సోము.. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ!

Sunday, December 22, 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కశాతం ఓటు బ్యాంకు కూడా లేని, నోటా కంటె తక్కువ ఓట్లతో ప్రతిసారీ చరిత్ర సృష్టించే భారతీయ జనతా పార్టీ నాయకుల మాటలు మాత్రం కోటలు దాటుతుంటాయి. ఎన్నడైనా మీడియా ముందు మాట్లాడే చాన్స్ వస్తే చాలు.. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే పార్టీ మాదే అని ఢంకా బజాయించి చెప్పేస్తారు. విలేకర్లతో సహా విన్నవారు నవ్వుకుంటారనే స్పృహ వారికి ఉండదు. అందేంటంటే.. పవన్ కల్యాణ్ తో కలిసి అధికారంలోకి రాబోతున్నాం అంటారు. ఇదంతా పక్కన పెడితే.. ప్రస్తుతం.. పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ తర్వాత.. బిజెపితో మైత్రీబంధం పుటుక్కుమన్నట్టేననే పుకార్లు రాజకీయవర్గాల్లో హల్ చల్ చేస్తున్నాయి. పవన్ ప్రతిపాదనలకు బిజెపి పెద్దలు నో చెప్పడంతో.. ఆయన వారితో బంధం తెంచుకుని తెలుగుదేశంతో పొత్తును అధికారికంగా ప్రకటించడానికి ముహూర్తం వెతుక్కుంటున్నారు.

వారిద్దరి స్నేహబంధానికి ఆ రకంగా కాలం చెల్లింది. అయితే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అనే సామెత చందంగా.. బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పుడు చిలకపలుకులు పలుకుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు జనసేనతో కలిసి ఉద్యమం చేస్తాం అని అంటున్నారు. తమ రెండు పార్టీలు ఎప్పటికీ కలిసే ఉంటాయంటూ.. ‘ఏ ఫెవికాల్ సే హువా జోడ్ హై’ అన్నట్టుగా సెలవిస్తున్నారు. వారి బంధం పుటుక్కుమనడం గ్యారంటీ.. రోజుల వ్యవధిలోనా, వారాల వ్యవధిలోనా అని ప్రజలు ఎదురుచూస్తున్న వేళ.. కమలదళపతి సోము వీర్రాజు ఉమ్మడి పోరాటాల గురించి చెప్పడం తమాషాగా అనిపిస్తోంది.

పొత్తుబంధంలో ఉన్న నాలుగేళ్లలో తమ ఎన్డీయే భాగస్వామ్య పక్షం అయిన జనసేన సారథి పవన్ కల్యాణ్ తో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఎన్నిసార్లు ద్వైపాక్షిక సమావేశాలు జరిపారో లెక్కతీస్తే.. వారి బంధం ఎంత దృఢమైనదో ప్రజలకు అర్థమవుతుంది. జనసేనతో కనీస సంప్రదింపులు కూడా లేకుండా తమ పార్టీ కార్యక్రమాలు తాము చేసుకుంటాం అన్నట్టుగానే వారు వ్యవహరించారు. జనసేన కూడా అదేతీరుగా ఉండిపోయింది. ఒక్కశాతం ఓటు బ్యాంకు లేని పార్టీకి తాము గౌరవం ఇవ్వడం ఏంటి అన్నట్టుగా జనసేన, రాష్ట్ర బిజెపి శాఖను చిన్నచూపు చూసింది. పవన్ కల్యాణ్ వారిని ఎన్నడూ పట్టించుకోకుండా, ఢిల్లీ బిజెపితో మాత్రమే సంబంధాలు నెరపుతూ వచ్చారు. మొత్తానికి వీరి మొక్కుబడిబంధం ముగిసిపోయే సమయంలో.. సోము వీర్రాజు కలిసి పోరాడడం గురించి డైలాగులు వేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles