. అయితే ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరిన కీలక నాయకుడు మాత్రం తెలుగుదేశం బిజెపి స్నేహ బంధానికి అడ్డుపడే వాతావరణం కనిపిస్తున్నది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిట్టచివరి ముఖ్యమంత్రిగా చరిత్ర పుటలలో మిగిలిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. పార్టీ ఆయనకు బాగానే ప్రాధాన్యం ఇస్తోంది. సాధించింది తక్కువే అయినా, కర్ణాటక ఎన్నికలలో కూడా ఆయన సేవలను ఉపయోగించుకుంది. తండ్రి వారసత్వం కారణంగా వాయల్పాడు నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన ఈ హైదరాబాదు నాయకుడిని రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పార్టీకి ఉపయోగించుకోవచ్చునని బిజెపి భావిస్తుంది. సదరు కిరణ్ కుమార్ రెడ్డి మాటలను గమనిస్తే ఆయన తెలుగుదేశంతో పొత్తు కుదరడానికి అడ్డుపడతారా అనే అనుమానం కలుగుతోంది.

నల్లారి కిరణ్ తాజాగా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. జగన్ సర్కారు దుశ్చర్యలను ఎండగట్టారు. అధికార పార్టీకే చెందిన ఒక ఎంపీ రాష్ట్రాన్ని వదిలి పరువు రాష్ట్రానికి వెళ్లిపోయే వ్యాపారం చేసుకు బతకాలని అంటున్నారని.. అధికార పార్టీకే చెందిన మరో ఎంపీని కాళ్లు వాచేలా పోలీసులతో చితకొట్టించారని కిరణ్ విమర్శించారు. పనిలో పనిగా ఆయన చంద్రబాబును కూడా ఆడిపోసుకున్నారు. చంద్రబాబు నాయుడు మోసం చేయడం, దోచుకోవడం నేర్పిస్తే జగన్ సర్కారు రాష్ట్రం మొత్తాన్ని దోచుకున్నదని ఆరోపించారు. రెండు పార్టీలూ పొత్తుల గురించి మాట్లాడుతున్న తరుణంలో ఈ విమర్శలు తీవ్రమైనవే.

చంద్రబాబు నాయుడు అమిత్ షా తో భేటీ అయిన తర్వాత రాష్ట్ర బిజెపి నాయకులు తెలుగుదేశం పట్ల కాస్త మెతక ధోరణి అవలంబిస్తున్నారు. పరిణామాలు ఎలా ఉంటాయో అని ఆలోచిస్తున్నారు. అయితే కిరణ్‌కు, చంద్రబాబుకు మధ్య రాజకీయ వైరం తరాల నుంచి ఉన్నటువంటిది. కిరణ్ అంత త్వరగా రాజీపడకపోవచ్చునని పలువురు భావిస్తున్నారు. అందుచేతనే తెలుగుదేశం బిజెపి మైత్రి బంధానికి నల్లారి కిరణ్ సైంధవుడి లాగా అడ్డుపడే అవకాశం ఉన్నదని పలువులు అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles