సోము ఎజెండా.. దిగిపోయేలోగా పార్టీని ముంచాలి!

Thursday, September 19, 2024

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి సోము వీర్రాజు నాయకత్వం అనేది ఒక గ్రహణకాలం అని పార్టీలోనే కొందరు నాయకులు వ్యాఖ్యానిస్తుంటారు. పార్టీ ఇంకా సరిగా ఫోకస్ పెట్టడం లేదు గానీ.. సాధారణంగా ఆ పార్టీ నిబంధనల ప్రకారం ఈ పాటికి కొత్త అధ్యక్షుడు రావాలి. పైగా సోము వీర్రాజు అధ్యక్షుడు అయిన తర్వాత.. పార్టీ బలోపేతం కావడానికి ఉద్ధరించింది కూడా ఏమీ లేదు. పార్టీకి ఒరిగిన కొత్త ప్రయోజనమూ లేదు. ఇప్పుడు సోము వీర్రాజు తీరు మీద ఏపీ బీజేపీలో తిరుగుబాటు రేగుతోంది. కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యల నేపథ్యంలో.. తాజాగా ఏపీలో బిజెపిని పతనం చేసేఎజెండాతో సోము వీర్రాజు అడుగులు వేస్తున్నారేమో అనిపిస్తోంది.
సాక్షాత్తూ ప్రధాని మోడీ సమక్షంలో ఆయన అడిగితే.. ఆంద్రప్రదేశ్ లో ఎన్ని జిల్లాలు ఉన్నాయో కూడా చెప్పలేకపోయిన ఈ రాష్ట్ర అధ్యక్షుడి సమర్థత మీద పార్టీకి ఎందుకు నమ్మకం ఉంటుంది? అమరావతి కి అనుకూలంగా పార్టీ తీర్మానం చేసినప్పటికీ.. ఆ పోరాటాన్ని ఎద్దేవా చేసేలా మాట్లాడి.. అమిత్ షా తో అక్షింతలు వేయించుకున్న ఈ నాయకుడి మీద పార్టీ ఎలా విశ్వాసం ఉంచుతుంది? అందుకే తిరుపతి పార్టీ సమావేశంలో.. అమిత్ షా ఆగ్రహం ఎపిసోడ్ తరువాత.. సోము వీర్రాజు పదవి ఊడుతుందనే ప్రచారం పార్టీలో బాగా జరుగుతోంది. ప్రస్తుతం ఏడాదిలో రానున్న ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడానికి కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని నియమించనున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తన పదవి పోయేలోగా.. పార్టీని ఖాళీ చేసేయాలని సోము వీర్రాజు కంకణం కట్టుకున్నట్టుగా ఉంది. బిజెపిలో జగన్ కోవర్టులాగా పనిచేస్తుంటారని, జగన్ సర్కారు అనుకూల వైఖరితో వ్యవహరిస్తుంటారని సోము వీర్రాజు మీద చాలా ఆరోపణలున్నాయి. ఇవన్నీ కూడా ఆయన పార్టీ విస్తరణను అడ్డుకుంటున్నారనే అంతర్గత ఫిర్యాదులకు బలం చేకూరుస్తుంటాయి. ఇలాంటి సమయంలో ఆయన పార్టీలో కొందరు జిల్లా అధ్యక్షులను మార్చేయడం, వారంతా కన్నా హయాంలో నియమితులైన వారు కావడం.. కొత్త నియామకాల నేపథ్యంలో పలువురి అసంతృప్తులు, రాజీనామాలు ఈ ఎపిసోడ్ లో ఏపీ బిజెపి ఉక్కిరి బిక్కిరి అవుతోంది.
చూడబోతే తన పదవి ఊడేలోగా పార్టీని సమూలంగా ముంచేయడమే సోము వీర్రాజు ఎజెండాగా కనిపిస్తోందని పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. కన్నా అంటే వైరం కూడా ఉండవచ్చేమోగానీ.. జిల్లా అధ్యక్షులను మార్చే విషయంలో ఏకపక్ష నిర్ణయాలకు వెళ్లకుండా ఉండాల్సిందనే మాట బాగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని వారాల వ్యవధిలోనే సోము వీర్రాజు నుమార్చి పార్టీ అధిష్టానం కొత్త సారథి చేతిలో పగ్గాలు పెడుతుందని పార్టీ నాయకులే అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles