ఒక ప్రెవేటు టీవీ చానెల్ కు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో కేంద్రంలోని మోడీ సర్కారు అనుసరిస్తున్న అభివృద్ధి విధానాలను ఆయన కొనియాడారు. మోడీ ప్రతిపాదిస్తున్న విజన్ 2047తో తాను పూరతిగా ఏకీభవిస్తున్నానని అన్నారు. మనదేశ స్వాతంత్ర్యం వందేళ్ల ఉత్సవాలు జరుపుకునే సమయానికి పేదరికం అనేది రూపుమాసిపోవాలని, మధ్యతరగతి ఎగువమధ్యతరగతి వర్గాలనుంచి మాత్రమే వర్గీకరణ ఉండాలని ఆయన అభిలషించారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. మోడీ విధానాల్ని అభినందిస్తూ ఆయన చెప్పిన మాటలు మరో ఎత్తుగా కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశానికి మళ్లీ మైత్రీ బంధం కుదిరే అవకాశం ఉన్నదని పలువురు విశ్లేషిస్తున్నారు. మోడీ విధానాలను బలపరచడం అంటే.. తెలుగుదేశం మళ్లీ ఎన్డీయేలో జాయిన్ అవుతున్నట్టు అన్నట్టుగా ఎన్నిరకాల ప్రశ్నలను సంధించినప్పటికీ.. చంద్రబాబునాయుడు వాటికి చాలా సంయమనంతో సమాధానం చెప్పారు. ఇలాంటి ఊహాజనిత ప్రశ్నలకు తాను జవాబు చెప్పనని అన్నారు. పొత్తులు గురించి వేచిచూడాలని అన్నారు. మోడీ విధానాలను , విజన్ 2047ను బలపరచడం అనేది రాజకీయాలకు అతీతంగా , అభివృద్ధి దృష్టితో ఉండాలని కూడా అన్నారు. ఈ చర్చ మొత్తం ఎలా ఉన్నప్పటికీ మొత్తానికి తెలుగుదేశంతో బిజెపి పొత్తు కుదురుతుందనే సంకేతాలు ఈ ఇంటర్వ్యూ ద్వారా అందాయి.
తెలుగుదేశంతో జనసేన ఆల్రెడీ పొత్తు సంగతి దాదాపుగా కన్ఫర్మ్ అయిన సంగతి అందరికీ తెలుసు. బిజెపి కూడా పొత్తు పెట్టుకుంటే.. 2014 నాటి మ్యాజిక్ రిపీట్ అవుతుందని.. తమ పార్టీకి కూడా కొన్ని ఎమ్మెల్యే సీట్లు మంత్రిపదవులు వస్తాయని.. సోము వీర్రాజు కోటరీ మినహా కమలనాయకులు అందరూ కోరుకుంటున్నారు. అలాంటి వారికి ఈ సంకేతాలు ఆనందదాయకంగా ఉన్నాయి.
బిజెపి ఏపీలో ప్రస్తుతం శవాసంన వేసి ఉంది. ప్రస్తుత రాష్ట్ర నాయకత్వం ఏమాత్రం పార్టీకి ఊపిరిపోసేలా వ్యవహరించడమూ లేదు. పైగా పుల్ల విరుపు మాటలతో పొత్తు పొడవకుండా అడ్డు పడుతున్నారు. సొంతంగా ఒక్క సీటులోనైనా డిపాజిట్ తెచ్చుకునే సత్తా తమకు లేదని, జగన్ సర్కారుకు వ్యతిరేకంగా తెదేపాతో చేతులు కలిపితే లాభం ఉంటుందని చాలామంది బిజెపి నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబునాయుడు ఇంటర్వ్యూ, మోడీ విధానాలను ఆయన ఏకపక్షంగా సమర్థించడం, వాటికి అందరూ మద్దతివ్వాలని పిలుపు ఇవ్వడం లాంటి పరిణామాలు వారందరికీ ఆశావహంగా కనిపిస్తున్నాయి.
సోము తప్ప.. ఏపీ బీజేపీ నేతల కలతీరుతుందా?
Wednesday, January 22, 2025