వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన సునీల్ యాదవ్ కు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నదనే సీబీఐ వాదనతో ఏకీభవించింది. సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ వేసిన కౌంటర్లోనే ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ల పాత్ర గురించి కీలక వ్యాఖ్యలు ఉన్న సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. వారి పాత్ర హత్య వెనుక స్పష్టంగా ఉన్నట్టు సీబీఐ పేర్కొంది.
అయితే సునీల్ యాదవ్ కు బెయిలు దొరక్కపోవడం అనేది ఎంపీ అవినాష్ రెడ్డికి ప్రమాద సంకేతమే అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. గూగుల్ టేకఅవుట్ ద్వారా.. అవినాష్ రెడ్డి ఇంట్లోనే హత్యకు ముందు సునీల్ యాదవ్ ఉన్నట్టుగా సీబీఐ చాలా స్పష్టమైన ఆధారాలు సేకరించింది. ప్రస్తుతానికి – ‘‘వివేకా హత్య వెనుక పలుకుబడి కలిగిన వ్యక్తులున్నారు. ఆధారాలున్నాయి. కీలక సమాచారం ఉన్నది గానీ.. ఈ దశలో కోర్టుకు వెల్లడించలేం’’ అని సిబిఐ కోర్టులో పేర్కొన్నదానిని బట్టి.. వైసీపీ పెద్ద తలకాయలకు ముప్పు తప్పదని పలువురు అంచనా వేస్తున్నారు.
సునీల్ యాదవ్ అనే నిందితుడు అవినాష్ ఇంట్లోనే గొడ్డలి వచ్చేదాకా వేచిఉండి, ఆతర్వాత వెళ్లి హత్య చేశాడనేది సీబీఐ ఆరోపణ. పథక రచనతో సహా హత్య ఎపిసోడ్ లో సునీల్ యాదవ్ కీలకం అని పేర్కొంటోంది.
సునీల్ యాదవ్ బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని సీబీఐ బెయిల్ ను అడ్డుకుంది. అయితే లోపల ఉండిపోతే.. ఆయనను ప్రభావితం చేయడానికి సీబీఐ చెబుతున్న ‘పలుకుబడి కలిగిన వ్యక్తులకు’ సాధ్యం కాదని పలువురు భావిస్తున్నారు. ఆ మేరకు సునీల్ యాదవ్ తమకు వ్యతిరేకంగా ఏమీ చెప్పకుండా ప్రలోభ పెట్టగల అవకాశాలు వారికి తగ్గుతున్నాయని భావిస్తున్నారు.
ఈ విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలను గమనించాలి. సీబీఐ అధికారులు కేసులో విచారణకు ఎవరినైనా సాక్షిగా పిలిచినప్పటికీ, లేదా, ఇతర వివరాల కోసం పిలిచినప్పటికీ.. ఆ తర్వాతనైనా వారిని నిందితుడిగా మారుస్తూ అరెస్టు చేయడానికి అన్ని అధికారాలు ఉంటాయని హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం విచారణకు హాజరవుతున్న అవినాష్ రెడ్డి వంటి ప్రముఖులకు ఇది ప్రమాదకరమైన సంకేతం. రెండోసారి విచారణకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ తీరుమీదనే అవినాష్ ఆరోపణలు చేశారు. తనను మరోసారి రావాల్సిందిగా చెప్పలేదని అన్నారు. అయితే ఆయన తండ్రి భాస్కర రెడ్డి విచారణ జరగాల్సి ఉంది. అది పూర్తయ్యాక.. అవినాష్ ను సీబీఐ మరోసారి పిలిచే అవకాశం ఉన్నదని కూడా కొందరు అంచనా వేస్తున్నారు.
ఏ రకంగా చూసినప్పటికీ.. సునీల్ యాదవ్ కు బెయిలు దొరక్కపోవడం అనే వ్యవహారం.. అవినాష్ అండ్ కో గుండెల్లో ప్రమాదఘంటికలు మోగిస్తున్నదని అనిపిస్తోంది.
సునీల్ బెయిల్ ఎపిసోడ్.. అవినాష్‌కు ప్రమాద ఘంటికలే!
Monday, December 23, 2024