సెమీ ఫైనల్స్‌కు మోడీ స్పెషల్ బిస్కెట్!

Saturday, September 7, 2024

కేంద్రప్రభుత్వం వంటగ్యాస్ ధరలను తగ్గించింది. దేశవ్యాప్తంగా ప్రతి వినియోగదారుడికి  ఒక్కో సిలిండరు మీద రూ.200 ధర తగ్గిస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. గృహావసరాలకు వాడే గ్యాస్ సిలిండర్ ధర ఇప్పటికే 1100 రూపాయల వరకు చేరుకుంది. ఈ తగ్గింపు వలన వినియోగదారులకు రూ.900 కే లభిస్తుంది. ఓణం, రక్షాబంధన్ పర్వదినాల సందర్భంగా.. దేశంలోని సోదరినులు అందరికీ మోడీ ఈ కానుక ప్రకటించారని కేంద్రం వెల్లడించింది. ఈ గ్యాస్ ధర తగ్గింపును రక్షాబంధన్ కానుకగా బిజెపి నేతలు అభివర్ణిస్తున్నారు గానీ.. దేశంలో సెమీఫైనల్స్ గా పరిగణించే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరబోతున్న తరుణంలో ప్రజలను ఆకట్టుకోవడానికి విసిరిన బిస్కట్ గా పలువురు భావిస్తున్నారు.

మోడీ సర్కారు వచ్చిన తర్వాత.. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతూ పోతున్నాయి. తొమ్మిదేళ్ల మోదీ సర్కారు పాలనలో పెట్రోలు, డీజిలు ధరలు అచ్చంగా రెట్టింపు అయ్యాయి. గ్యాస్ సిలిండర్ల విషయంలో ఉన్న సబ్సిడీలను దారుణంగా తొలగిస్తూ వచ్చారు. దానికి తోడు ధర పెంచుకుంటూ పోయారు. రెండూ వెరసి సిలిండర్ ధర సుమారు మూడు రెట్లు పెరిగిందనే చెప్పాలి. గ్యాస్ దర పెరిగిన ప్రతి సందర్భంలోనూ విపక్ష పార్టీలు రాజ్యం చేస్తున్న చోట్ల రెండు రోజుల పాటు ఖాళీ సిలిండర్లతో రోడ్ల మీద ధర్నాలు చేయడం తప్ప.. కేంద్రం మెడలు వంచగల, పంజాబ్ రైతు ఉద్యమం లాంటి పోరాటాలు సాగలేదు. ధరల పెంపుదలకు కూడా ప్రజలు అలవాటు పడిపోయారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హఠాత్తుగా కేంద్రప్రభుత్వం 200 రూపాయల ధర తగ్గిస్తున్నట్టుగా ప్రకటించింది. ఉజ్వల పథకం కింద కేంద్రం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు పొందిన వారికి ఇప్పటికే 200 సబ్సిడీ అందుతోంది. ఇప్పుడు చేసిన తగ్గింపు వారికి కూడా వర్తిస్తుంది. దాంతో వారికి రూ.700కే సిలిండర్ లభిస్తుంది.

అయితే మోడీ తాను తాయిలాల రాజకీయాలకు విరుద్ధం అని , బిస్కెట్ రాజకీయాలు దేశ ప్రగతిని నాశనం చేస్తాయని చాలా తరచుగా అంటూ ఉంటారు. అలాంటి మోడీ సర్కారు ఇప్పుడు హఠాత్తుగా రక్షాబంధన్ సందర్భంగా చెల్లెమ్మల మీద ఈ ప్రేమ ఎందుకు కురిపిస్తున్నారు? ఇదంతా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చేస్తున్న బిస్కెట్ రాజకీయమేనని అందరూ అనుకుంటున్నారు. పైగా ముందున్న పార్లమెంటు ఎన్నికల్లో కూడా గ్యాస్ , పెట్రోలు ధరలు ఒక ప్రచారాంశం అయ్యే నేపథ్యంలో కాస్త వ్యూహాత్మకంగా ఇప్పుడే ధర తగ్గించినట్టుగా తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles