ప్రజల్లో తమకు ఆదరణ పెంచుకోవడానికి, తమ పాలన పట్ల విశ్వాసం పెంపొందించడానికి, అలా విశ్వాసం పెరుగుతున్నదనే సంగతిని బాగా ప్రచారం చేసుకోవడానికి రాజకీయ నాయకులు రకరకాల మార్గాలు అన్వేషిస్తుంటారు. అందులో కొన్ని సూపర్ హిట్ అవుతాయి, కొన్ని ఫ్లాప్ అవుతాయి. పైగా పార్టీకి నెగటివ్ ఆదరణ తెచ్చిపెడతాయి. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే.. చంద్రబాబునాయుడు, తనయుడు లోకేష్ తమ రాజకీయ ప్రత్యర్థుల మీదికి ప్రయోగించిన సెల్ఫీ మంత్రం సూపర్ హిట్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎన్నికల నాటికి ఈ సెల్ఫీ మంత్రం ఓటింగ్ మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు.
నిజానికి ఈ సెల్ఫీ చాలెంజ్ అనేది నారా లోకేష్ తో ప్రారంభం అయింది. పాదయాత్రలోనే తమ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసిన పనులు కనిపిస్తోంటే.. ఆయనకు ఈ ఐడియా వచ్చినట్టుంది. సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల ప్రాంతాల్లో విపరీతంగా ఉన్న పరిశ్రమల్లో ఉద్యోగాలకు వెళ్తున్న బస్సులనుచూసి.. ఆ బస్సుల్లో సెల్ఫీ దిగి.. ఆయన జగన్ కు సవాలు విసిరారు. నీ హయాంలో ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా, వస్తే సెల్ఫీ దిగి పెట్టండి అని సవాలు విసిరారు. ఈ సవాలు క్లిక్ అయింది. తర్వాత కియా వద్ద కూడా సెల్ఫీ దిగి జగన్ ని ట్యాగ్ చేశారు. చంద్రబాబునాయుడు టిడ్కో ఇళ్ల వద్ద దిగిపెట్టిన సెల్పీ కూడా సూపర్ హిట్ అయింది. దాని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి వైసీపీ మంత్రులు నానా తప్పుడు పోస్టులు , తప్పుడు ఫోటోలు ప్రచారంలో పెట్టాల్సి వచ్చింది.
తీరా నెమ్మదిగా ఈ సెల్ఫీ చాలెంజిలు కీలకంగా మారుతున్నాయి. తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి పనుల వద్ద కార్యకర్తలు సెల్ఫీలు దిగి , జగన్ ను ట్యాగ్ చేసి పెట్టాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
జగన్ కోటరీనుంచి దీనికి ఆన్సర్ లేదు. పథకాలు అందుతున్న ఏ పేద ఇంటిముంగింట అయినా నిల్చుని సెల్ఫీ దిగే దమ్ముందా అని జగన్ ప్రతి సవాలు విసిరారు తప్ప అందులో పసలేదు. అభివృద్ధి పనుల ప్రస్తావన తెస్తే.. దానికి జవాబుగా జనం ఇళ్ల వద్ద సెల్ఫీలు దిగమనడమే పెద్ద డొల్ల సమాధానం. ఈ సెల్ఫీచాలెంజీలను జగన్ స్వీకరించకపోతే.. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి జరగనేలేదనే చెడ్డపేరు తప్పదు. కౌంటర్ సెల్ఫీలు పెట్టదలచుకుంటే.. తాము చేసిన అభివృద్ధి పనులేమీ లేవు. ఇలాంటి సంకట పరిస్థితుల్లోకి ప్రభుత్వాన్ని, ఈ సెల్ఫీ చాలెంజి నెట్టేస్తున్నది.
‘సెల్ఫీ మంత్రం’.. వైసీపీని పెద్దదెబ్బే కొడుతుందా?
Sunday, January 19, 2025