తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఏమిటి? ఒకవైపు కన్నడ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా పార్టీలో జోష్ పెరిగిన మాట నిజం. దానికి తోడు పార్టీలోకి వచ్చిన కొన్ని చేరికల ప్రభావం కూడా ప్రజలపై ఉంది. నాయకులందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారేమో అనే అభిప్రాం ప్రజల్లో కలుగుతోంది. ముఠాతగాదాలు కూడా కాస్త తగ్గుముఖం పట్టినట్టుగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి వారు ఆశావహ వాతావరణంలో ముందుకు సాగుతున్నారు. అయితే ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో కనీసం.. స్కూలు పిల్లలకు ఉండే వ్యూహమైనా వారికి ఉందా? లేదా, ఆ మాత్రం తెలివితేటలు కూడా లేని వ్యూహరచనతో.. వారు కష్టాలు కొనితెచ్చుకోబోతున్నారా? అనే అనుమానం కలుగుతోంది.
కాంగ్రెసు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో తాజాగా జరిగింది. ఈ సమావేశంలో ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా సునీల్ కనుగోలు పనిచేస్తున్నారు. ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పార్టీ బలాబలాల గురించి నివేదిక ఇచ్చినట్టుగా చర్చ జరుగుతోంది. కాంగ్రెసు పార్టీ ప్రస్తుతం 35 స్థానాల్లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నదని ఆయన చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ నియోజకవర్గాల్లో తక్షణం బలమైన అభ్యర్థులను గుర్తించి.. పార్టీని బలోపేతం చేయాలని ఆయన సూచించినట్టుగా అంటున్నారు. 35 నియోజకవర్గాల్లో పార్టీ బలంగా లేదు అంటే దాని అర్థం ఏమిటి? తతిమ్మా.. 80 వారు గెలుస్తామని నమ్మకంగా ఉన్నారా? అనేది తొలి సందేహం.
అయితే.. 80 గెలుస్తామనే నమ్మకం ఉన్నప్పుడు.. ఆశాజనకంగా లేని 35 మీద ఎందుకంత కష్టపడాలి? అనేది ఇంకో సందేహం.
స్కూలు పిల్లలైనా సరే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు.. తమకు ఏదైనా ఒక చాప్టర్ చాలా కష్టంగా అనిపిస్తే దాన్ని చదువుతూ టైం వేస్ట్ చేసుకోకుండా వదిలేస్తారు. తమకు అర్థమవుతున్న మిగిలిన చాప్టర్స్ శుబ్రంగా చదువుకుని పరీక్షలో మంచి మార్కులు స్కోర్ చేస్తారు. ఎంట్రెన్సు పరీక్షలైతే.. ప్రతి బిట్ కూడా ముఖ్యం కాబట్టి తప్పదు. కానీ.. వార్షిక పరీక్షల వంటి వాటిలో ఇదే వ్యూహంతో వెళతారు. అసెంబ్లీ ఎన్నికలు వార్షిక పరీక్షల్లాంటివే. 35 కష్టం అనుకున్నప్పుడు.. వాటిని పూర్తిగా వదిలేసి.. నామమాత్రంగా వాటిమీద శ్రద్ధ పెట్టి.. మిగిలిన గెలుపు అవకాశం ఉన్న 80పైగా స్థానాల మీద సీరియస్ గా కసరత్తు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు కూడా.
అలా కాకుండా.. ఏదో తాము 119 గెలిచి తీరాలని పట్టుదల లాగా.. ఆ 35 మీద కూడా ఇప్పటినుంచి కష్టపడడం ప్రారంభిస్తే.. అటూ ఇటూ కాకుండా పోతారని పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.
స్కూలు పిల్లల వ్యూహమైనా కాంగ్రెస్‌కు ఉందా?
Sunday, December 22, 2024