వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిలు మీద బయట తిరగగల అవకాశం మరో రెండు నెలల్లో ముగిసిపోవచ్చు. భారత సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు అలాగే కనిపిస్తున్నాయి. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి మరొక కీలక నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి బెయిలు మంజూరు చేయాలనే కోరికతో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు.. ఒక హెచ్చరికలాగా ఉన్నాయి. ఇది హత్య కేసు అని.. బెయిలు ఇవ్వడం అనేది అంత సులువుగా తేల్చేయాల్సిన వ్యవహారం కాదని సుప్రీం వ్యాఖ్యానించింది.
ఎంపీ అవినాష్ రెడ్డి ప్రస్తుతం బెయిలుపై బయట ఉన్నారు. ఆయన తండ్రి భాస్కరరెడ్డి సహా మిగిలిన నిందితులు జైల్లోనే ఉన్నారు. వారికి బెయిలు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. భాస్కరరెడ్డికి బెయిలు ఇస్తే.. ఆయన కేసు విచారణను, సాక్షులను ప్రభావితం చేయగలరు అన్న సీబీఐ వాదనతో కోర్టు ఏకీభవించింది. ఆయనకు బెయిలు ఇవ్వడానికి నిరాకరించింది. అదే సమయంలో.. అవినాష్ కు అప్పటికే మంజూరు చేసిన బెయిలుమీద చాలా విమర్శలు వినిపించాయి. తండ్రికంటె ఎంపీ హోదాలో ఉన్న అవినాష్ రెడ్డి ఇంకా బలమైన వ్యక్తి కదా.. ఆయన ఇంకా ఎక్కువగా కేసును ప్రభావితం చేయగలరు కదా..? అనే వాదన వినిపించింది. ఏది ఏమైనప్పటికీ.. అవినాష్ ప్రస్తుతం బెయిలు మీద ఉన్నారు. ఈ నేపథ్యంలో అవినాష్ బెయిలు రద్దుతోపాటు, ఎర్ర గంగిరెడ్డి కి బెయిలు కోరుతున్న పిటిష్లు సుప్రీంలో ఉన్నాయి.
ఎర్ర గంగిరెడ్డి కి వెంటనే బెయిలు ఇవ్వాలన్న వాదనలపై సుప్రీం న్యాయమూర్తి ఆగ్రహించారు. ‘ఇది హత్యకేసు. బెయిలు వ్యవహారాలు ఆచితూచి ఉంటాయి. చాలా సాక్ష్యాలు ఉన్నాయి. బెయిలు కోసం వేచిచూడాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. గంగిరెడ్డి బెయిలు పిటిషన్ ను, అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్ తో జత చేయవద్దు అన్న కోరికను కూడా కోర్టు తిరస్కరించింది. గంగిరెడ్డికి బెయిలు ఇవ్వాలని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం గతంలో స్టే విధించింది. ఆ స్టే ఎత్తేయాలనే విషయం మీదనే ఇప్పుడు దావా నడుస్తోంది.
ఈ రెండు పిటిషన్లను కలిపి సెప్టెంబరులో విచారిస్తామనం సుప్రీం తెలియజేసింది. అంటే సెప్టెంబరు దాకా అవినాష్ రెడ్డి బెయిలుకు వచ్చిన నష్టమేమీ లేదు. సెప్టెంబరులో రెండింటినీ కలిపి విచారించినప్పుడు.. గంగిరెడ్డి బెయిలు వినతిని తిరస్కరించట్లయితే.. ఇంచుమించుగా ఆ ప్రభావం.. అవినాష్ బెయిల్ మీద పడుతుందని.. ఆయన బెయిల్ రద్దు కావచ్చునని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సెప్టెంబరులో అవినాష్ రెడ్డికి ప్రమాద సంకేతాలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు.