భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ఆందోళనలు నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్వయంగా ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఊరిలోనూ బిజెపి శ్రేణులు తమ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు.
.. రాష్ట్రవ్యాప్త నిరసనలు అనగానే.. ‘అబ్బా బిజెపి ఇన్నాళ్లకు గాడిలో పడ్డట్టున్నది కదా.. పోరాట మార్గాన్ని ఎంచుకున్నట్టున్నది కదా..’ అని అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. వారు చేస్తున్న నిరసనలు రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలు, అసమర్థ పరిపాలన గురించి, రాష్ట్ర ప్రజల సమస్యల గురించి ఎంతమాత్రమూ కాదు. ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకునే భజన కార్యక్రమాల్లో భాగంగా.. ఈ నిరసన, ఆందోళనలను చేపడుతున్నారు.
ఇంతకూ వారి నిరసనల కారణం, ఎజెండా ఏమిటో తెలుసా..? ప్రధాని మోదీపై.. పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అనుచిత వ్యాఖ్యలు చేశారట. అవి పాపం.. సోము వీర్రాజుకు మనస్తాపం కలిగించాయి. అందుకని ఆయన తన చేతిలో రాష్ట్ర పార్టీ పగ్గాలు ఉన్నాయి కదా అని.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చేశారు. ఈ ఫోటోలు వీడియోలు అన్నీ సేకరించుకుని.. వాటితో పెద్ద డాక్యుమెంటే తయారుచేసి… ప్రధాని మోడీకి, ఆయన కోటరీకి సమర్పించుకుని.. ‘ప్రధాని మోడీ గారి మీద ఈగవాలినా సరే.. ఊరుకునే రకం కాదు సార్ నేను..’ అంటూ తన వీరభక్తిని ప్రదర్శించడానికి వాడుకుంటారన్నమాట. ఇంతటి చీప్ ట్రిక్స్ తో రాజకీయం నడిపే సోమువీర్రాజు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఏం ఎదుగుతుంది?
సోము వీర్రాజు అనేటువంటి వార్డు మెంబరుగా ఓడిపోయిన నాయకుడికి కేవలం కులం అనే ప్రాతిపదిక మీద బిజెపి రాష్ట్ర సారథ్యాన్ని కట్టబెట్టింది. మొన్నటికి మొన్న రాష్ట్ర బిజెపి నాయకులతో ప్రధాని మోడీ సమావేశం నిర్వహిస్తే.. రాష్ట్రంలో ఎన్ని జిల్లాలున్నాయని ఆయన అడిగినప్పుడు చెప్పలేకపోయిన సమర్థుడు ఈ సోము వీర్రాజు. తాను పార్టీ అధ్యక్షుడుగా ఉన్న రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలియదు గానీ.. పొరుగు దేశం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలకు ఆయనకు రోషం పొడుచుకు రావడం గమనార్హం.
పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందనే జైశంకర్ వ్యాఖ్యలకు జవాబుగా, ఉగ్రవాదంతో భారత్ కంటె మేమే ఎక్కువ నష్టపోతున్నాం.. ప్రోత్సహించే అవసరం మాకు లేదు అంటూ.. బిలావల్ భుట్టో మరో తీవ్రమైన వ్యాఖ్య చేశారు. బిన్ లాడెన్ మరణించాడు గానీ.. గుజరాత్ కసాయి మాత్రం ఇంకా బతికేఉన్నాడు అని అన్నారు. ఆ వ్యాఖ్యలమీదనే ఇప్పుడు రాద్ధాంతం జరుగుతోంది. అయినా ఇది రెండు దేశాల మధ్యవ్యవహారం. భుట్టో వ్యాఖ్యలకు మనదేశ విదేశాంగ మంత్రి జైశంకర్ జవాబిస్తూనే ఉన్నారు.
‘‘జగన్ పాలన మీద చార్జిషీట్ తయారుచేయండి.. సమస్యలపై పోరాడండి’’అని విశాఖ పర్యటన సందర్భంగా మోడీ దిశానిర్దేశం చేస్తే ఆచరించడానికి రాష్ట్ర బిజెపికి ఇప్పటిదాకా గతిలేదు. కానీ, ఎక్కడో పాకిస్తాన్ మంత్రి ఒక మాట అంటే దానికి నిరసనగా ఒక భజన లాంటి నిరసన చేపట్టడానికి పూనుకోవడంలోనే.. సోమువీర్రాజు పార్టీకి పతనం నిర్దేశిస్తున్నారని అర్థమైపోతోంది. తమ సమస్యలు పట్టవు గానీ.. ఈ పార్టీ బిజెపికి మోడీ పై నిందలే పెద్ద సమస్యనా.. అని ఈ నిరసనల వల్ల ప్రజలు పార్టీని ఈసడించుకుంటే అందుకు బాధ్యత సోము వీర్రాజుదే అవుతుంది కదా..!
సోము ఉండగా.. బిజెపి ఇంతకంటె ఏం చేస్తుంది?
Monday, December 23, 2024