తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలని సునీత సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్2కు తొలిదశలో ఎదురుదెబ్బ తగిలింది. ఆమె తరఫు వాదనలను విన్న ధర్మాసనం.. బెయిల్ రద్దు గురించి నిర్ణయం తీసుకోకుండా.. వాయిదా వేసింది. ఇది అత్యవసరంగా వినవలసిన అవసరం ఉన్న కేసు కాదని, వేసవి సెలవుల తర్వాత కోర్టు తిరిగి తెరచిన తర్వాత వాదనలు వింటామని పేర్కొన్నది. తదుపరి విచారణ ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది.
విచారణ సందర్భంగా వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత సుప్రీం ధర్మాసనం ఎదుట స్వయంగా తన వాదనలు వినిపించారు. విశ్లేషకులు మాత్రం.. సునీత స్వయంగా వాదనలు వినిపించడం వల్లనే వాయిదా పడిందని లేకపోతే కేసు తేలిపోయి ఉండేదని అంటున్నారు. బెయిల్ రద్దు ఎందుకు అవసరమో ఆమె తన వాదనలను సమర్థంగా చెప్పలేకపోయారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సునీత తన వాదనల్లో భాగంగా.. సీబీఐ దర్యాప్తునకు అవినాష్ రెడ్డి ఏమాత్రం సహకరించడం లేదని, ఏప్రిల్ 24 తర్వాత సీబీఐ మూడుసార్లు నోటీసులు ఇచ్చినా.. ఆయన విచారణకు హాజరు కాలేదని, అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తల్లి అనారోగ్యాన్ని సాకుగా చూపించారని, సాక్షులను ఎంపీ బెదిరిస్తూ, ఇతర నిందితులతో కలిసి వారిని ప్రభావితం చేస్తున్నారని తెలియజేశారు.
సీబీఐ విచారణకు సహకరించడం లేదనే అంశం ఫోకస్ లోకి రావడం వల్ల వాదనలు తేలిపోయినట్టుగా పలువురు భావిస్తున్నారు. విచారణకు సహకరించడం, సహకరించకపోవడం అనేది సీబీఐకు సంబంధించిన వ్యవహారం అంటూ సుప్రీం దర్మాసనం అభిప్రాయపడింది. ఆ విషయం సునీతకు సంబంధం లేదన్నట్టుగా వ్యాఖ్యానించింది. పైగా అవినాష్ రెడ్డికి బెయిలు మంజూరు చేసిన సందర్భంలో నిబంధనల ప్రకారం.. జూన్ నెలలో ఇప్పటికే రెండు శనివారాలు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఆ నేపథ్యంలో ఆయన సహకరించడం లేదనే మాటకు విలువలేకుండా పోయింది. అవినాష్ కు కస్టోడియల్ విచారణ అవసరం అని చెప్పిన సునీత మాటలను కూడా సుప్రీం పట్టించుకోలేదు. ఆ సంగతి సీబీఐ కి సంబంధించినదని తేల్చేసింది.
ఈ వ్యాఖ్యలన్నీ కాకుండా.. ఎంపీ హోదాలో ఉంటూ రాజకీయంగా బలవంతుడైన అవినాష్ రెడ్డి బెయిలుపై బయట ఉండడం వలన సాక్షులను ప్రభావితం చేస్తున్నారు, భయపెడుతున్నారు.. అనే ఒకే వాదనకు సునీత కట్టుబడి ఉంటే ఫలితం ఇంకోలా ఉండేదని పలువురు అంటున్నారు. అవినాష్ తండ్రి భాస్కర రెడ్డి బెయిలు పిటిషన్ ను కోర్టు తిరస్కరించిన కారణాలను ఇక్కడ ఉదాహరించి ఉంటే సరిపోయేదని పేర్కొంటున్నారు. అదే కారణాల చేత భాస్కరరెడ్డి బెయిల్ తిరస్కరించారని, తండ్రికంటె బలవంతుడైన అవినాష్ రెడ్డి సాక్షులను ఇంకా ఎక్కువ ప్రభావితం చేస్తారని అని ఉంటే యింకోలా ఉండేదని అంటున్నారు. కోర్టు గమనించే అంశాల గురించి ఆలోచన లేకుండా సొంతంగా వాదనలు వినిపించి అనవసర విషయాల ప్రస్తావన ఎక్కువ కావడం వలన వాయిదా పడిందని అనుకుంటున్నారు.
సునీత.. సొంతవాదనల వల్లనే దెబ్బతిన్నదా?
Tuesday, December 24, 2024