‘పోరాడితే పోయేదేం లేదు.. బానిస సంకెళ్లు తప్ప..’ అనే నినాదం మరికొన్ని తరాల పాటూ అందరికీ స్ఫూర్తిని ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏపీలో బిజెపికి కూడా అదే స్ఫూర్తిగా కనిపిస్తున్నట్టుంది. ఒంటరిగా పోరాడినా పోయేదేం లేదు.. పోవడానికి మన వద్ద ఉన్న బలమేమీ లేదు.. అన్నట్లుగా వాళ్లు చెలరేగిపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీకి ఉన్నది మహా అయితే ఒకటిన్నర శాతం ఓటు బ్యాంకు. ఆ ఒకటిన్నర శాతం ఓటు బ్యాంకు కూడా సాంప్రదాయంగా ఆరెస్సెస్ మూలాలు, అభిమానం ఉన్న కుటుంబాలు, ఆయా ప్రాంతాల్లో అభ్యర్థుల బలాలను బట్టి దక్కుతున్న మరికొంత మాత్రమే. అంతే తప్ప.. పార్టీగా నాయకులు ఎంత హడావుడి చేస్తున్నప్పటికీ ఏపీలో వారికి ఉన్న బలం శూన్యం. పెరిగిన బలం కూడా శూన్యం.
ఇలాంటి నేపథ్యంలో, పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది బిజెపి పార్టీనే అని ఢంకా బజాయించి చెబుతుంటారు. అంతో ఇంతో హడావుడి ఎక్కువగా కనిపించే తెలంగాణలో కూడా బిజెపి అంత స్ట్రాంగుగా మేమే గెలుస్తాం అని చెప్పడానికి సంకోచిస్తుందేమో కానీ సోము మాత్రం చాలా గట్టిగా చెప్తారు. ఇప్పుడు ఆయన పవన్ కల్యాణ్ ను వదిలించుకోవడానికి కూడా సంకేతాలు ఇచ్చేశారు. వ్యతిరేక ఓటు చీలడానికి వీల్లేదు అంటున్న భాగస్వామి పవన్ అభిప్రాయానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా మేం టీడీపీ, వైసీపీలకు సమానదూరం పాటిస్తాం, పవన్ వస్తే ఆయనతో కలిసి పోటీచేస్తాం, లేకపోతే ఒంటరిగా బరిలో ఉంటాం అని అనడం.. సోము వీర్రాజు లోని అహంకారానికి నిదర్శనమో లేదా వ్యూహమో అర్థం కావడం లేదు.
2024లో మేం అధికారంలోకి వస్తాం అంటున్నప్పటికీ.. ఏదో ఒకనాటికి కనీసం ఒక్క సీటైనా గెలిచేస్థాయికి రావాల్సి ఉన్న బిజెపి.. ఒంటరిగా ఏం సాధించాలనుకుంటున్నదో తెలియదు. తమకున్నది ఒకటిన్నర శాతం ఓటు బ్యాంకే గనుక.. ఒంటరిగా పోరాడినా పోయేదేమీ ఉండదని.. ఒక్క అరశాతం ఓటు బ్యాంకు తమకు సొంతంగా పెరిగినా కూడా.. ఘనవిజయం కింద తాము చాటుకోవచ్చునని ఆయన అనుకుంటున్నారేమో తెలియదు.
కేంద్రంలో అమలుచేసే పథకాలకు రాష్ట్రంలో డప్పు కొట్టుకుంటూ తిరగడం తప్ప ఏపీ బీజెపి నాయకులకు వేరే పని లేదు. కేంద్రం వద్ద పట్టుపట్టి రాష్ట్రం కోసం ఫలానా సాధించాం అని చెప్పుకోడానికి వారి వద్ద ఏమీ లేదు. అందుకే వారికి విజయాల మీద కూడా ఆశ లేదు, నమ్మకం లేదు.
ఆ మాటకొస్తే పవన్ కలిసి పోటీచేయడం కంటె విడిగా పోటీచేస్తేనే కనీసం ఒకటో అరో శాతం ఓట్లు తమకు పెరుగుతాయనే ఆశ వారిలో ఉన్నట్టుంది. కానీ.. సోము వీర్రాజు వక్రవ్యూహం వికటిస్తే.. రాష్ట్ర ప్రజలు నిర్ణయాత్మక ఓటు వేయడానికే తప్ప, వృథా కావడానికి ఓటు వేయకూడదని అనుకుంటే.. వారికి ఉన్న ఒకటిన్నర శాతం ఓటు బ్యాంకు కూడా నాశనం అయిపోతుంది. ఆ సంగతి వారికి తెలుసుకోవాలి.
సోము మాటలతో బిజెపి పాతాళానికే..!
Wednesday, January 22, 2025