స్టాలిన్‌ను చూసి వారు బుద్ధి తెచ్చుకోవాలి!

Wednesday, January 22, 2025

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, తాను అధికారం చేపట్టిన నాటినుంచి అనేకానేక విప్లవాత్మక నిర్ణయాలతో ఒక రోల్ మాడల్ ముఖ్యమంత్రిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి.. అందరు నాయకులు అతడిని అనుసరించాలి.. అని అనిపించేలా ఆయన పరిపాలన సరళి ఉంటోంది. పాలన పరమైన నిర్ణయాల్లో ప్రతిపక్షాలకు కూడా భాగం కల్పించే ఏకైక ముఖ్యమంత్రి బహుశా స్టాలిన్ మాత్రమే ఏమో. అలాగే అమ్మ కాంటీన్ల పేరిట, జయలలిత ముద్రతో ఉన్న భోజన క్యాంటీన్ల పేర్లను ఆయన మార్చలేదు. సాధారణంగా ప్రభుత్వం మారగానే పథకాలన్నిటికీ పేర్లు మార్చేస్తుంటారు. కానీ.. స్టాలిన్ అలా చేయలేదు. ఇలాంటి ఎన్నో పనులద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఖుష్బూ విషయంలో.. తమ పార్టీ సీనియర్ నాయకుడిని పార్టీనుంచి ఏకంగా డిస్మిస్ చేయడం ద్వారా మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు స్టాలిన్.

తాజాగా తమిళనాడులో ఓ వివాదం రేగింది. భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఖుష్బూను ఉద్దేశించి డిఎంకె నేత ఒకరు అనుచితమైన వ్యాఖ్యలు చేశారు.  ఈ విషయాన్ని ఖుష్బూ సోషల్ మీడియా ద్వారా స్టాలిన్ దృష్టికి తీసుకువచ్చారు. స్టాలిన్ వెంటనే సదరు నేతను పార్టీనుంచి బహిష్కరించారు. అక్కడితో వివాదం సమసిపోయింది. చాలా విషయాల్లో.. రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తూ రోల్ మాడల్ గా నిలుస్తూ వచ్చిన స్టాలిన్, ఈ విషయంలో కూడా అదే మాదిరిగా.. చేశారు. శెభాష్ అనిపించుకున్నారు.

ఇక్కడే అసలు విషయం చర్చలోకి వస్తోంది. భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ మహిళా రెజ్లర్లు కొన్ని నెలలుగా దీక్షలు చేస్తున్నారు. పోలీసు కేసులు పెట్టారు. భారతదేశపు కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పేలా తాము సాధించిన పతకాలను కూడా గంగానదిలో పారేస్తామని కూడా ఉద్యమించారు. అయితే మొన్నమొన్నటిదాకా వారి విలాపాలను కేంద్రంలోని కమలసర్కారు కనీసమాత్రంగానైనా పట్టించుకోలేదు. అమిత్ షా వారితో చర్చలు జరిపిన తర్వాత.. ఏదో కేసులు నమోదుచేశారే తప్ప.. ఎంపీ మీద ఏం చర్యలు తీసుకుంటున్నారనే క్లారిటీ లేదు. ఆరోపణలు చేసిన వారేమీ ఆషామాషీ రోడ్డున వెళ్లే ఆకతాయి అమ్మాయిలుకాదు. దేశంకోసం, దేశ ప్రతిష్ఠకోసం తపించేవారు.. గోదాలో దిగి పోరాడే వారు. అలాంటి వారు చేసిన ఆరోపణలను ప్రభుత్వం నమ్మలేకపోయింది. తమ పార్టీ ఎంపీ మీద బిజెపి ఎలాంటి చర్య – ఇప్పటికీ – తీసుకులేదు. బిజెపి హల్లీ తమకు తాము విలువలు ఉన్న పార్టీ అని చెప్పుకుంటుంది. మహిళలను గౌరవించే పార్టీ అని చెప్పుకుంటుంది. ఇలాంటి నాయకులు.. కనీసం బిజెపి నాయకురాలికి జరిగిన అనుచిత చర్య పట్ల తమ పార్టీనేతను బహిష్కరించిన స్టాలిన్ వైఖరిని చూసి అయినా బుద్ధి తెచ్చుకోవాలని ప్రజలు అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles