ఎన్నికలకు ఎదుర్కోవడానికి కొత్త సారథిని నియమించాలంటే.. కమలదళం జడుసుకుంటున్నదా? మంచో చెడో ప్రస్తుతం సారథ్యం వహిస్తున్న వారినే కొనసాగిస్తే పార్టీ కట్టు తప్పకుండా ఉంటుందని భావిస్తున్నదా? అంటే అవుననే సమాధానమే మనకు వినిపిస్తుంది. పార్టీ సారథ్యం విషయంలో కేంద్రంలో జరిగిన మ్యాజిక్ ఏపీ విషయంలో కూడా రిపీట్ అయింది. కేంద్రంలో జెపి నడ్డాను కొనసాగించిన తీరులోనే ఏపీలో కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు కొనసాగించాలని బిజెపి అధిష్ఠానం నిర్ణయించింది.
సోము వీర్రాజును కొనసాగించడం పట్ల రాష్ట్ర పార్టీ నాయకుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నిర్ణయంతో పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. రాష్ట్ర పార్టీ అధ్యక్ష స్థానానికి ప్రాబబుల్స్ గా ప్రచారంలో ఉన్న కీలక నాయకులు ఈ కార్యవర్గ సమావేశానికి డుమ్మా కొట్టారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ గానీ, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి గానీ.. సమావేశానికి రాలేదు. అలాగే మాజీ ఎంపీలు సుజనాచౌదరి, టీజీ వెంకటేష్ కూడా రాలేదు. పార్టీకి కీలకమైన ఈ నాయకుల్లో సోము వీర్రాజు కొనసాగింపు నిర్ణయం పట్ల తీవ్రస్థాయిలో అసంతృప్తి ఉన్నదా అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది.
అదే సమయంలో సోము వీర్రాజు కొనసాగింపు కారణంగా భారతీయ జనతా పార్టీకి తొలిదెబ్బ కూడా తగిలింది. పూర్వ అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన వర్గానికి చెందిన సుమారు 500 నాయకులు కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి కూడా వ్యక్తిగత కారణాల మిష మీద డుమ్మా కొట్టిన కన్నా, రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కూడా గైర్హాజరయ్యారు. సోము కొనసాగింపు గురించి ముందే తెలిసినట్టుగా, సమావేశానికి వెళ్లకుండా ఉండిపోయిన ఆయన, సాయంత్రానికి తన అనుచరులతో సహా పార్టీకి రాజీనామా చేశారు. ఆయన వర్గం జనసేనలో చేరుతారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
సార్వత్రిక ఎన్నికల దాకా కొనసాగించడం అనేది అన్నిచోట్లా పనిచేసే థియరీ కాదనే సంగతి బిజెపి తెలుసుకోవాలి. జాతీయ అధ్యక్షుడి కొనసాగింపుతో ఎక్కడా వ్యతిరేకత రాలేదు. కానీ ఏపీలో సోము కొనసాగింపు పార్టీలోనే పలువురికి కంటగింపుగా ఉంది. పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకున్నదా అనే అభిప్రాయం అనేకమందికి కలుగుతోంది.
‘సోము’ కొనసాగింపుతో.. సెల్ఫ్ గోల్ వేసుకున్నారా?
Wednesday, January 22, 2025